ఇది కదా SRH అంటే.. 166 టార్గెట్‌ 9.4 ఓవర్లలో ఉఫ్.. ప్లేఆఫ్స్ బెర్తు పదిలం

కీలకమైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతం చేసింది. ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ ఓపెనర్లు బ్యాట్‌తో బీభత్సం సృష్టించారు. 166 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించారు. ఐపీఎల్ 2024 టోర్నీలో కీలకమైన ప్లే‌ఆఫ్స్ ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ బ్యాటర్లు భీకరమైన ఫామ్‌లోకి వచ్చారు. గత కొన్ని మ్యాచులుగా ఆశించిన మేర రాణించలేకపోయిన ఓపెనర్లు.. సొంతగడ్డపై లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లకు చుక్కలు చూపించారు. లక్నో నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ 9.4 ఓవర్లలోనే వికెట్‌ కూడా కోల్పోకుండా ఛేదించింది. రన్ రేట్ మెరుగుపర్చుకొని ప్లే ఆఫ్స్‌ దిశగా మరో అడుగు ముందుకేసింది. ట్రావిస్ హెడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఓపెనర్లు.. తొలి బంతి నుంచి ఎదురుదాడికి దిగారు. హోం గ్రౌండ్‌లో వచ్చిన బంతిని వచ్చినట్లే స్టాండ్స్‌లోకి పంపించారు. లక్నో బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డ ఇదే పిచ్‌పై అవలీలగా ఫోర్లు, సిక్సర్లు కొట్టారు. ఈ సీజన్‌లో విశేషంగా రాణిస్తున్న ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ జోడీ అదే జోరు కొనసాగించింది. పవర్‌ ప్లే ముగిసే సరికే 107/0తో విజయాన్ని ఖరారు చేసింది. ఈ మ్యాచ్‌లో పవర్‌ ప్లే ముగిసే సమయానికి లక్నో 27/2 చేయడం గమనార్హం.

ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన అభిషేక్ శర్మ, ట్రావిస్‌ హెడ్‌లు హాఫ్‌ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. హెడ్‌ 16 బంతుల్లో 50 పరుగుల మార్కును చేరుకోగా.. అభిషేక్‌ 19 బంతుల్లో ఈ ఫీట్‌ సాధించాడు. ఇన్నింగ్స్‌ ఆద్యంతం ఇదే జోరు కొనసాగించిన ఈ జోడి.. పది ఓవర్లు కూడా పూర్తి కాకముందే మ్యాచ్‌ను ముగించింది. 9.4 ఓవర్లలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం సాధించింది. ట్రావిస్‌ హెడ్‌ (30 బంతుల్లో 89 రన్స్‌), అభిషేక్‌ శర్మ (28 బంతుల్లో 75 రన్స్‌) అజేయంగా నిలిచారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 165/4 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ (33 బంతుల్లో 29 రన్స్‌) పరుగులు చేసేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఒక దశలో 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లక్నో.. చివర్లో పూరన్‌ (26 బంతుల్లో 48 రన్స్‌), ఆయుష్‌ బదోనీ (30 బంతుల్లో 55 రన్స్‌) చేయడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది.

సన్‌రైజర్స్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ మరోసారి అద్భుత ప్రదర్శన చేశాడు. 3 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ 1 వికెట్‌ తీశాడు.

ఈ విజయంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఈ సీజన్‌లో 12 మ్యాచుల్లో 7 విజయాలు సాధించిన సన్‌రైజర్స్.. మిగిలిన రెండు మ్యాచుల్లో కనీసం ఒక్కదాంట్లో గెలిచినా ప్లే ఆఫ్స్‌ చేరే అవకాశం ఉంది. ఇక వరుసగా రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన లక్నో.. నెట్‌ రన్‌రేట్‌ కోల్పోయి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T16:56:14Z dg43tfdfdgfd