ఇదేం కెప్టెన్సీ..? ఇదేం బ్యాటింగ్..? హార్దిక్ పాండ్యపై ఇర్ఫాన్ పఠాన్ ఫైర్..!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతుంటే.. బుధవారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో మాత్రం భారీ వర్షం కురిసింది... ఎడతెరిపి లేని ఆ సిక్సర్ల వర్షంలో ప్రేక్షకులు తడిసి ముద్దయ్యారు. బ్యాటర్ల వీరవిహారంతో ఐపీఎల్ రికార్డులు.. టీ20 రికార్డులు సలాం కొట్టాయి. ట్రావిస్ హెడ్ మెరుపు ఆరంభాన్ని అభిషేక్ శర్మ కొనసాగించగా.. క్లాసేన్ మరోసారి చెలరేగడంతో.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగుల చేసిన జట్టుగా సన్‌రైజర్స్ రికార్డ్ క్రియేట్ చేసింది.

గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా ముంబై జట్టులోకి వచ్చి.. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యపై మాజీ క్రికెటర్లు, అభిమానుల దృష్టంతా నిలిచిన సంగతి తెలిసిందే. హార్దిక్ కెప్టెన్సీలో తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన ముంబై.. రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా, ఆటగాడిగా విఫలమయ్యాడని మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చెలరేగడంతో సన్‌రైజర్స్ 7 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. వారిద్దరూ ఔటైనా.. మర్‌క్రమ్, క్లాసేన్ కూడా ధాటిగా ఆడటంతో 12 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ 173/3తో పటిష్ట స్థితిలో నిలిచింది. సన్‌రైజర్స్ బ్యాటర్లు సిక్సర్ల మోత మోగిస్తున్నా.. హార్దిక్ పాండ్య మాత్రం తన ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో తొలి 12 ఓవర్లలో ఒకసారి మాత్రమే బౌలింగ్ చేయించాడు. ప్రత్యర్థి ధాటిగా ఆడుతుంటే.. ప్రధాన అస్త్రమైన బుమ్రాను 13వ ఓవర్ దాకా బయటకు తీయకపోవడం ఏంటని టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నించాడు. బుమ్రాను ముందుగానే బౌలింగ్‌కు దించి ఉంటే.. సన్‌రైజర్స్‌ దూకుడు అడ్డుకట్ట వేసేవాడని ఆసీస్ మాజీ స్పీడ్ స్టర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు. బుమ్రాతో పవర్ ప్లేలో బౌలింగ్ చేయించాలని బ్రెట్ లీ సూచించాడు.

278 పరుగుల రికార్డు స్థాయి లక్ష్య చేధనలో ముంబై బ్యాటర్లు దూకుడుగానే ఆడారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, నమన్ ధీర్, షెఫర్డ్ 200కిపైగా స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేయగా.. తిలక్ వర్మ 188 స్ట్రయిక్ రేటుతో 64 రన్స్ చేశాడు. టిమ్ డేవిడ్ సైతం 22 బంతుల్లో 42 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. కానీ ముంబై బ్యాటర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్య ఒక్కడే 120 స్ట్రయిక్ రేట్‌తో 20 బంతుల్లో 24 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు 200 స్ట్రయిక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తుంటే కెప్టెన్ 120 స్ట్రయిక్ రేట్‌తో రన్స్ చేయడం ఏంటని ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నించాడు.

బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడలేకపోయిన హార్దిక్.. బౌలింగ్‌లో మాత్రం కాస్త ఫర్వాలేదనిపించాడు. 4 ఓవర్లలో 46 పరుగులిచ్చిన హార్దిక్ 1 వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లలో బుమ్రా తర్వాత మెరుగైన ఎకానమీ హార్దిక్ పాండ్యదే.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T04:35:46Z dg43tfdfdgfd