దినేశ్ కార్తిక్ ది ఫినిషర్, అతడి వల్లే ఆర్సీబీ గెలిచింది: మహిపాల్ లామ్రోర్

సోమవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచులో 4 వికెట్లు తేడాతో గెలుపొంది.. ఐపీఎల్ 2024లో బోణీ కొట్టింది ఆర్సీబీ. ఈ మ్యాచులో బంతి, బ్యాటుతో రాణించి.. పాయింట్ల ఖాతాను తెరిచింది. ఈ మ్యాచులో తొలుత పంజాబ్ కింగ్స్ జట్టు 176 పరుగులకే కట్టడి చేసింది బెంగళూరు. అనంతరం 177 పరుగుల లక్ష్య ఛేదనలో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టీమ్‌ను ముందుండి నడిపించాడు. 49 బంతుల్లో 77 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాక.. మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అప్పటికి ఆర్సీబీ స్కోరు 16 ఓవర్లకు 130/5గా ఉంది. దీంతో చివరి నాలుగు ఓవర్లలో ఆ జట్టు గెలవాలంటే 47 పరుగులు అవసరం. ఈ దశలో వెటరన్ ప్లేయర్ దినేశ్ కార్తిక్, ఇంపాక్ట్ ప్లేయర్‌గా క్రీజులోకి వచ్చిన మహిపాల్ లామ్రోర్‌లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. దినేశ్ కార్తిక్ అయితే ఏకంగా 10 బంతుల్లో 28 రన్స్ చేసి.. మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. లామ్రోర్ సైతం 8 బంతుల్లో 17 రన్స్ స్కోరు చేశాడు. చివరి ఓవర్లో పది పరుగులు అవసరం కాగా.. డీకే సిక్స్, ఫోర్ కొట్టి రెండు బంతుల్లోనే మ్యాచును ముగించాడు.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన మహిపాల్ లామ్రోర్.. దినేశ్ కార్తిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దినేశ్ కార్తిక్ అనుభవం, అతడు ఇచ్చిన చిట్కాలు తనకు ఎంతగానే ఉపయోగపడ్డాయని చెప్పుకొచ్చాడు.

దినేశ్ కార్తిక్ అనుభవజ్ఞుడు..

"దినేశ్ కార్తిక్ అనుభవజ్ఞుడైన వ్యక్తి. అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు కలిసొచ్చింది. గత 15-17 ఏళ్లుగా డీకే ఐపీఎల్‌లో ఫినిషర్ పాత్రను చక్కగా పోషిస్తున్నాడు. ఈ మ్యాచులో బ్యాటింగ్ చేసేప్పుడు ప్రశాంతంగా ఉండమని, ఒక్కో బంతిపై దృష్టిపెడుతూ ఆడమని సలహా ఇచ్చాడు. మరీ దూకుడుగా ఆడాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఈ సలహాలు పనిచేశాయి. జట్టుకు డీకే అనుభవం ఉపయోగపడింది. అతడు ఫినిషర్ పాత్రను చక్కగా పోషించాడు"

మేనేజ్‌మెంట్ నాకు ముందే చెప్పింది..

"లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయాల్సి వస్తుందని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ నాకు ముందే చెప్పింది. నా పాత్ర విషయంలో ఆర్సీబీ పూర్తి క్లారిటీతో ఉంది. మా జట్టుకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. నా అవసరం లోయర్ ఆర్డర్‌లోనే ఉంటుంది. దీనిపై యాజమాన్యం సూచనతో.. మెంటల్‌గా ప్రిపేర్ అయ్యా. మ్యాచుకు ముందు రోజు రాత్రి కూడా మేనేజ్‌మెంట్ నాకు ఇదే విషయం చెప్పింది. అందుకే బాగా సన్నద్ధమై.. ప్రణాళికలు అమలు చేశా" అని మహిపాల్ లామ్రోర్ వెల్లడించాడు.

సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ 4 వికెట్లు తేడాతో గెలుపొందింది. ప్రత్యర్థి విధించిన 177 పరుగుల లక్ష్యాన్ని మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. ఆర్సీబీ తన తర్వాతి మ్యాచులో మార్చి 29న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.

2024-03-26T07:31:27Z dg43tfdfdgfd