TEAM INDIA | భళిరా భారత్‌.. వేదిక ఏదైనా పాక్‌పై మనదే విజయం

  • పాకిస్థాన్‌పై ఉత్కంఠ విజయం
  • మూడు వికెట్లతో బుమ్రా విజృంభణ..
  • బాబర్‌ సేనకు వరుసగా రెండో ఓటమి
  • రాణించిన పాక్‌ బౌలర్లు
  • భారత్‌ 119 ఆలౌట్‌

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్‌ అద్భుత విజయాల ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతున్నది. వేదిక ఏదైనా విజయం మనదే అన్న రీతిలో టీమ్‌ఇండియా మువ్వెన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించింది. అగ్రరాజ్యం అమెరికా గడ్డపై దాయాదిని మట్టికరిపిస్తూ తమ విజయాల రికార్డును మరో మెట్టు ఎక్కించింది. తొలుత పాక్‌ పేసర్ల ప్రతాపానికి బ్యాటర్లు కుదేలైన వేళ.. భారత్‌ 119 పరుగులకే కుప్పకూలింది. రిషబ్‌ పంత్‌(42) ఒంటరిపోరాటం జట్టుకు పోరాడే స్కోరు కట్టబెట్టింది. బ్యాటర్లు విఫలమైన చోట మన బౌలర్లు విశ్వరూపం ప్రదర్శించారు. బుమ్రా సూపర్‌ స్పెల్‌తో జట్టుకు చారిత్రక విజయాన్ని కట్టబెట్టాడు.

Team India | న్యూయార్క్‌: ఇది కదా మ్యాచ్‌ అంటే! టీ20లలో బ్యాటర్ల రొడ్డకొట్టుడు బాదుడు కంటే ‘లో స్కోరింగ్‌ థ్రిల్లర్‌’లో ఉండే మజాను భారత్‌-పాక్‌ మ్యాచ్‌ మరోసారి అందించింది. చివరి బంతి దాకా ఇరు జట్ల మధ్య నువ్వా నేనా అంటూ దోబూచులాడిన విజయం ఆఖరికి భారత్‌ను వరించింది. ఆదివారం న్యూయార్క్‌ లోని నసావు స్టేడియం వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ సేన 6 వికెట్ల తేడాతో అత్యద్భుత విజయం అందుకుంది. పాక్‌ చతుర్దయం నసీమ్‌ షా (3/21), హరీస్‌ రవూఫ్‌ (3/21), మహ్మద్‌ అమిర్‌ (2/23), షహీన్‌ అఫ్రిది (1/29) నిప్పులు చెరగడంతో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్‌ అయింది. రిషభ్‌ పంత్‌ (31 బంతుల్లో 42, 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా అక్షర్‌ పటేల్‌ (20) గుడ్డిలో మెల్లలా ఫర్వాలేదనిపించాడు. భారత బ్యాటర్లలో కోహ్లీతో సహా ఏకంగా ఎనిమిది మంది ‘సింగిల్‌ డిజిట్‌’కే పరిమితమయ్యారు. బ్యాటర్లు విఫలమైనా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పాకిస్థాన్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 113/7కే పరిమితమైంది. రిజ్వాన్‌ (44 బంతుల్లో 31, 1 ఫోర్‌, 1 సిక్సర్‌) రాణించినా మిగిలిన బ్యాటర్లు ఒత్తిడికి చిత్తయ్యారు. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా (3/14)కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

వచ్చారు.. వెళ్లారు..

కీలక మ్యాచ్‌లో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ దారుణాతి దారుణంగా విఫలమైంది. రోహిత్‌ (13), కోహ్లీ (4), సూర్యకుమార్‌ (7), శివమ్‌ దూబె (3), హార్ధిక్‌ పాండ్యా (7), రవీంద్ర జడేజా (0) అలా వచ్చి ఇలా వెళ్లారు. ఇన్నింగ్స్‌ మూడో బంతినే భారీ సిక్సర్‌గా మలిచిన రోహిత్‌, ఎదుర్కున్న తొలి బంతినే బౌండరీగా మలిచిన కోహ్లీ ఆరు బంతుల వ్యవధిలో పెవలియన్‌ చేరారు. కోహ్లీని నసీమ్‌ షా ఔట్‌ చేయగా రోహిత్‌ను షహీన్‌ పెవిలియన్‌కు పంపాడు. ఈ క్రమంలో భారత్‌.. పంత్‌కు జోడీగా అక్షర్‌ను పంపింది. ఈ జోడీ పాక్‌ పేస్‌ బౌలర్లను అడ్డుకున్నా వేగంగా పరుగులు రాబట్టలేకపోయింది. మూడో వికెట్‌కు 39 పరుగులు జోడించిన ఈ జంటను 8వ ఓవర్లో అమిర్‌ విడదీయడంతో వికెట్ల పతనం వేగం పుంజుకుంది. ఆ తర్వాత వచ్చినోళ్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. భారత అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న సూర్యకు హరీస్‌ రవూఫ్‌ చెక్‌ పెట్టగా దూబె నసీమ్‌ షాకే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. అమిర్‌ 15వ ఓవర్‌ వరుస బంతుల్లో పంత్‌, జడేజాను ఔట్‌ చేశాడు. అర్ష్‌దీప్‌ (9), సిరాజ్‌ (7 నాటౌట్‌) పుణ్యమా అని భారత్‌ మూడంకెల మార్కును దాటగలిగింది. భారత ఇన్నింగ్స్‌ మొదటి 10 ఓవర్లలో 3 వికెట్లకు 81 పరుగులు చేస్తే తర్వాతి 9 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 38 పరుగులే చేయగలిగింది.

రిజ్వాన్‌ ఒక్కడే..

స్వల్ప ఛేదనలో పాకిస్థాన్‌ సైతం తడబడింది. బాబర్‌ ఆజమ్‌ (13), ఉస్మాన్‌ ఖాన్‌ (13), ఫకర్‌ జమాన్‌ (13) విఫలమైనా రిజ్వాన్‌ పాక్‌ను గెలుపు దిశగా నడిపించాడు. సహచరుల అండతో విజయం దిశగా సాగుతున్న పాక్‌ను బుమ్రా దెబ్బకొట్టాడు. 15వ ఓవర్లో రిజ్వాన్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసి భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. అప్పటికీ ఆజట్టు విజయానికి 4 ఓవర్లలో 36 పరుగులు కావాలి. కానీ తర్వాతి వరుస ఓవర్లలో అక్షర్‌ 2 పరుగులే ఇవ్వగా.. షాదాబ్‌ (4)ను ఔట్‌ చేసిన హార్దిక్‌ 5 రన్స్‌ ఇచ్చాడు. 18వ ఓవర్లో సిరాజ్‌ 9 పరుగులిచ్చాడు. బుమ్రా 19వ ఓవర్లో 3 పరుగులే ఇచ్చి కీలక ఇఫ్తికార్‌ (5) వికెట్‌ తీశాడు.

ఆఖరి ఓవర్‌ సాగిందిలా..

చివరి ఓవర్‌లో పాక్‌ గెలుపునకు 18 పరుగులు కావాల్సి ఉండగా.. అర్ష్‌దీప్‌ తొలి బంతికి ఇమాద్‌ వసీం (15)ను ఔట్‌ చేశాడు. 2,3 బంతుల్లో రెండు పరుగులు రాగా 4,5 బంతుల్లో నసీమ్‌ షా రెండు బౌండరీలు సాధించినా అప్పటికీ ఆ జట్టు విజయానికి 1 బంతికి 8 పరుగులు అవసరం ఉండటంతో పాక్‌ ఓటమి ఖరారైంది.

సంక్షిప్త స్కోర్లు:

భారత్‌: 19 ఓవర్లలో 119 ఆలౌట్‌ (పంత్‌ 42, అక్షర్‌ 20, నసీమ్‌ 3/21, హరీస్‌ 3/21).

పాకిస్థాన్‌: 20 ఓవర్లలో 113/7 (రిజ్వాన్‌ 31, ఇమాద్‌ 15, బుమ్రా 3/14, హార్దిక్‌ 2/24)

2024-06-10T00:36:05Z dg43tfdfdgfd