గెలుపు జోష్‌లో ఉన్న చెన్నైకి బిగ్ షాక్.. మిగిలిన మ్యాచ్‌లకు స్టార్ బౌలర్ దూరం..!

ఐపీఎల్ 2024లో ఢిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే కీలక పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్.. బంగ్లాదేశ్ తరఫున మ్యాచులు ఆడేందుకు టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక బౌలర్ మతీశ పథిరన సైతం స్వదేశానికి వెళ్లిపోయాడు. తొడ కండరాలు పట్టేయడంతో నాలుగు రోజుల క్రితం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచుకు దూరమయ్యాడు పథిరన. ఆ మ్యాచు అనంతరం టీ20 ప్రపంచకప్ 2024 వీసా ప్రాసెస్ ప్రక్రియ కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు. అనంతరం ఆదివారం పంజాబ్‌తో మ్యాచ్‌ కోసం ధర్మశాలకు వచ్చాడు. కానీ ఈ మ్యాచులో అతడు ఆడలేదు.

అయితే టాస్ సందర్భంగా పథిరన గాయం గురించిన విషయాన్ని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించాడు. అతడికి పాత గాయం తిరగబెట్టిందని దీంతో కోలుకునేందుకు సమయం పట్టే అవకాశం ఉందని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ వెల్లడించింది. దీంతో అతడు మళ్లీ స్వదేశానికి వెళ్లిపోయినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే గాయం తీవ్రత ఎలా ఉంది? కోలుకునేందుకు ఎన్ని రోజులు సమయం పట్టొచ్చు? మళ్లీ తిరిగి వస్తాడా? లేడా? అనే విషయాలను మాత్రం ఫ్రాంఛైజీ వెల్లడించాడు. కానీ పథిరన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అని సదరు ప్రకటనలో సీఎస్కే పేర్కొంది.

కాగా ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో పథిరన కీలక పాత్ర పోషించాడు. ఈ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఏడో ప్లేసులో ఉన్నాడు. అతడు 6 మ్యాచుల్లోనే 13 వికెట్లు తీశాడు. కానీ ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచకప్ 2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో.. చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్, శ్రీలంక క్రికెట్ బోర్డు అతడి గాయం విషయంలో రిస్క్‌ తీసుకునేందుకు ఇష్టపడటం లేదు.

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ సైతం గాయం కారణంగా ఈ సీజన్‌లోని మిగతా మ్యాచులకు దూరమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో మిగిలిన మ్యాచుల్లోనూ సీఎస్కే ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన చెన్నై అందులో ఆరింట్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం మూడో ప్లేసులో ఉంది. మిగాత మూడు మ్యాచుల్లో కనీసం రెండింట్లో గెలిస్తే సీఎస్కే ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కావడం చెన్నై సూపర్ కింగ్స్‌కు మైనస్ అవుతుందని భావిస్తున్నారు. మరి చూడాలి చెన్నై ఏ గేమ్ ప్లాన్‌తో ముందుకు వెళుతుందో చూడాలి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-06T01:17:02Z dg43tfdfdgfd