SRH: వార్నర్ గుండెల్లో సన్‌రైజర్స్‌‌పై ప్రేమ.. రీసెంట్‌గా బయటపెట్టిన డేవిడ్ భాయ్!

డేవిడ్ వార్నర్ పేరు వినగానే తెలుగు వాళ్లకు ఆస్ట్రేలియా క్రికెటర్ ఎక్కువగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెనే గుర్తొస్తాడు. ఏ ముహూర్తాన సన్‌రైజర్స్ జట్టులో చేరాడో గానీ.. అతడు జట్టులో ఉన్నన్నాళ్లూ సన్‌రైజర్స్‌కు స్వర్ణ యుగం నడిచింది. హైదరాబాద్ తన రెండో ఇల్లు అని వార్నర్ గర్వంగా చెప్పుకునేవాడు. 2021 సీజన్లో వార్నర్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడగా.. కెప్టెన్సీ నుంచి తప్పించిన ఫ్రాంచైజీ యాజమాన్యం తర్వాత తుది జట్టు నుంచి కూడా తప్పించింది. చివరికి అతడితో వాటర్ బాటిళ్లు మోయించింది. ఫ్యాన్స్ దీన్ని జీర్ణించుకోలేకపోయారు. తర్వాత వార్నర్ మళ్లీ సన్‌రైజర్స్‌లో కనిపించలేదు.

2022 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న డేవిడ్ వార్నర్‌కు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వార్నర్‌కి కూడా తెలుగు ప్రజలపై ఇష్టం ఏమాత్రం తగ్గలేదు. అంతేకాదు సన్‌రైజర్స్‌కి వ్యతిరేకంగా అతడు ఇంత వరకూ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. తాజాగా సన్‌రైజర్స్ విషయమై వార్నర్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

గౌరవ్ కపూర్ నిర్వహిస్తోన్న బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షోలో పాల్గొన్న వార్నర్.. సన్‌రైజర్స్‌కు ఆడిన సమయంలో ఎంజాయ్ చేశానని చెప్పాడు. ‘2016లో టోర్నమెంట్ గెలవాలంటే మేం మరో 4 మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. గెలుపు బాధ్యతను బౌలర్లకు అప్పగించాను. మీరు బౌలింగ్‌కు వచ్చినప్పుడు ఇదే చివరిది అనుకోండని చెప్పాను. అలా మేం గెలిచాం. మేం టోర్నీ గెలవడానికి ముఖ్య కారణం మా బౌలర్లే’ అని వార్నర్ తెలిపాడు.

2016 సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ విజేతగా నిలిచింది. ఇప్పటి వరకూ మరే జట్టు కూడా ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి ఐపీఎల్ టైటిల్‌ను గెలుపొందలేదంటే వార్నర్ కెప్టెన్సీ గొప్పతనమేంటో అర్థం చేసుకోవచ్చు. ఆ సీజన్లో బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి ప్రత్యర్థిని వణికించగా.. డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ బ్యాట్‌తో సత్తా చాటారు. 2016లో 9 హాఫ్ సెంచరీలు చేసిన వార్నర్ 848 పరుగులు చేయగా.. ధావన్ 501 పరుగులు చేశాడు. ఆ సీజన్లో విరాట్ కోహ్లి (973) మాత్రమే వార్నర్ కంటే ఎక్కువ పరుగులు చేశాడు.

2023-05-26T11:01:10Z dg43tfdfdgfd