ముందు దంచి..ఆపై కూల్చి..

  • చెపాక్‌లో సీఎస్‌కే రెండో విజయం
  • దూబే, రచిన్‌ వీరవిహారం

ఛేదనలో చేతులెత్తేసిన గుజరాత్‌ఐపీఎల్‌-17లో డిఫెండింగ్‌ చాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండో విజయాన్ని నమోదుచేసింది. సొంత మైదానం చెపాక్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముందు బ్యాటింగ్‌లో రచిన్‌, దూబే, రుతురాజ్‌ దంచికొట్టారు.

ఆ తర్వాత భారీ ఛేదనలో గుజరాత్‌ను సీఎస్‌కే స్టార్‌ పేసర్‌ దీపక్‌ చాహర్‌ ఆదిలోనే దెబ్బతీసి కోలుకోనీయకుండా చేయగా తుషార్‌, మిచెల్‌, ముస్తాఫిజుర్‌ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశారు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన సాయి సుదర్శన్‌ ఒంటరి పోరాటం చేసినా అతడికి అండగా నిలిచేవాళ్లు లేకపోవడంతో గుజరాత్‌పై చెన్నైదే పైచేయి అయింది.

చెన్నై : ఐపీఎల్‌లో ఆరో ట్రోఫీ వేటలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. సొంత ఇలాఖాలో తమకు తిరుగులేదని నిరూపిస్తూ గుజరాత్‌ టైటాన్స్‌ను 63 పరుగుల తేడాతో చిత్తుచేసింది. చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం వేదికగా ముగిసిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. సిక్సర్ల స్పెషలిస్టు శివమ్‌ దూబే (23 బంతుల్లో 51, 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రచిన్‌ రవీంద్ర (20 బంతుల్లో 46, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రుతురాజ్‌ గైక్వాడ్‌ (36 బంతుల్లో 46, 5 ఫోర్లు, 1 సిక్స్‌) లు చెన్నై భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించారు. భారీ ఛేదనలో గుజరాత్‌ టైటాన్స్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో పాటు భాగస్వామ్యాలు నిర్మించడంలో విఫలమై ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 143 పరుగుల వద్దే ఆగిపోయింది. సాయి సుదర్శన్‌ (31 బంతుల్లో 37, 3 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. చెన్నై బౌలర్లలో చాహర్‌, తుషార్‌, ముస్తాఫిజుర్‌ లు తలా రెండు వికెట్లు పడగొట్టి గుజరాత్‌ ఓటమిని శాసించారు.

దూబే ధూమ్ం

రహానే (12)ను సాహా స్టంపౌట్‌ చేయడంతో క్రీజులోకి వచ్చిన తొలి రెండు బంతుల్లోనే భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. గిల్‌ స్పిన్నర్‌కు బంతినివ్వడమే పాపం అన్నంతగా సాయికిషోర్‌, రషీద్‌ను లక్ష్యంగా చేసుకుని వీరవిహారం చేశాడు. ఎడాపెడా బాదిన దూబే.. 22 బంతుల్లోనే అర్ధ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. మరో ఎండ్‌లో డారిల్‌ మిచెల్‌ (24) అతడికి పూర్తి సహకారం అందించాడు. ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాక దూబే ఔట్‌ అయినా యూపీ కుర్రాడు సమీర్‌ రిజ్వి ఎదుర్కొన్న తొలి బంతితో పాటు మొదటి నాలుగు బంతుల్లోనే రెండు భారీ సిక్సర్లు బాదడంతో సీఎస్‌కే భారీ స్కోరు సాధించింది.

ఒడిదొడుకుల నడుమ..

కొండంత లక్ష్యాన్ని కరిగించే క్రమంలో గుజరాత్‌కు ఆది నుంచే కష్టాలు చుట్టుముట్టాయి. దీపక్‌ చాహర్‌ వరుస ఓవర్లలో గుజరాత్‌కు డబుల్‌ షాకులిచ్చాడు. మూడో ఓవర్లో గిల్‌ (8)ను లెగ్‌ బిఫోర్‌గా ఔట్‌ చేసిన అతడే.. మరుసటి ఓవర్లో సాహా (21)ను పెవిలియన్‌కు పంపాడు. 8వ ఓవర్లో విజయ్‌ శంకర్‌ (12) ఇచ్చిన క్యాచ్‌ను ధోనీ ముందుకు డైవ్‌ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు. సాయి సుదర్శన్‌ ఆదుకునే యత్నం చేసినా అతడికి మిగిలిన బ్యాటర్లు తోడ్పాటునందించలేదు. 16 బంతుల్లోనే మూడు ఫోర్ల సాయంతో 21 రన్స్‌ చేసిన డేవిడ్‌ మిల్లర్‌..తుషార్‌ వేసిన 12వ ఓవర్లో అజింక్యా రహానే సూపర్‌ క్యాచ్‌తో వెనుదిరిగాడు. సుదర్శన్‌ను పతిరాన పెవిలియన్‌కు పంపాడు. 11-15 ఓవర్ల మధ్య గుజరాత్‌ 34 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు ఛేదించాల్సిన రన్‌ రేట్‌ భారీగా పెరిగిపోయింది.

రచిన్‌.. దంచెన్‌

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నైకి రచిన్‌ రవీంద్ర అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన రెండో ఓవర్లోనే సిక్స్‌, ఫోర్‌తో బాదుడు ఆరంభించిన అతడు.. అజ్మతుల్లా వేసిన మరుసటి ఓవర్లోనూ బ్యాక్‌ టు బ్యాక్‌ ఫోర్లతో ఆకట్టుకున్నాడు. నాలుగో ఓవర్లో 6, 4, 6తో ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. రచిన్‌ బాదుడుతో చెన్నై 4.3 ఓవర్లలోనే 50 పరుగుల మార్కును దాటింది. దూకుడుగా ఆడుతున్న రచిన్‌.. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్‌ అయ్యాడు. రచిన్‌ ఔట్‌ అయినా బాదుడు బాధ్యతలను రుతురాజ్‌ తీసుకున్నాడు. ఈ లీగ్‌లో గుజరాత్‌పై గత ఐదు మ్యాచ్‌లలో నాలుగు అర్ధ సెంచరీలు సాధించిన గైక్వాడ్‌.. స్పెన్సర్‌ జాన్సన్‌ వేసిన పదో ఓవర్లో 6, 4 బాదాడు. కానీ అర్ధ సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

పరుగుల(63) పరంగా గుజరాత్‌ టైటాన్స్‌కు ఇది తొలి భారీ ఓటమి. గతంలో ముంబైపై (27), చెన్నైపై (15) గుజరాత్‌ ఓటములు ఎదుర్కొంది.

సంక్షిప్త స్కోర్లు

చెన్నై : 20 ఓవర్లలో 206/6 (దూబే 51, రవీంద్ర 46, రుతురాజ్‌ 46, రషీద్‌ ఖాన్‌ 2/49) గుజరాత్‌ : 20 ఓవర్లలో 143/8 (సాయి 37, మిల్లర్‌ 21, చాహర్‌ 2/28, ముస్తాఫిజుర్‌ 2/30, తుషార్‌ 2/21)

2024-03-26T23:03:12Z dg43tfdfdgfd