కమిన్స్ కమిట్మెంట్ ఇది.. వరల్డ్ కప్ గెలవడం వెనుక 2022 నవంబర్ 15న తీసుకున్న ఆ నిర్ణయం!

ఒకే ఏడాదిలో... సరిగ్గా చెప్పాలంటే ఆరు నెలల వ్యవధిలో రెండు ఐసీసీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించింది. జూన్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియాను ఓడించిన ఆసీస్.. ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్లోనూ చిత్తు చేసింది. మధ్యలో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌ను నిలబెట్టుకుంది. అప్పుడు ఇంగ్లిష్ గడ్డ మీద ప్రధాన పేసర్ బుమ్రా, వికెట్ కీపర్ రిషబ్ పంత్ లేకుండా ఆడాం కాబట్టి ఓడామని సరిపెట్టుకున్నాం. మరిప్పుడు బుమ్రా ఉన్నాడు.. మన బ్యాటర్లు, బౌలర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. అయినా సరే ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించలేకపోయాం.

ఆస్ట్రేలియా ఇలా వరుసబెట్టి ప్రధాన టోర్నీ్ల్లో గెలవడానికి, మనం ఓడటానికి చాలా కారణాలే ఉన్నాయి. ఫైనల్‌లో ఆడుతున్నామనే ఒత్తిడి ఓ కారణమైతే, సరైన సన్నద్ధత, విశ్రాంతి లేకపోవడం మరో కారణం. నాకౌట్ మ్యాచ్‌ల్లో మిగతా జట్లు ఒత్తిడికి లోనైతే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం అందుకు విరుద్ధంగా ఎంతో స్వేచ్ఛగా ఆడతారు. ఇది మనం ఎప్పటి నుంచో చూస్తున్నదే. ఒత్తిడిని అధిగమించే విషయంలో మనం మెరుగుపడాల్సి ఉంది.

అయితే ఇక రెండో కారణంగా చెప్పింది సన్నద్ధత గురించి, తీరిక లేని ఆట గురించి. భారత క్రికెట్ బోర్డుకు ఐపీఎల్ కాసుల వర్షం కురిపిస్తోంది. ఏటా వేలకోట్ల రూపాయలు ఐపీఎల్ నిర్వహణ ద్వారా సమకూరుతున్నాయి. ఐపీఎల్ ద్వారా సంపాదన మాత్రమే కాదు.. భారత ఆటగాళ్లపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. తీరిక లేకుండా క్రికెట్ ఆడాల్సి రావడమే దీనికి కారణం.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు పది రోజుల వరకూ భారత ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆడారు. వేర్వేరు జట్ల తరఫున పొట్టి ఫార్మాట్‌లో ఆడిన ఆటగాళ్లు.. వెంటనే లాంగ్ ఫార్మాట్‌కు అలవాటు పడటం కష్టమైంది. అదే ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలివిగా వ్యవహరించాడు. ఈ ఏడాది కాలంలో ఐసీసీ షెడ్యూల్‌ను చూసి.. దానికి అనుగుణంగా తన షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. తాను ఐపీఎల్ 2023 ఆడటం లేదని 2022 నవంబర్ 15న ప్రకటించిన కమిన్స్.. 2023 నవంబర్ 19న వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్, యాషెస్ సిరీస్, వరల్డ్ కప్ లాంటి పెద్ద పెద్ద టోర్నీలు ఉండటంతో.. ఐపీఎల్‌కు దూరంగా ఉండిపోయాడు. తీరిక లేకుండా క్రికెట్ ఆడటం కంటే ఐపీఎల్ సమయంలో విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని భావించాడు. అతడి నిర్ణయమే సరైందని ఆసీస్ సాధించిన విజయాలు నిరూపిస్తున్నాయి.

అదే భారత ఆటగాళ్ల విషయానికి వస్తే.. ఐపీఎల్ ముగిసీ ముగియగానే డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాల్సి వచ్చింది. తద్వారా సన్నద్ధతకు సరైన సమయం లభించలేదు. ఈ విషయాన్ని రాహుల్ ద్రవిడే స్వయంగా చెప్పాడు. ఐపీఎల్ టైంలో కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చేలా ఫ్రాంచైజీలతో మాట్లాడతామని రోహిత్ చెప్పాడు. అయితే విశ్రాంతి లేకుండానే ఆటగాళ్లు దాదాపుగా అన్ని మ్యాచ్‌లు ఆడారు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ సైతం ఐపీఎల్ ముగియగానే ఉండనుంది.

2023-11-20T07:13:31Z dg43tfdfdgfd