రాజస్థాన్‌పై ఢిల్లీ ఘన విజయం.. ప్లేఆఫ్స్‌ దిశగా మరో అడుగు..!

ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అదిరే ప్రదర్శన చేసింది. పాయింట్ల పట్టికలో టాప్‌-2లో ఉన్న రాజస్థాన్‌ రాయల్స్‌ను 20 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 221/8 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ రాయల్స్‌ను 201/8 కు పరిమితం చేసింది. ఫలితంగా ఈ సీజన్‌లో ఆరో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌ రెండో బంతికే యశస్వి జైశ్వాల్‌ (4) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బట్లర్‌ (19)తో కలిసి కెప్టెన్‌ సంజూ శాంసన్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న శాంసన్.. జట్టును లక్ష్యం దిశగా తీసుకెళ్లాడు. అయితే జట్టు స్కోరు 162 పరుగుల వద్ద శాంసన్‌ (46 బంతుల్లో 86 రన్స్‌) ఔట్‌ కావడంతో సీన్‌ రివర్స్‌ అయింది. రియాన్ పరాగ్‌ (27), శుభ్‌మన్‌ దూబె (25), రోవ్‌మన్‌ పోవెల్‌ (13) సైతం త్వరగానే ఔట్‌ అయ్యారు. దీంతో 20 ఓవర్లలో రాజస్థాన్‌ 201/8 కు పరిమితమైంది. 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.

అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 221/8 పరుగులు చేసింది. ఓపెనర్‌ జేక్‌ ఫ్రెజర్‌ మెక్‌గుర్క్‌ 20 బంతుల్లో 50 రన్స్‌, అభిషేక్‌ పోరెల్‌ 36 బంతుల్లో 65 రన్స్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌ 20 బంతుల్లో 41 రన్స్‌ చేశారు.

ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ పాయింట్ల పట్టికలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను వెనక్కి నెట్టి ఐదో ప్లేసుకు చేరింది. 12 మ్యాచుల్లో 6 విజయాలు సాధించిన ఢిల్లీ.. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిస్తే ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశం ఉంది. ఇక రాజస్థాన్‌ 11 మ్యాచుల్లో 8 విజయాలతో రెండో ప్లేసులో ఉంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T18:38:05Z dg43tfdfdgfd