వర్షం ఎఫెక్ట్..! కోల్‌కతాలో కాకుండా వారణాసిలో బసచేసిన కేకేఆర్ ఆటగాళ్లు

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్లు ఇబ్బంది పడ్డారు. కుండపోత వర్షాల వల్ల కేకేఆర్ ఆటగాళ్లు ప్రయాణిస్తున్న విమానాన్ని రెండు సార్లు దారి మళ్లించారు. ఇందుకు సంబంధించిన వివరాలను కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ.. సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. రెండు సార్లు దారి మళ్లించిన అనంతరం ఆటగాళ్లు ఎట్టకేలకు క్షేమంగా గమ్యస్థానాలకు చేరారు.

అసలేం జరిగిందంటే..

ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు మే 5న లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఆ జట్టు మే 11న ముంబై ఇండియన్స్‌తో కోల్‌కతా వేదికగా తర్వాతి మ్యాచ్ ఆడనుంది. ఇందుకోసం సోమవారం సాయంత్రం 5.45కు కేకేఆర్ జట్టు.. ఛార్టర్ విమానంలో కోల్‌కతా బయలు దేరింది. కానీ కోల్‌కతాలో భారీ వర్షాల కారణంగా అక్కడ ల్యాండ్ కావడం వీలుకాలేదు. దీంతో 7.25కు ల్యాండ్ కావాల్సిన విమానాన్ని కాస్తా.. గువహటికి దారి మళ్లించారు.

వాతావరణం అనుకూలంగా మారడంతో గువహటి వెళ్లిన కాసేపటికి.. కేకేఆర్ జట్టు ఫ్లైట్.. కోల్‌కతాగు బయలుదేరేందుకు క్లియరెన్స్ వచ్చింది. దీంతో ఈ ఫ్లైట్ బయలుదేరింది. అయితే మార్గమధ్యలో మరోసారి వాతావరణం ప్రతికూలంగా మారింది. ఫలితంగా ఈసారి విమానాన్ని వారణానికి దారిమళ్లించారు. దీంతో సోమవారం రాత్రి ఆటగాళ్లంతా అక్కడే ఓ హోటల్‌లో బసచేశారు. ఈ విషయాన్ని కేకేఆర్.. సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ రోజు కేకేఆర్ ఆటగాళ్లు మళ్లీ కోల్‌కతా వెళ్లనున్నారు.

కాగా అనుకోకుండా వారణాసికి చేరుకున్న కేకేఆర్ ఆటగాళ్లు.. అక్కడి ప్రముఖ ప్రదేశాలను దర్శించుకుంటున్నారు. వారణాసిలోని శ్రీ కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి.

కాగా ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఆడిన 11 మ్యాచుల్లో ఎనిమిదింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దాదాపుగా ప్లే ఆఫ్స్ చేరింది. మిగిలిన మూడు మ్యాచుల్లో ఒక్క దాంట్లో గెలిచినా.. ఆ జట్టు అధికారికంగా ప్లే ఆఫ్స్‌లోకి అడుగుపెడుతుంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T07:36:17Z dg43tfdfdgfd