రికార్డుల బూజు దులిపిన SRH VS MI మ్యాచ్!.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తన కంటూ ఓ కొత్త పేజీని లిఖించుకుంది. బుధవారం హైదరాబాద్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచులో.. లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు (277/3) నమోదు చేసింది. ముంబై జట్టు కూడా విజయం కోసం ఆఖరు వరకు పోరాడటంతో ఈ మ్యాచులో ఐపీఎల్ చరిత్రలో కనీవినీ ఎరగని రికార్డులు బద్దలు అయ్యాయి. అవేంటంటే..

హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్-ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచులో సిక్సర్ల మోత మోగింది. ఈ మ్యాచులో మొత్తంగా రెండు జట్లు కలిసి.. 523 పరుగులు నమోదు చేశాయి. టీ20 చరిత్రలోనే ఇలా ఓ మ్యాచులో ఈ స్థాయిలో స్కోర్లు నమోదు కావడం ఇదే తొలసారి. ఇంతకుముందు ఈ రికార్డు 517గా ఉంది. గతేడాది సెంచూరియన్ వేదికగా.. దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య ఈ స్కోరు నమోదైంది. ఐపీఎల్ చరిత్రలో కూడా హైదరాబాద్-ముంబై జట్ల మధ్య మ్యాచులో వచ్చిన స్కోరే అత్యధిక. రెండో స్థానంలో 2010లో సీఎస్కే-ఆర్ఆర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచులో 469 రన్స్ నమోదయ్యాయి.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు..

బుధవారం నాటి మ్యాచులో హైదరాబాద్ చేసిన 277/3 స్కోరు ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం. అంతకుముందు ఈ రికార్డు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరిట ఉంది. 2013లో ఆర్సీబీ.. పూణె వారియర్స్ ఇండియాపై 263/5 చేసింది. ఆ తర్వాత 2023లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పంజాబ్ కింగ్స్‌పై చేసిన 257/5 రన్స్ ఉంది.

ఐపీఎల్‌లో రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు..

ఈ మ్యాచులో ఓడిపోయినప్పటికీ ముంబై జట్టు పోరాడింది. ఏకంగా 246/5 పరుగులు చేసింది. లీగ్ చరిత్రలో ఛేజింగ్ జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇవే. ఆ తర్వాత స్థానంలో రాజస్థాన్ ఉంది. 2020లో ఆ జట్టు 226/6 రన్స్ చేసింది.

పురుషుల టీ20 మ్యాచులో అత్యధిక సిక్సులు..

బుధవారం నాటి మ్యాచులో రెండు జట్లు కలిపి 38 సిక్సర్లు బాదాయి. ఇది పురుషుల టీ20 క్రికెట్‌లో ఇది ఆల్‌టైమ్ రికార్డు. ఐపీఎల్ చరిత్రలోనూ అత్యధిక సిక్స్‌లు నమోదైన మ్యాచ్‌గా కూడా ఇది రికార్డుల్లోకి ఎక్కింది. ఇందులో ముంబై ఇండియన్స్ 20 సిక్సర్లు బాదగా.. హైదరాబాద్ 18 సిక్స్‌లు కొట్టింది. అంతకుముందు ఈ రికార్డు ఆర్సీబీ-సీఎస్కే జట్ల మధ్య జరిగిన మ్యాచులో నమోదైంది. 2018లో జరిగిన ఆ మ్యాచులో 33 సిక్సర్లు నమోదయ్యాయి.

మొత్తంగా ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్ ప్రేక్షకులకు పసందైన విందును అందించింది. పైసా వసూల్ గేమ్‌గా నిలిచింది. ఈ మ్యాచులో 31 పరుగుల తేడాతో విజయం సాధించిన ఎస్ఆర్‌హెచ్.. పాయింట్లా ఖాతాను తెరిచింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T03:20:37Z dg43tfdfdgfd