టీ20 వరల్డ్ కప్‌ జట్టులో చోటు.. విరాట్ కోహ్లి నుంచి ఊహించని రెస్సాన్స్..

వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో బరిలోకి దిగే భారత జట్టులో విరాట్ కోహ్లికి చోటు దక్కకపోవచ్చంటూ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. యువ ఆటగాళ్లతో బరిలోకి దిగాలని బీసీసీఐ భావిస్తోందని.. కోహ్లి ఆట పొట్టి ఫార్మాట్‌కు తగ్గట్టుగా దూకుడుగా ఉండదనే కారణంతో.. అతణ్ని పక్కనబెట్టే ఉద్దేశంలో బోర్డు ఉందనే వార్తలొచ్చాయి. అయితే ఎప్పటిలాగే తన బ్యాట్‌తో ఇలాంటి విమర్శలకు సమాధానం చెప్పి కోహ్లి.. ఈసారి మాటలతోనూ బదులిచ్చాడు.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 177 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి సత్తా చాటాడు. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. దూకుడుగా ఆడిన విరాట్ 49 బంతుల్లో 77 పరుగులు రాబట్టాడు. పంజాబ్ బౌలర్లపై మొదటి నుంచి దూకుడు ప్రదర్శించిన విరాట్.. 11 ఫోర్లు, 2 సిక్సులతో విరుచుకుపడ్డాడు. కోహ్లి ఔటయ్యాక దినేశ్ కార్తీక్ (10 బంతుల్లో 28), మహిపాల్ లోమ్రార్ (8 బంతుల్లో 17) లాంఛనాన్ని ముగించారు.

పంజాబ్‌తో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన విరాట్ కోహ్లి.. అనంతరం టీ20 వరల్డ్ కప్ జట్టులో తన చోటు విషయమై జరుగుతున్న చర్చ గురించి స్పందించాడు. ముంబై, గుజరాత్ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో కామెంటేటర్లు కెవిన్ పీటర్సన్, రవిశాస్త్రి.. టీ20 వరల్డ్ కప్ జట్టులో కోహ్లి చోటు గురించి చర్చించారు.

‘టీ20 వరల్డ్ కప్ అమెరికాలో జరుగుతోంది. భారత్-పాక్ మ్యాచ్ న్యూయార్క్‌లో జరగనుంది. క్రికెట్‌కు ఆదరణ పెరగాలంటే విరాట్ కోహ్లి లాంటి ఆటగాణ్ని ఆడించాలి’ అని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. అయితే రవిశాస్త్రి మాత్రం పీటర్సన్ అభిప్రాయంతో విబేధించాడు. ‘ ధోనీ నాయకత్వంలో యువకులతో కూడిన భారత జట్టు 2007 టీ20 వరల్డ్ కప్‌ సాధించింది. నీకు జట్టులో యువత కావాలా..? లేదంటే ఆడంబరాలు కావాలా?’ అని రవిశాస్త్రి ప్రశ్నించాడు.

వీరిద్దరి మధ్య జరిగిన చర్చపై విరాట్ కోహ్లి పరోక్షంగా స్పందించాడు. ‘టీ20 క్రికెట్ విషయానికి వస్తే.. ప్రపంచం నలుమూలలా ఆటను ప్రమోట్ చేయడానికి నా పేరును ఉపయోగిస్తు్న్నారని తెలుసు. ఇంకా (టీ20ల్లో) ఆడే సత్తా నాలో ఉందని అనుకుంటున్నాను’ అని కోహ్లి నవ్వుతూనే ఘాటుగా వ్యాఖ్యానించాడు.

‘పంజాబ్‌తో మ్యాచ్‌లో దూకుడుగా మొదలుపెట్టాలని అనుకున్నాను. కానీ వికెట్లు పడితే.. పరిస్థితులను అంచనా వేసి జాగ్రత్తగా ఆడాలి. ఈ పిచ్ సాధారణ ఫ్లాట్ పిచ్ కాదు. మ్యాచ్‌ను ముగించలేకపోయినందుకు బాధగా ఉంది. బంతిని నేను సరిగా ఆడలేకపోయాను. నేను కవర్ డ్రైవ్ బాగా ఆడగలని పంజాబ్ ప్లేయర్లకు తెలుసు. కాబట్టి నేను షాట్లు ఆడేందుకు గ్యాప్‌లు లేకుండా చేశారు’ అని కోహ్లి తెలిపాడు.

2024-03-26T05:16:14Z dg43tfdfdgfd