TEAM INDIA | నేడు దాయాదుల సమరం.. జోరుమీదున్న టీమ్‌ఇండియా

  • భారత్‌ X పాక్‌
  • ఒత్తిడిలో బాబర్‌సేన

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. అగ్రరాజ్యం అమెరికా వేదికగా దాయాదులు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడబోతున్నారు. పొట్టి ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై ఘనమైన రికార్డును కొనసాగించేందుకు భారత్‌ తహతహలాడుతున్నది. ఐర్లాండ్‌పై ఘన విజయంతో టీమ్‌ఇండియా మంచి జోరుమీదుంటే..ఆతిథ్య అమెరికా చేతిలో అనూహ్య ఓటమితో పాక్‌ ఒత్తిడి ఎదుర్కొంటున్నది. మెగాటోర్నీలో కీలక మ్యాచ్‌గా భావిస్తున్న భారత్‌, పాక్‌ పోరులో పైచేయి ఎవరిదో మరికొన్ని గంటల్లో తేలనుంది.

Team India | న్యూయార్క్‌: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌లో బ్లాక్‌బస్టర్‌ పోరుకు సమయం ఆసన్నమైంది. బేస్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌లో మునిగితేలే అమెరికా వాసులకు భారత్‌, పాకిస్థాన్‌ పోరు అసలైన మజాను అందించనుంది. యుద్ధాన్ని తలపించే మ్యాచ్‌ కోసం ఇప్పటికే ఇరు దేశాల అభిమానులు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. మెగాటోర్నీ కోసం కొత్తగా నిర్మించిన నసావు స్టేడియంలో ఆదివారం భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కీలక పోరు జరుగనుంది. 34,000 మంది సామర్థ్యం కల్గి ఉన నసావు స్టేడియం దాయాదుల మ్యాచ్‌కు కిక్కిరిసిపోయే అవకాశముంది. టిక్కెట్ల భారీ ధరను కూడా లెక్క చేయకుండా వేల మైళ్ల దూరం ప్రయాణించి తమ అభిమాన క్రికెటర్లను ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

రోహిత్‌సేన జోరు 

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ జోరుమీద కనిపిస్తున్నది. ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన రోహిత్‌సేన అదే దూకుడుతో పాక్‌ పనిపట్టాలని చూస్తున్నది. నిలకడలేమికి చిరునామా అయిన పాక్‌ చెక్‌ పెట్టేందుకు టీమ్‌ఇండియా అస్త్రశస్ర్తాలతో సిద్ధమైంది. ఐర్లాండ్‌తో ఆడిన జట్టునే పాక్‌తో మ్యాచ్‌కు దాదాపు కొనసాగించే అవకాశముంది. అక్షర్‌పటేల్‌ లేదా జడేజా స్థానంలో స్పిన్నర్‌ కుల్దీప్‌యాదవ్‌ జట్టులోకి తీసుకునే చాన్స్‌ కనిపిస్తున్నది. రోహిత్‌, కోహ్లీ ఓపెనర్లుగా రానుండగా, రిషబ్‌ పంత్‌ మూడో స్థానం ఫిక్స్‌ అయ్యింది.

పాక్‌ పరేషాన్‌: మెగాటోర్నీలో పాకిస్థాన్‌కు ఆదిలోనే అమెరికా టీమ్‌ కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. టోర్నీలో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాలంటే పాక్‌..భారత్‌పై గెలువక తప్పని పరిస్థితి నెలకొన్నది. షాహిన్‌ అఫ్రిది, హరిస్‌ రవూఫ్‌, మహ్మద్‌ ఆమిర్‌, యాసిర్‌ షాతో పాక్‌ పేస్‌ దళం బలంగా కనిపిస్తున్నా..భారత్‌ ఎలా అడ్డుకట్ట వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

పిచ్‌పై రచ్చ: నసావు స్టేడియంలో డ్రాప్‌ ఇన్‌ పిచ్‌లపై ఐసీసీ ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌లపై అటు ప్లేయర్లతో పాటు మాజీలు తమదైన శైలిలో తప్పుబడుతున్నారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్‌, పంత్‌కు గాయాలు కాగా, పాక్‌తో పోరులో పిచ్‌ ఎలా స్పందిస్తున్నది అంచనాలకు అందకుండా ఉంది.

జట్ల అంచనా

భారత్‌: రోహిత్‌(కెప్టెన్‌), కోహ్లీ, పంత్‌,సూర్యకుమార్‌, దూబే, పాండ్యా, జడేజా, అక్షర్‌, బుమ్రా, అర్ష్‌దీప్‌, సిరాజ్‌

పాకిస్థాన్‌: బాబర్‌(కెప్టెన్‌), రిజ్వాన్‌, ఉస్మాన్‌, జమాన్‌, ఆజమ్‌, ఇఫ్తికార్‌, షాదాబ్‌/ఆయూబ్‌, ఆఫ్రిది, నసీమ్‌, ఆమిర్‌, రవూఫ్‌.

2024-06-08T21:01:30Z dg43tfdfdgfd