రోహిత్ ఫ్యాన్స్ చేసిన పనికి.. కోపంతో డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయిన హార్దిక్.. వీడియో వైరల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 హార్దిక్ పాండ్యాకు ఏమాత్రం కలిసిరావడం లేదు. గత రెండు సీజన్లలో గుజరాత్‌ టైటాన్స్‌ను నడిపించి ఓసారి ఛాంపియన్, మరోసారి రన్నరప్‌గా నిలిపిన హార్దిక్.. ఈసారి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ట్రేడ్‌ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చిన ఈ ప్లేయర్.. వచ్చీ రాగానే జట్టు పగ్గాలు అందుకున్నాడు. జట్టులోకి రాకముందే అతడి ఈ కండీషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో టీమిండియా కెప్టెన్, ముంబైని ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను.. ఆ ఫ్రాంఛైజీ కెప్టెన్‌గా తప్పించింది.

రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఆ జట్టు ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటన వచ్చింది మొదలు.. ఐపీఎల్‌లో మ్యాచులు జరుగుతున్నప్పుటు కూడా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. వాటికి తోడు ముంబై కూడా ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలవకపోవడం.. ఆ జట్టుకు ఇబ్బందిగా మారింది. ఎన్నో ఆశలతో, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. హార్దిక్‌ను జట్టులోకి తీసుకుంది ముంబై. అయితే ఈ నిర్ణయం బెడిసికొడుతోంది.

కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా కూడా హార్దిక్ తేలిపోతున్నాడు. సీజన్ ఆరంభ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడింది ముంబై. సన్ రైజర్స్‌తో జరిగిన రెండో మ్యాచులో లీగ్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సమర్పించుకుంది. ఈ రెండు మ్యాచుల్లోనూ స్టేడియానికి వచ్చిన ఫ్యాన్స్ రోహిత్‌కు మద్దతుగా హార్దిక్‌కు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. దానికి తోడు హార్దిక్ ఆటగాడిగా కూడా రాణించకపోవడంతో ఈ విమర్శలు మరింత ఎక్కువ అయ్యాయి. ముంబై కెప్టెన్ కనిపించిన ప్రతీసారి.. ఫ్యాన్స్ రోహిత్ రోహిత్ అని నినాదాలు చేశారు.

హైదరాబాద్‌తో మ్యాచ్ సందర్భంగా కూడా హార్దిక్ ఇదే అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. మ్యాచ్ మధ్యలో ఫ్రాంఛైజీ ఓనర్ ఆకాశ్ అంబానీతో అతడు మాట్లాడుతుండగా హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ మరోసారి రెచ్చిపోయారు. రోహిత్ రోహిత్ అని నినాదాలు చేశారు. దీంతో డ్రెస్సింగ్ రూమ్ వైపు వేగంగా వెళ్లిపోయిన హార్దిక్ పాండ్యా.. అక్కడ ఉన్న స్టీల్ కేజ్‌ను గట్టిగా కొట్టినట్లు కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై కొందరు ఫ్యాన్స్ ఫన్నీ రియాక్షన్లు ఇస్తున్నారు. ప్రతీసారి ఏంది బ్రో ఇది.. రోహిత్ భాయ్ నీ ఫ్యాన్స్‌కు చెప్పొచ్చుగా హార్దిక్‌ను ఏడిపించొద్దని పేర్కొంటున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T11:21:25Z dg43tfdfdgfd