టీమిండియా ఫ్యాన్స్‌కి జస్‌ప్రీత్ బుమ్రా గుడ్‌న్యూస్.. రీఎంట్రీపై సంకేతం

భారత క్రికెట్ అభిమానులకి ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గుడ్‌న్యూస్ చెప్పాడు. వెన్ను గాయం కారణంగా గత 10 నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉండిపోయిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఈ ఏడాది మార్చిలో న్యూజిలాండ్‌కి వెళ్లి సర్జరీ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్నాడు. అయితే తాజాగా బౌలింగ్ స్పైక్స్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బుమ్రా.. ‘హలో ఫ్రెండ్.. మళ్లీ మనం కలుస్తున్నాం’ అని రాసుకొచ్చాడు.

గత ఏడాది సెప్టెంబరులో చివరిగా భారత్ తరఫున మ్యాచ్‌ ఆడిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఆ తర్వాత వెన్ను గాయంతో టీమ్‌కి దూరంగా ఉండిపోయాడు. దాంతో ఆసియా కప్ -2022తో పాటు టీ20 వరల్డ్‌కప్ -2022కి కూడా బుమ్రా దూరమయ్యాడు. అయితే.. ఈ ఏడాది జనవరిలో అతను రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. శ్రీలంకతో సిరీస్‌ కోసం టీమ్‌లోకి కూడా ఎంపికయ్యాడు. కానీ సిరీస్‌ ఆరంభానికి ముందే మళ్లీ పాత వెన్ను గాయం తిరగబెట్టింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యుల సూచనల మేరకు న్యూజిలాండ్‌లో సర్జరీ చేయించుకున్నాడు.

సర్జరీ కారణంగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గవాస్కర్ ట్రోఫీతో పాటు ఐపీఎల్ 2023కి కూడా జస్‌ప్రీత్ బుమ్రా దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. అలానే జూన్ 7 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌కి కూడా బుమ్రా ఎంపికవలేదు. కానీ ఈ ఏడాది సెప్టెంబరులో ఆసియా కప్ -2023 జరగనుంది. దాంతో ఈ టోర్నీ టైమ్‌కి బుమ్రా రీఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

2023-05-27T16:31:37Z dg43tfdfdgfd