రోహిత్ శర్మ 200వ మ్యాచ్‌.. హైదరాబాద్ జట్టులో 2 మార్పులు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌లో తొలిసారిగా ఆరెంజ్‌ ఆర్మీ సొంతగడ్డపై మ్యాచ్ ఆడుతోంది. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్‌.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఎస్‌ఆర్‌హెచ్‌ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. మార్కో జాన్సన్ స్థానంలో ట్రావిస్‌ హెడ్‌, నటరాజన్‌ ప్లేసులో ఉనద్కత్‌ జట్టులోకి వచ్చారు.

అటు ముంబై ఇండియన్స్ సైతం ఈ మ్యాచ్‌లో ఓ మార్పుతో బరిలోకి దిగింది. ల్యూక్‌ వుడ్ స్థానంలో మఫాక జట్టులోకి వచ్చాడు. సీజన్‌ తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌ చేతిలో సన్‌రైజర్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ముంబై ఇండియన్స్ జట్లు ఓటమి పాలయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు భావిస్తున్నాయి.

ఇక ఇవాళ్టి మ్యాచ్‌తో రోహిత్ శర్మ 200వ మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన డెక్కర్‌ ఛార్జర్స్‌ తరఫున తొలిసారి బరిలోకి దిగిన హిట్‌మ్యాన్‌.. 2011 నుంచి ముంబై జట్టు తరఫున ఆడుతున్నాడు. దీంతో మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మను ముంబై జట్టు సత్కరించింది. సచిన్‌ టెండూల్కర్‌ 200 అనే నెంబర్‌ ఉన్న జెర్సీని హిట్‌మ్యాన్‌కు అందజేశాడు.

తుది జట్లు:

సన్‌రైజర్స్‌: ట్రావిస్‌ హెడ్‌, మయాంక్‌ అగర్వాల్‌, అభిషేక్‌ శర్మ, ఎయిడెన్‌ మార్‌క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ (వికెట్‌ కీపర్‌), అబ్దుల్‌ సమద్‌, షాబాజ్ అహ్మద్‌, ప్యాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్‌, మయాంక్‌ మార్కండే, జయదేవ్‌ ఉనద్కత్‌

ముంబై ఇండియన్స్‌: ఇషాన్‌ కిషన్‌ (వికెట్ కీపర్‌), రోహిత్‌ శర్మ, నమన్‌ ధీర్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), టిమ్‌ డేవిడ్‌, గెరాల్డ్‌ కొయెట్జీ, శామ్స్‌ ములానీ, పియూష్ చావ్లా, జస్‌ప్రీత్‌ బుమ్రా, క్వేనా మఫాక.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-27T14:19:22Z dg43tfdfdgfd