SRH: హైదరాబాద్ జోరు.. మరో రికార్డు విజయం, ఇలాగే ఆడితే కప్పు కన్ఫామే

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఓఢించి.. వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 266/7 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ను 199 పరుగులకు ఆలౌట్ చేసింది. 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ట్రావిస్ హెడ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.

267 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. పృథ్వి షా (16), డేవిడ్ వార్నర్ (1) త్వరగానే ఔట్ అయినా.. జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్ రాణించడంతో పోటీలోకి వచ్చింది. లక్ష్యం దిశగా సాగింది. రెండు వికెట్లు కోల్పోయి 6.4 ఓవర్లలోనే వంద పరుగుల మార్కును దాటింది. జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి.. సన్ రైజర్స్ బౌలర్లను భయపెట్టాడు. జేక్ ఫ్రెజర్ మెక్‌గుర్క్ 18 బంతుల్లో 65 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అభిషేక్ పోరెల్ దూకుడుగా ఆడటంతో ఓ దశలో 8 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 131/3తో నిలిచింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డు స్కోరును ఛేజ్ చేసేలా కనిపించింది.

కానీ 22 బంతుల్లో 42 పరుగులు చేసిన అనంతరం అభిషేక్ ఔట్ కావడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా మారిపోయింది. ట్రిస్టన్ స్టబ్స్ (10), లలిత్ యాదవ్ (7), అక్షర్ పటేల్ (6) ఔట్ కావడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. చివర్లో రిషభ్ పంత్ 35 బంతుల్లో 44 పరుగులు చేశాడు, కానీ గెలిపించలేకపోయాడు. చివరకు 19.1 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 199 పరుగులకు ఆలౌట్ అయింది. సన్ రైజర్స్ బౌలర్లలో నటరాజన్ 4 వికెట్లు, మయాంక్ మార్కండే 2, నితీశ్ రెడ్డి 2, వాషింగ్టన్ సుందర్ 1, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీశారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ భారీ స్కోరు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (32 బంతుల్లో 89 రన్స్‌), అభిషేక్‌ శర్మ (12 బంతుల్లో 46 రన్స్‌), షాబాద్ అహ్మద్ (29 బంతుల్లో 59 రన్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 266/7 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ మూడోసారి 250 పైచిలుకు స్కోరు నమోదు చేసింది. అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో 277/3, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో 287/3 పరుగులు చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచులో ఓ దశలో సన్ రైజర్స్ పవర్‌ప్లే ముగిసే సరికి 125/0తో నిలిచింది. 300 పైచిలుకు స్కోరు చేసేలా కనిపించింది. కానీ చివర్లో వికెట్లు తీసిన ఢిల్లీ.. 266/7 పరుగులకు సన్ రైజర్స్‌ను పరిమితం చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌ 4 వికెట్లు, ముకేశ్‌ కుమార్ 1, అక్షర్‌ పటేల్‌ 1 వికెట్‌ తీశారు.

ఈ మ్యాచ్ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఆడిన 7 మ్యాచుల్లో ఐదు విజయాలు సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచుల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-20T18:04:23Z dg43tfdfdgfd