అశుతోష్ పోరాటం వృథా.. ఉత్కంఠ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో పంజాబ్‌పై ముంబై విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ముంబై ఇండియన్స్ జట్టు మూడో విజయాన్ని సాధించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచులో 9 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసి 192/7 పరుగులు చేసిన ముంబై.. అనంతరం పంజాబ్‌ను 183 పరుగులకు ఆలౌట్ చేసింది. ఈ ఫలితంతో ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మూడో విజయాన్ని, పంజాబ్ ఐదో ఓటమిని నమోదు చేసింది.

193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు.. ఆదిలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా 2, గెరాల్డ్ కొయెట్జీ 2 వికెట్లతో చెలరేగడంతో 2.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. సామ్ కర్రన్ (6), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (0), రిలీ రూసో (1), లియామ్ లివింగ్ స్టోన్ (1)లు ఔట్ అయ్యారు. దీంతో పంజాబ్ ఓటమి ఖాయమని అంతా భావించారు.

కానీ ఈ సీజన్‌లో విశేషంగా రాణిస్తున్న శశాంక్ సింగ్ (25 బంతుల్లో 41 రన్స్), అశుతోష్ శర్మ (28 బంతుల్లో 61 రన్స్) చేయడంతో అనూహ్యంగా పంజ్ కింగ్స్ పోటీలోకి వచ్చింది. ఓ దశలో 16 ఓవర్లకు 165/7తో నిలిచింది. క్రీజులో అశుతోశ్ శర్మ ఉండటంతో పంజాబ్ గెలిచేలా కనిపించింది. కానీ 17వ ఓవర్ వేసిన బుమ్రా కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చివరి 3 ఓర్లలో పంజాబ్‌కు 25 పరుగులు అవసరమయ్యాయి.

కానీ 18 ఓవర్ తొలి బంతికే అశుతోష్ శర్మ ఔట్ కావడంతో పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అప్పటికే బ్యాటర్లంతా ఔట్ కాగా.. హర్‌ప్రీత్ బ్రార్, రబాడా కూడా ఔట్ కావడంతో పంజాబ్ కథ ముగిసింది. విజయానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 19.1 ఓవర్లలో పంజాబ్.. 183 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 3, గెరాల్డ్ కొయెట్జీ 3, ఆకాశ్ మధ్వాల్ 1, హార్దిక్ పాండ్యా 1, శ్రేయస్ గోపాల్ 1 వికెట్ పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 192/7 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (53 బంతుల్లో 78 రన్స్), రోహిత్ శర్మ (25 బంతుల్లో 36 రన్స్), తిలక్ వర్మ (18 బంతుల్లో 34 రన్స్) రాణించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు, సామ్ కర్రన్ 2 వికెట్లు, కగిసో రబాడ 1 వికెట్ పడగొట్టారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-18T18:32:53Z dg43tfdfdgfd