హార్దిక్ పాండ్యా VS రోహిత్ ఫ్యాన్స్.. ఈ వార్ ఆగేదెలా! ముంబై ఏం ఆలోచిస్తోంది?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024ను ముంబై ఇండియన్స్ జట్టు ఓటమితో ఆరంభించింది. ఇలా సీజన్ తొలి మ్యాచులో ఓడిపోవడం ఆ జట్టుకు కొత్తేమీ కాదు. 2012 నుంచి ఇదే జరుగుతోంది. అయితే తొలి మ్యాచులో ఓడిపోవడం అనేది పెద్ద విషయం కాదు. లీగ్‌లో ఆడే పది జట్లలో ఐదు టీమ్‌లు ఓటమితోనే సీజన్‌ను ప్రారంభిస్తాయి.

కానీ ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీకి ఇప్పుడొక పెద్ద సమస్య వచ్చిపడింది. టోర్నీలోనే విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై.. గత కొన్నేళ్లుగా ఆశించిన మేర రాణించలేకపోతోంది. ఇది చాలదన్నట్టు ఈ సీజన్‌కు ముందు ఆ ఫ్రాంఛైజీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఒకప్పుడు ముంబైకి ఆడిన హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకొచ్చి అతడి కోసం.. ఏకంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను.. ముంబై సారథ్య బాధ్యతల నుంచి తప్పించడం కలకలం రేపింది. నిర్ణయం ఫ్రాంఛైజీకి.. ఆ జట్టు అభిమానులకు మధ్య దూరాన్ని పెంచింది.

కెప్టెన్‌గా రోహిత్ శర్మను మార్చారు అనే విషయం కంటే కూడా.. మార్చిన తీరే.. అభిమానులకు రుచిచండం లేదు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ, ముంబై జట్లకు విశేష ఆదరణ ఉంటుంది. అందుకు కారణం ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఆ జట్టు ఫ్యాన్స్‌లో మెజారిటీ వాటా.. ఈ ప్లేయర్లదే. ఇలాంటి వారి విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ముందే ఆయా ఫ్రాంఛైజీలు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. చెన్నై, ఆర్సీబీ జట్లు అలాగే చేశాయి.

ఈ సీజన్ ప్రారంభానికి ఒక్క రోజు ముందు సీఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ తప్పుకున్నాడు. వెంటనే రుతురాజ్ గైక్వాడ్ సీఎస్కే కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఇదంతా సామరస్యంగా, పద్దతి ప్రకారం జరిగింది. విరాట్ కోహ్లీ సైతం.. తనంతట తానుగానే ఆర్సీబీ కెప్టెన్సీని వదులుకున్నాడు. కెప్టెన్ కాకున్నా.. ఆర్సీబీ యజమాన్యం విరాట్ కోహ్లీని ఎక్కడా తక్కువ చూడలేదు. జట్టులో అతడికి ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. దీంతో సీఎస్కే, ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా కెప్టెన్సీ మార్పుపై పెద్దగా ఆలోచించలేదు.

కానీ ముంబై విషయానికి వస్తే ఇందుకు భిన్నంగా జరిగింది. ఐదు సార్లు జట్టును ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ను బలవంతంగా తప్పించిటన్లు సంకేతాలు వచ్చాయి. దీన్ని ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. దీంతో టోర్నీ ఆరంభ మ్యాచులోనే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది. టాస్‌ వేసినప్పటి నుంచీ.. మ్యాచ్ ముగిసే వరకు ఛాన్స్ దొరికిన ప్రతీసారి.. అహ్మదాబాద్ స్టేడియంలోని ఫ్యాన్స్ మొత్తం హార్దిక్‌ను హేళన చేశారు. అహ్మదాబాద్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే.. ముంబై హోమ్ గ్రౌండ్ వాంఖడేలో పరిస్థితి ఎలా ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇలా హార్దిక్ పాండ్యాను హేళన చేయడం తొలి మ్యాచుకే పరిమితమయ్యేలా మాత్రం కన్పించడం లేదు.

ఎప్పుడూ థర్టీ యార్డ్ సర్కిల్‌లోనే ఫీల్డింగ్ చేసే రోహిత్‌ను బౌండరీ దగ్గర్నే ఎక్కువ సేపు ఉంచాడు హార్దిక్. ఇది వివాదాస్పదంగా మారింది. బుమ్రా లాంటి స్టార్ బౌలర్ ఉండగా.. ముంబై బౌలింగ్ ఎటాక్‌ను హార్దిక్ పాండ్యా ప్రారంభించడం కూడా చర్చనీయాంశంగా మారింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఫ్యాన్స్‌ నుంచి ఈస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వీటికి చెక్ పెట్టేలా ముంబై యాజమాన్యం ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది ఉత్కంఠగా మారింది.

2024-03-26T06:01:19Z dg43tfdfdgfd