‘నా మదర్ టంగ్ తెలుగు’.. దినేశ్ కార్తీక్ వీడియో వైరల్.. కిక్కు రా చారీ కిక్కు..!!

ఐపీఎల్ 2024లో ఆర్సీబీ పేలవ ప్రదర్శన చేస్తున్నప్పటికీ.. ఆ జట్టులోని కీలక ఆటగాళ్లలో ఒకడైన దినేశ్ కార్తీక్ కళ్లు చెదిరే బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. వాంఖడే వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 23 బంతుల్లోనే 53 రన్స్ చేసిన కార్తీక్.. ఆర్సీబీ 196 పరుగులు పరుగులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 288 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో డీకే అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. వైవిధ్యమైన షాట్లతో విరుచుకుపడిన దినేశ్ కార్తీక్.. 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు. దీంతో ఆర్సీబీ 262 పరుగులు చేయగలిగింది.

సన్‌రైజర్స్‌పై దినేశ్ కార్తీక్ సుడిగాలి ఇన్నింగ్స్ తర్వాత.. స్పోర్ట్స్ ప్రజెంటేటర్ వింధ్య విశాఖతో అతడు తెలుగులో మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. హోటల్‌లో దినేశ్ కార్తీక్‌తో వింధ్య తెలుగులో మాట్లాడించింది. దినేశ్ గారూ తెలుగులో ఎలా మాట్లాడుతున్నారు.. అని వింధ్య అడిగిన ప్రశ్నకు.. డీకే బదులిస్తూ నా మదర్ టంగ్ తెలుగు అని స్పష్టం చేశాడు. అంటే చెన్నైలోని తెలుగు కుటుంబంలో దినేశ్ కార్తీక్ జన్మించాడన్న మాట. ఆ తర్వాత కూడా వింధ్యతో తెలుగులో మాట్లాడటాన్ని కొనసాగించిన డీకే.. ‘తెలుగు నాకు వస్తయ్, కానీ అంత ఫ్లుయెంట్ లేదు.. ఇంకా మాట్లాడతా ఉంటే బాగా మాట్లాడగలననే కాన్ఫిడెన్స్ వస్తే అప్పుడు తెలుగులో కామెంట్రీ చేస్తా’నని చెప్పాడు.

View this post on Instagram

A post shared by STUMPS CLUB (@stump_sclub)

]]>

ఈ వీడియో చూసిన తెలుగు నెటిజన్లు.. డీకే మన తెలుగోడేనని తెలుసుకొని సంబరపడుతున్నారు. ‘ఏంది DK మన తెలుగోడా అంటే RCBలో కూడ మందే నా హవా... కిక్కురా చారి’ అంటూ అదుర్స్ సినిమాలో బ్రహ్మనందం తరహాలో ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. సన్‌రైజర్స్‌లో తెలుగు.. ముంబై ఇండియన్స్‌లో తెలుగు (రోహిత్, తిలక్ వర్మ), ఆర్సీబీలో తెలుగు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

వాస్తవానికి ఈ వీడియోను వింధ్య గత ఏడాది వన్డే వరల్డ్ కప్ సమయంలో.. 2023 నవంబర్ 16న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. అప్పుడు దినేశ్ కార్తీక్ కామెంటేటర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. డీకేతో వింధ్య హోటల్‌లో మాట్లాడిన వీడియోను ఎడిట్ చేసి ఇప్పుడు మళ్లీ వైరల్ చేస్తున్నారు.

దినేశ్ కార్తీక్ గతంలో పలు సందర్భాల్లో తెలుగులో మాట్లాడాడు. ఐపీఎల్ 2021 ఫైనల్ సందర్భంగా అప్పట్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన డీకే.. స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానెల్‌‌లో హర్షా భోగ్లేతో తెలుగులో మాట్లాడాడు. మరాఠీ మూలాలున్న హర్షా భోగ్లే సైతం హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సంగతి తెలిసిందే.

అంతకు ముందు ఐపీఎల్ 2020లో భాగంగా.. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన అంపైర్ షంషుద్దీన్, దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడుకున్నారు. కోల్‌కతా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో... ఇన్నింగ్స్ 19వ ఓవర్‌ను సామ్ కరన్ వేశాడు. ఆ ఓవర్ ఐదో బంతిని కరన్ వికెట్లకు దూరంగా వేశాడు. దీంతో బ్యాటింగ్ చేస్తున్న కార్తీక్.. అది వైడ్ బాల్ లేదా..? అని అంపైర్‌ను అడిగాడు. దీనికి షంషుద్దీన్ బదులిస్తూ.. చానా లోపల.. కొంచెం కూడా కాదు అని అన్నాడు.

దినేశ్ కార్తీక్‌కు తెలుగు గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే ఎంతో ఇష్టం. గతంలో ఓసారి బాలసుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లిన డీకే ఆయనతో తనకు ఇష్టమైన పాటలు పాడించుకున్నాడు. ఎస్పీబీ కరోనా సమయంలో చనిపోయినప్పుడు మిగతా క్రికెటర్లు అందరి కంటే ముందుగా డీకేనే స్పందించాడు. అంతకు ముందు బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్న సమయంలోనూ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ డీకే పోస్టు పెట్టాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-18T03:47:43Z dg43tfdfdgfd