భారత్‌కు షాక్‌

  • ఆఫ్గనిస్థాన్‌ చేతిలో ఓటమి

గువాహటి: ఫిఫా ప్రపంచకప్‌(2026) క్వాలిఫయింగ్‌ మూడో రౌండ్‌కు అర్హత సాధించే అవకాశాన్ని భారత్‌ మరింత క్లిష్టం చేసుకుంది. మంగళవారం గువాహటి ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా జరిగిన కీలక పోరులో భారత్‌.. 1-2 తేడాతో ఆఫ్గనిస్థాన్‌ చేతిలో పరాజయం పాలైంది. తన కెరీర్‌లో 150వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ.. 38వ నిమిషంలో గోల్‌ చేసి భారత్‌ను ఆధిక్యంలోకి తెచ్చాడు. ప్రథమార్ధం పూర్తయ్యేసరికి బ్లూ టైగర్స్‌ 1-0తో ఆధిక్యంలోనే ఉన్నారు. కానీ కీలకమైన ద్వితీయార్ధం మొదలయ్యాక 70వ నిమిషంలో రహ్మత్‌ అక్బరీ గోల్‌ చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. మ్యాచ్‌ మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా గుర్‌ప్రీత్‌ సింగ్‌కు రిఫరీ ఎల్లో కార్డ్‌ చూపించడంతో అఫ్గాన్‌కు పెనాల్టీ లభించింది. 88వ నిమిషంలో షరీఫ్‌ ముఖమ్మద్‌ గోల్‌ చేసి ఆఫ్గనిస్థాన్‌ను 2-1 ఆధిక్యంలోకి తేవడంతో పాటు విజయాన్ని అందించాడు. జూన్‌లో కువైట్‌తో జరిగే ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది.

2024-03-26T22:48:09Z dg43tfdfdgfd