ఐపీఎల్ రూల్‌పై రోహిత్ శర్మ అసంతృప్తి.. ఆ నిబంధనతో టీమిండియాకు చేటు?

ఐపీఎల్ 2023 సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నిబంధన కారణంగా.. ఐపీఎల్ జట్లు అదనంగా ఓ ఆటగాడితో బరిలోకి దిగుతున్నాయి. దీంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫ్రాంచైజీలకు అదనంగా ఓ ఆటగాడు కలిసొస్తున్నాడు. ఈ నిబంధనను ఉపయోగించుకొని ఫ్రాంచైజీలు ముందుగా బ్యాటింగ్ చేస్తే జట్టులోకి అదనపు బ్యాటర్‌ను తీసుకొని.. సెకండ్ ఇన్నింగ్స్‌ను బ్యాటర్ స్థానంలో స్పెషలిస్ట్ బౌలర్‌ను ఆడిస్తున్నాయి. దీని వల్ల ఆటగాళ్లను తెలివిగా ఉపయోగించుకునే సౌలభ్యం ఫ్రాంచైజీలకు కలుగుతోంది.

ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఫ్రాంచైజీలకు ఉపయుక్తంగా ఉండంతోపాటు.. ఐపీఎల్ మ్యాచ్‌లను మరింత రసవత్తరంగా మార్చేసింది. కానీ ఈ రూల్ పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. బీసీసీఐ తీసుకొచ్చిన ఈ రూల్ తనకు అంతగా నచ్చలేదని హిట్ మ్యాన్ స్పష్టం చేశాడు. ఈ నిబంధన వల్ల 11 మంది ఆటగాళ్లకు బదులు 12 మందిని ఆడించే వెసులుబాటు ఉండటంతో ఆల్‌రౌండర్ల అవసరం లేకుండా పోతోంది. దీంతో జట్లేవీ ఆల్‌రౌండర్లపై అంతగా శ్రద్ధపెట్టడం లేదు.

ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్ రూల్ వల్ల శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్‌రౌండర్లకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదని రోహిత్ శర్మ తెలిపాడు. క్రికెట్ కోణంలోనే చూస్తే.. ఆల్‌రౌండర్లు బౌలింగ్ చేయలేకపోవడం తనను బాధిస్తోందని, ఇది మనకు అంత మంచిది కాదని రోహిత్ అభిప్రాయపడ్డాడు.

‘‘ఈ రూల్‌‌తో ఏం చేస్తారో నాకు తెలీదు. జట్టులో 12 మంది ఆటగాళ్లు ఉంటున్నారు. ఇది ఎంటర్‌టైనింగ్‌గా ఉంటోంది. ఆట ఎలా సాగుతుందో చూశాక, పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో చూశాక ఇంపాక్ట్ ప్లేయర్‌ను తీసుకొస్తున్నారు’’ అని రోహిత్ తెలిపాడు. క్రికెట్‌‌ను ఆడించాల్సింది 12 మంది ఆటగాళ్లతో కాదు.. 11 మందితోనేనని రోహిత్ వ్యాఖ్యానించాడు.

‘‘వికెట్లు కోల్పోకుండా బ్యాటింగ్ బాగా చేయగలిగితే.. అదనంగా మరో బౌలర్‌ను తీసుకోవచ్చు. దీని వల్ల ఆరుగురు లేదా ఏడుగురు బౌలర్లు అందుబాటులోకి వస్తారు. చాలా జట్లలో బ్యాటర్లు బాగా ఆడుతున్నారు. కాబట్టి అదనపు బ్యాటర్ అవసరం లేదు. ఏడు, లేదా ఎనిమిదో స్థానంలోని ఆటగాళ్లు బ్యాటింగ్‌కు రావడం అరుదుగా చూస్తున్నాం’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.

అంతర్జాతీయ క్రికెట్, టీమిండియా యాంగిల్‌లో చూస్తే రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని చెప్పొచ్చు. ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ వెసులుబాటును ఉపయోగించుకోవడానికి అలవాటు పడ్డాక.. అంతర్జాతీయ క్రికెట్లో ఆ వెసులుబాటు లేకపోవడంతో.. టీ20 వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండర్ల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ఆల్‌రౌండర్లు అవసరం లేదని ఫ్రాంచైజీలు వారిని బ్యాటర్లుగానో, బౌలర్లుగానో ఉపయోగిస్తే.. ప్రపంచ కప్ నాటికి వారు అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో సన్నద్ధం కావడం కష్టం అవుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఆల్‌రౌండర్లను సన్నద్ధం చేసేందుకు ప్రతిబంధకంగా మారిందనేది రోహిత్ వ్యాఖ్యల అంతరార్థంగా భావించొచ్చు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-18T08:47:39Z dg43tfdfdgfd