శివాలెత్తిన శివమ్‌ దూబే.. సమీర్‌ రిజ్వీ గ్రాండ్‌ ఎంట్రీ.. చెన్నై భారీ స్కోరు

సొంతగడ్డపై గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లు రెచ్చిపోయారు. ఒక్కరు ఇద్దరు అని కాకుండా వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లే సిక్స్‌లు, ఫోర్లతో చెలరేగిపోయారు. దీంతో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.

టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీని ఓడించిన సీఎస్కే.. ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. ఈ సీజన్‌తో టోర్నీలోకి అడుగుపెట్టిన కివీస్‌ యువ సంచలనం రచిన్‌ రవీంద్ర మరోసారి రెచ్చిపోయాడు. బౌలర్‌ ఎవరనేది చూడకుండా ఎదురుదాడికి దిగాడు. 20 బంతుల్లోనే 230 స్ట్రైక్‌ రేటుతో 46 పరుగులు చేశాడు. గత మ్యాచ్‌లో విఫలమైన కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ సైతం.. 36 బంతుల్లో 46 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. దీంతో 5 ఓవర్లోనే ఆ జట్టు స్కోరు 58/0కి చేరింది.

పవర్‌ ప్లే తర్వాత కూడా సీఎస్కే బ్యాటర్లు జోరు కొనసాగించారు. ప్రతీ ఒక్కరూ హిట్టింగ్‌ చేయడంతో రన్‌ రేట్‌ పదికి తగ్గకుండా దూసుకెళ్లింది. శివమ్‌ దూబే సైతం 23 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమీర్‌ రిజ్వి తొలి బంతినే స్టాండ్స్‌లోకి పంపించిన తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. 6 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 14 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. దీంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.

గుజరాత్‌ టైటాన్స్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ 2, సాయి కిశోర్‌, స్పెన్సర్‌ జాన్స్‌, మోహిత్ శర్మ ఒక్కో వికెట్‌ చొప్పున పడగొట్టారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-26T16:17:16Z dg43tfdfdgfd