అవునా.. నిజమా.. గతంలో క్లాసెన్, ట్రావిస్ హెడ్ ఆర్సీబీకి ఆడారా? ఇప్పుడు రెచ్చిపోడానికి అసలు కారణం అదేనా..?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఐపీఎల్‌లో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన జట్లలో ఒకటి. లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆడుతున్నా ఆ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్, మిచెల్ స్టార్క్ లాంటి ప్లేయర్లు సైతం ఆ జట్టుకు ట్రోఫీని అందించలేకపోయారు. అయితే ఆర్సీబీ జట్టుకు ఓ పేరుంది. ఆ జట్టులో ఉన్న ఆటగాళ్లు.. ఆ జట్టును వీడితే అద్భుత ప్రదర్శన చేస్తారని ప్రచారం ఉంది.

ఇది అనేక సార్లు రుజువైంది కూడా. ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఒకప్పుడు ఆర్సీబీకి ఆడినవాడే. గత రెండు సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున పరుగుల వరద పారిస్తున్న శివమ్ దూబే సైతం ఒకప్పుడు ఆర్సీబీ ఆటగాడే. అయితే ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ తరఫున ఆదరగొడుతున్న ఇద్దరు ఆటగాళ్లు సైతం గతంలో ఆర్సీబీకి ఆడినవారే అనే విషయం తాజాగా చర్చనీయాంశంగా మారింది. వారు మరెవరో కాదు దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ హెన్సిచ్ క్లాసెన్, వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్.

అవును.. మీరు చదివింది నిజమే. వీరిద్దరూ గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడారు. హెన్రిచ్ క్లాసెన్ 2019 సీజన్‌లో ఆర్సీబీ తరఫున ఆడాడు. ఆ సీజన్‌లో క్లాసెన్‌కు కేవలం మూడు మ్యాచులు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. అందులోనూ క్లాసెన్ పెద్దగా పర్ఫార్మ్ చేయలేదు. 3 మ్యాచుల్లో 9 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తర్వాత సీజన్‌కు ముందు ఆర్సీబీ అతడిని వదిలేసింది.

వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్ సైతం మాజీ ఆర్సీబీ ప్లేయరే. 2016, 2017 సీజన్‌లలో ఆర్సీబీ తరఫున 10 మ్యాచుల్లో బరిలోకి దిగిన ఈ ఆసీస్ లెఫ్ట్ హ్యాండర్ మోస్తరు ప్రదర్శన చేశాడు. 29కి పైగా సగటుతో 205 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 139 గా ఉంది.

ప్రస్తుత సీజన్‌లో హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్‌లో దుమ్మురేపుతున్నారు. సన్ రైజర్స్ తరఫున పరుగుల వరద పారిస్తున్నారు. ముంబైతో జరిగిన మ్యాచులో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సన్ రైజర్స్ నిలవడంలో వీరిద్దరి పాత్ర కీలకం. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ట్రోలర్స్ గతంలోకి వెళ్లి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నారు. కొందరైతే.. ఆర్సీబీలో ఉండగా వీరంతా మంచి ప్రదర్శన చేయరెందుకో అని కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరేమో ఆర్సీబీ నుంచి ఇతర ఫ్రాంఛైజీలకు వెళ్లి అక్కడ రాణిస్తున్న ప్లేయర్లను గుర్తు చేస్తున్నారు.

ఇక ఈ సీజన్‌లో ఆర్సీబీ రెండు మ్యాచులు ఆడింది. అందులో సీఎస్కేతో ఓడి.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో గెలుపొందింది. శుక్రవారం కేకేఆర్‌తో తలపడనుంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T11:51:28Z dg43tfdfdgfd