T20 WORLD CUP | సూపర్‌-8లో సఫారీలు.. బంతితో ఆకట్టుకుని బ్యాట్‌తో తడబడిన బంగ్లా

  • 113 పరుగుల ఛేదనలో బంగ్లా బోల్తా
  • స్వల్ప స్కోర్ల పోరులో దక్షిణాఫ్రికాదే పైచేయి

అదే ఉత్కంఠ! అదే మజా! బౌలర్లకు స్వర్గధామంగా మారి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న న్యూయార్క్‌ పిచ్‌పై భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఆదివారం ముగిసిన ‘లో స్కోరింగ్‌ థ్రిల్లింగ్‌’ మాదిరిగానే మరో ఉత్కంఠ పోరు క్రికెట్‌ అభిమానులను అలరించింది. దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్‌ మధ్య సోమవారం జరిగిన ‘స్వల్ప స్కోర్ల సమరం’లో సఫారీలదే పైచేయి అయ్యింది. నసావు పిచ్‌పై భారీ హిట్టర్లు కలిగిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 113 పరుగులే చేసినా ఆ జట్టు దానిని విజయవంతంగా కాపాడుకుంది. బంతితో ఆకట్టుకున్న బంగ్లా.. బ్యాట్‌తో తడబడి 109 పరుగుల వద్దే ఆగిపోయి ఓటమిపాలైంది. ఈ విజయంతో సూపర్‌-8 దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా దక్షిణాఫ్రికా నిలిచింది.

T20 World Cup | న్యూయార్క్‌: కొద్దిగంటల క్రితమే భారత్‌-పాకిస్థాన్‌ మధ్య జరిగిన ఉత్కంఠ పోరును మరువకముందే టీ20 వరల్డ్‌ కప్‌లో మరో ‘లోయెస్ట్‌ స్కోరింగ్‌ థ్రిల్లర్‌’ అభిమానులను కట్టిపడేసింది. న్యూయార్క్‌లోని నసావు స్టేడియం వేదికగా సౌతాఫ్రికా.. బంగ్లాదేశ్‌పై 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా.. తంజీమ్‌ హసన్‌ షకిబ్‌ (3/18), టస్కిన్‌ అహ్మద్‌ (2/19) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (44 బంతుల్లో 46, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్‌ మిల్లర్‌ (38 బంతుల్లో 29, 1 ఫోర్‌, 1 సిక్స్‌) ఆదుకోకుంటే సఫారీల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఛేదనలో తడబడ్డ బంగ్లాదేశ్‌.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 109 పరుగులు చేసి విజయానికి 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. తౌవిద్‌ హృదయ్‌ (34 బంతుల్లో 37, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మదుల్లా (27 బంతుల్లో 20, 2 ఫోర్లు) పోరాడారు. క్లాసెన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

టాపార్డర్‌ వైఫల్యం

ప్రొటీస్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ రీజా హెండ్రిక్స్‌ను తంజీమ్‌ హసన్‌ డకౌట్‌ చేసి బంగ్లాకు తొలి బ్రేక్‌ ఇచ్చాడు. 6, 4, 6తో జోరుమీదున్న డికాక్‌ (18)ను సైతం తంజీమ్‌ మూడో ఓవర్లో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. నాలుగో ఓవర్‌లో టస్కిన్‌.. మార్క్మ్‌ (4)ను బౌల్డ్‌ చేసి దక్షిణాఫ్రికా కష్టాలను రెట్టింపు చేయగా మరుసటి ఓవర్లో తంజీమ్‌.. ప్రమాదకర ట్రిస్టన్‌ స్టబ్స్‌ (0)ను పెవిలియన్‌కు పంపి ఆ జట్టును పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. 23 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికాను క్లాసెన్‌-మిల్లర్‌ ఆదుకున్నారు. ఈ ఇద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. బంగ్లా బౌలర్లు కట్టడితో సౌతాఫ్రికా ఎట్టకేలకు 17 ఓవర్లకు వంద పరుగుల మార్కును చేరింది. కానీ 18వ ఓవర్లో టస్కిన్‌.. క్లాసెన్‌ను బౌల్డ్‌ చేయడంతో 79 పరుగుల ఐదో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాతి ఓవర్లోనే మిల్లర్‌ సైతం నిష్క్రమించాడు.

ఒత్తిడికి చిత్తైన బంగ్లా

ఛేదనలో బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ సైతం తడబడింది. రెండో ఓవర్లోనే రబాడా.. తంజీద్‌ హసన్‌ (9)ను ఔట్‌ చేశాడు. ఏడో ఓవర్లో బౌలింగ్‌ మార్పుగా వచ్చిన కేశవ్‌ మహారాజ్‌.. లిటన్‌ దాస్‌ (9)ను పెవిలియన్‌కు పంపాడు. 8వ ఓవర్లో బంతిని అందుకున్న అన్రిచ్‌ నోకియా వరుస ఓవర్లలో షకిబ్‌ అల్‌ హసన్‌ (3), నజ్ముల్‌ హోసెన్‌ శాంటో (14)ను ఔట్‌ చేయడంతో బంగ్లా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కానీ యువ ఆటగాడు హృదయ్‌తో జతకలిసిన సీనియర్‌ బ్యాటర్‌ మహ్మదుల్లా ఆ జట్టును గట్టెక్కించే యత్నం చేశాడు. విజయానికి 20 పరుగుల దూరంలో రబాడా.. హృదయ్‌ను ఔట్‌ చేయడంతో బంగ్లా ఒత్తిడికి గురైంది. ఇదే అదునుగా ప్రొటీస్‌ బౌలర్లు, ఫీల్డర్లు తమ అనుభవన్నంతా రంగరించి బంగ్లాను కట్టడిచేశారు. 18వ ఓవర్లో రబాడా 2 పరుగులే ఇవ్వగా బర్ట్‌మన్‌ 19వ ఓవర్లో 7 రన్స్‌ ఇచ్చాడు. కేశవ్‌ మహారాజ్‌ వేసిన చివరి ఓవర్లో బంగ్లా విజయానికి 11 పరుగులు కావాల్సి ఉండగా మూడో బంతికి జేకర్‌ అలీ (8), బంగ్లా భారీ ఆశలు పెట్టుకున్న మహ్మదుల్లా భారీ షాట్‌ ఆడబోయి మార్క్మ్‌క్రు చిక్కడంతో ఆ జట్టు ఓటమి ఖరారైంది.

సంక్షిప్త స్కోర్లు:

దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 113/6 (క్లాసెన్‌ 46, మిల్లర్‌ 29, తంజీమ్‌ 3/18, టస్కిన్‌ 2/19).

బంగ్లాదేశ్‌: 20 ఓవర్లలో 109/7 (హృదయ్‌ 37, మహ్మదుల్లా 20, కేశవ్‌ 3/27, నోకియా 2/17)

2024-06-10T20:09:00Z dg43tfdfdgfd