కేఎల్‌ రాహుల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌లకు షాక్‌ ఇచ్చిన బీసీసీఐ..! ఎందుకంటే?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టును లక్నో సూపర్‌ జెయింట్‌ జట్టు 8 వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో.. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో ఈ సీజన్‌లో లక్నో జట్టు నాలుగో విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరింది.

అయితే ఈ మ్యాచ్‌ అనంతరం విన్నింగ్‌ టీమ్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, ఓటమి పాలైన జట్టు చెన్నై సూపర్‌ కింగ్‌స్ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌ రేటు నమోదు చేసినందుకు గానూ ఇద్దరు కెప్టెన్లకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఫైన్‌ విధించింది. ఈ మేరకు రూ.12 లక్షల చొప్పున జరిమానా విధించినట్లు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.

“లక్నోలోని భారత రత్ని శ్రీ అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఎకనా క్రికెట్ స్టేడియంలో శుక్రవారం జరిగిన లక్నో-చెన్నై మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు నమోదైంది. రెండు జట్లు బౌలింగ్ సందర్భంగా స్లో ఓవర్‌ రేటు నమోదు చేశాయి. దీంతో లక్నో సూపర్‌ జెయింట్స్ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌కు రూ.12 లక్షల చొప్పున ఫైన్‌ పడింది” అని ప్రకటనలో పేర్కొంది.

కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు 176/6 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే బ్యాటర్‌ రవీంద్ర జడేజా 40 బంతుల్లో 57 రన్స్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన మహేంద్ర సింగ్‌ ధోనీ.. 9 బంతుల్లో 28 పరుగులు చేశాడు. అందులో రెండు సిక్స్‌లు, 3 ఫోర్లు ఉన్నాయి.

అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నోకు.. ఓపెనర్లు అదిరే శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు ఏకంగా 134 పరుగులు జోడించారు. కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ (82), క్వింటన్‌ డికాక్‌ (54)లు హాఫ్ సెంచరీలతో రాణించడంతో లక్నో విజయం ఖరారైపోయింది. చివర్లో వీరిద్దరూ ఔట్‌ అయినా.. నికోలస్‌ పూరన్‌ 12 బంతుల్లో 23 పరుగులు చేసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో లక్నో 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సీఎస్కే మూడు, లక్నో ఐదో స్థానంలో ఉన్నాయి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-20T05:18:27Z dg43tfdfdgfd