ఢిల్లీ చేతిలో గిల్‌గిల!

  • 89 పరుగులకే టైటాన్స్‌ ఆలౌట్‌
  • రాణించిన ఢిల్లీ పేసర్లు
  • క్యాపిటల్స్‌ ఏకపక్ష విజయం

భారీ స్కోర్లు నమోదవుతున్న ఐపీఎల్‌-17లో తొలిసారిగా ఓ జట్టు 100 పరుగులలోపే చిత్తైంది. అహ్మదాబాద్‌లో మ్యాచ్‌ అంటే ప్రత్యర్థి ఎవరన్నదీ చూడకుండా వీరబాదుడు బాదే గుజరాత్‌ టైటాన్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ ఊహించని షాకిచ్చింది. తమ బౌలింగ్‌తో చుక్కలు చూపించి టైటాన్స్‌ను 89 పరుగులకే కట్టడిచేసింది. వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ, ముకేశ్‌ కుమార్‌లు పేస్‌తో గుజరాత్‌ను వణికించగా వికెట్ల వెనుక పంత్‌ అద్భుత వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యంతో ఆకట్టుకోవడంతో గిల్‌ సేన ఈ లీగ్‌లో తొలిసారిగా వందపరుగుల కంటే తక్కువ స్కోరుకు పరిమితమైంది. స్పల్ప ఛేదనను ఢిల్లీ 8.5 ఓవర్లలోనే ఊదేసింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు 9వ స్థానం నుంచి ఏకంగా మూడు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి రావడం విశేషం. గుజరాత్‌ నాలుగో ఓటమితో ఏడో స్థానానికి పడిపోయింది.

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌-17లో పడుతూ లేస్తూ వస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా రెండో విజయం కొట్టింది. ఇటీవలే లక్నోను వారి సొంత ఇలాఖాలో చిత్తుచేసిన రిషభ్‌ పంత్‌ సేన.. తాజాగా అహ్మదాబాద్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు అవమానకరమైన ఓటమిని రుచిచూపించింది. ఢిల్లీ బౌలర్ల విజృంభణతో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌.. 17.3 ఓవర్లలో 89 పరుగులకే పరిమితమైంది. రషీద్‌ ఖాన్‌ (24 బంతుల్లో 31, 2 ఫోర్లు, 1 సిక్సర్‌) ఆ జట్టులో టాప్‌ స్కోరర్‌ కాగా ఏకంగా 8 మంది సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌ (3/14), ఇషాంత్‌ శర్మ (2/8)లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. స్పల్ప ఛేదనను ఢిల్లీ 8.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జేక్‌ ఫ్రేజర్‌ (10 బంతుల్లో 20, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. అద్భుతమైన వికెట్‌ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించిన రిషభ్‌ పంత్‌ (11 బంతుల్లో 16 నాటౌట్‌, 1 ఫోర్‌, 1 సిక్స్‌)కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

గుజరాత్‌ పేలవ బ్యాటింగ్‌..

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్‌కు ఆరంభం నుంచే కష్టాలు చుట్టుముట్టాయి. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (6) ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో కవర్స్‌ వద్ద పృథ్వీ షాకు క్యాచ్‌ ఇచ్చాడు. అహ్మదాబాద్‌లో ఆడిన 16 ఐపీఎల్‌లో ఇన్నింగ్స్‌లో సింగిల్‌ డిజిట్‌కు ఔట్‌ అవడం అతడికి ఇది మూడోసారి మత్రమే. నాలుగో ఓవర్‌లో ముకేశ్‌.. వృద్ధిమాన్‌ సాహా (2)ను క్లీన్‌బౌల్డ్‌ చేసి మరో దెబ్బకొట్టాడు. ఐదో ఓవర్లో గుజరాత్‌కు డబుల్‌ షాకులు తాకాయి. గిల్‌ స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్‌.. రెండు ఫోర్లు కొట్టినా ఐదో ఓవర్లో మొదటి బంతికే దురదృష్టవశాత్తూ రనౌట్‌ అవగా గుజరాత్‌ భారీ ఆశలు పెట్టుకున్న డేవిడ్‌ మిల్లర్‌ (2) రిషభ్‌ పంత్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో ఆ జట్టు నాలుగో వికెట్‌ కోల్పోయింది. పవర్‌ ప్లే ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 30-4.

నత్తకు నడక నేర్చినట్టు సాగిన గుజరాత్‌ ఇన్నింగ్స్‌ను ట్రిస్టన్‌ స్టబ్స్‌ 9వ ఓవర్లో కోలుకోనీయకుండా చేశాడు. ఆ ఓవర్లో అభినవ్‌ మనోహర్‌ (8)తో పాటు షారుక్‌ ఖాన్‌ (0) ను పంత్‌ సూపర్‌ స్టంపింగ్‌తో పెవిలియన్‌కు పంపాడు. రాహుల్‌ తెవాటియా (10)ను అక్షర్‌ పటేల్‌ వికెట్ల ముందు బలిగొన్నాడు. గుజరాత్‌ తరఫున 17వ ఓవర్లో తొలి సిక్సర్‌ కొట్టిన ఆ జట్టు టాప్‌ స్కోరర్‌ రషీద్‌ ఖాన్‌ను మరుసటి ఓవర్లో ముకేశ్‌ ఔట్‌ చేశాడు. నూర్‌ అహ్మద్‌ను బౌల్డ్‌ చేసిన ముకేశ్‌ గుజరాత్‌ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.

8.5 ఓవర్లలోనే..

స్పల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ కూడా తడబడినా వేగంగా మ్యాచ్‌ను పూర్తిచేసింది. పృథ్వీ షా (7) విఫలమైనా గత మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో రాణించిన ఆసీస్‌ కుర్రాడు జేక్‌ ఫ్రేసర్‌.. ధాటిగా ఆడాడు. పది బంతుల్లోనే రెండు పోర్లు, రెండు సిక్సర్లతో 20 పరుగులు చేశాడు. స్పెన్సర్‌ జాన్సన్‌ అతడిని ఔట్‌ చేశాడు. అభిషేక్‌ పొరెల్‌ (7 బంతుల్లో 15, 2 ఫోర్లు, 1 సిక్సర్‌)ను సందీప్‌ వారియర్‌ బౌల్డ్‌ చేయగా.. రెండు సిక్సర్లు కొట్టిన షై హోప్‌ కూడా రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో మోహిత్‌ శర్మకు క్యాచ్‌ ఇచ్చాడు. అయితే రిషభ్‌ పంత్‌, సుమిత్‌ కుమార్‌ ఢిల్లీ మరో వికెట్‌ కోల్పోకుండా మ్యాచ్‌ను ముగించారు.

పంత్‌ సూపర్‌ కీపింగ్‌

రోడ్డు ప్రమాదంలో చావు అంచుల వరకూ వెళ్లి సుమారు ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైన రిషభ్‌ పంత్‌ ఈ సీజన్‌లో రీఎంట్రీ ఇచ్చి బ్యాట్‌తో దుమ్మురేపుతున్నా గుజరాత్‌తో మ్యాచ్‌లో మాత్రం అతడి వికెట్‌ కీపింగ్‌.. మునపటి పంత్‌ను గుర్తుకుతెచ్చింది. గుజరాత్‌ బ్యాటర్లలో నలుగురిని పెవిలియన్‌కు పంపడంలో అతడు కీలకపాత్ర పోషించాడు. మిల్లర్‌ క్యాచ్‌ను పంత్‌ ఎడమవైపు డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో అద్భుతంగా అందుకున్నాడు. స్టబ్స్‌ వేసిన 9వ ఓవర్లో అయితే రెప్పపాటు వ్యవధిలోనే రెండు అదిరిపోయే స్టంపౌట్స్‌తో గుజరాత్‌ను దెబ్బకొట్టాడు. అభినవ్‌ మనోహర్‌, షారుక్‌ ఖాన్‌ల స్టంపౌట్స్‌ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. రీఎంట్రీ తర్వాత పంత్‌ ఎలా రాణిస్తాడన్నదానిపై అనుమానాలు తొలిగిపోయినా గుజరాత్‌తో మ్యాచ్‌లో అతడి వికెట్‌ కీపింగ్‌ విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. పంత్‌ ఇదే పట్టుదలతో ఆడితే రాబోయే టీ20 ప్రపంచకప్‌లో అతడికి చోటు దక్కడం ఖాయమే!

1 ఐపీఎల్‌లో మూడో సీజన్‌

ఆడుతున్న గుజరాత్‌ జెయింట్స్‌ వంద లోపు ఆలౌట్‌ అవడం ఇదే తొలిసారి. ఆ జట్టుకు ఈ లీగ్‌లో ఇదే అత్యల్ప స్కోరు. అంతకుముందు కూడా ఢిల్లీపై 125 పరుగులకు పరిమితమైంది.

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్‌ : 17.3 ఓవర్లలో 89 (రషీద్‌ ఖాన్‌ 31, సాయి 12, ముకేశ్‌ 3/14, ఇషాంత్‌ 2/8),ఢిల్లీ : 8.5 ఓవర్లలో 92/4 (జేక్‌ ఫ్రేజర్‌ 20, షై హోప్‌ 19, సందీప్‌ 2/40, రషీద్‌ 1/12)

2024-04-17T22:16:16Z dg43tfdfdgfd