సిక్సర్‌తో ఐపీఎల్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సమీర్ రిజ్వీ.. సీఎస్కే ఏరికోరి తీసుకుంది అందుకేనా?

రషీద్ ఖాన్.. ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడు. అలాంటి వ్యక్తి బౌలింగ్‌లోనే 20 ఏళ్ల క్రికెటర్ సిక్సర్ బాదాడు. అది కూడా తన తొలి మ్యాచులో తొలిసారి బ్యాటింగ్‌కు వచ్చి. అతడెవరో కాదు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సమీర్ రిజ్వీ. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ యంగ్ ప్లేయర్.. ఐపీఎల్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే స్టాండ్స్‌లోకి పంపించాడు. ప్రత్యర్థి బౌలర్లకు, ఇతర జట్లకు గట్టి సంకేతాలు పంపించాడు. ఇంతకీ సమీర్ రిజ్వీ ఎవరు? అతడి నేపథ్యం ఏమిటి?

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సమీర్ రిజ్వీ.. ఆ రాష్ట్రంలో జరిగిన టీ20 లీగ్‌తో వెలుగులోకి వచ్చాడు. ఆ టోర్నీలో కాన్పూర్ సూపర్‌స్టార్స్ టీం తరఫున బరిలో దిగాడు. తన హిట్టింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏకంగా టోర్నీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. గోరఖ్‌పుర్ లయన్స్ జట్టుపై ఈ ప్లేయర్.. 49 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. ఇక ఆ టోర్నీలో మొత్తంగా రెండు సెంచరీలతో 9 ఇన్నింగ్స్‌ల్లోనే 455 పరుగులు చేశాడు.

మంచినీరు తాగినంత ఈజీగా సిక్సర్లు కొట్టడం సమీర్ రిజ్వీ నైజం. యూపీ టీ20 లీగ్‌లో తన జట్టు కాన్పూర్ తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌ కూడా రిజ్వీనే కావడం గమనార్హం. పురుషుల అండర్-23 స్టేట్-ఏ టోర్నమెంట్‌లో ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ మెరిశాడు. రాజస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 65 బంతుల్లోనే 91 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ లీగ్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఫైనల్ మ్యాచులో 50 బంతుల్లోనే 84 రన్స్ చేసి జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ లీగ్‌లో మొత్తం 37 సిక్స్‌లు బాదాడు. ముస్తాక్ అల టోర్నీలోనూ 18 సార్లు బంతిని స్టాండ్స్‌లోకి పంపించాడు.

సమీర్ రిజ్వీ.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరఠ్‌లో 2003, డిసెంబర్ 6న జన్మించాడు. ఈ ప్లేయర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ సహా ఆఫ్ బ్రేక్ బౌలింగ్ కూడా చేయగలడు. 2021, డిసెంబర్ 11న లిస్ట్- ఏ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. రిజ్వీ పదేళ్ల వయసునుంచే మీరఠ్ గల్లీల్లో తన ఫ్రెండ్స్‌తో కలిసి క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ఈ యంగ్ ప్లేయర్.. టీమిండియా క్రికెట్ గాడ్.. సచిన్ టెండూల్కర్‌కు వీరాభిమాని.

ఇక సమీర్ రిజ్వీ ప్రదర్శనను చూసిన ఐపీఎల్ ఫ్రాంఛైజీలు అతడిపై కన్నేశాయి. ఐపీఎల్ 2024 మినీ వేలంలో అతడి కోసం ఆసక్తి చూపించాయి. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిజ్వీని దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించాయి. రూ.20 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఈ ప్లేయర్‌ను చివరకు చెన్నై సూపర్ కింగ్స్ రూ.8.40 కోట్లకు కొనుగోలు చేసింది.

ఐపీఎల్ 2024 ఆరంభ మ్యాచుతో ఈ లీగ్‌లోకి అడుగుపెట్టిన రిజ్వీకి.. ఆ మ్యాచులో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే గుజరాత్‌తో మ్యాచ్ సందర్భంగా మైదానంలోకి వచ్చిన ఈ ప్లేయర్ తొలి బంతికే రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్సర్ బాదాడు. మొత్తంగా 6 బంతుల్లో 14 రన్స్ చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు ఉన్నాయి. సమీర్ రిజ్వీ టోర్నీలో ఇదే జోరు కొనసాగించాలని సీఎస్కే ఆశిస్తోంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-27T07:18:43Z dg43tfdfdgfd