SRH: హార్దిక్ సేనపై హైదరాబాద్ దండయాత్ర.. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధ్వంసం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చరిత్ర సృష్టించింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 277 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్‌ పాండ్యా.. సన్‌ రైజర్స్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. అయితే పాండ్యా తీసుకున్న నిర్ణయం ఎంత తప్పో కాసేపటికే అర్థమైంది. ముగ్గురు బ్యాట్స్‌మన్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ అర్ధ శతకాలు చేశారు. మార్‌క్రమ్ 42 పరుగులు చేశాడు.

సొంతగడ్డపై తొలి మ్యాచ్‌ ఆడుతున్న హైదరాబాద్‌ బ్యాటర్లు.. భారీ షాట్లతో విరుచుకపడ్డారు. ఈ మ్యాచ్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున ఎంట్రీ ఇచ్చిన వన్డే ప్రపంచకప్‌ హీరో ట్రావిస్‌ హెడ్.. విధ్వంసం సృష్టించాడు 24 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అతడికి తోడు అభిషేక్‌ శర్మ 23 బంతుల్లో 63 రన్స్‌ చేశాడు. గత మ్యాచ్‌లో జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేసిన హెన్రిచ్‌ క్లాసెన్‌.. ఈ మ్యాచ్‌లో మరింత రెచ్చిపోయాడు. 34 బంతుల్లోనే 80 రన్స్ స్కోర్‌ చేశాడు.

దీంతో రికార్డు స్థాయిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. దీంతో లీగ్‌ చరిత్రలో అత్యధిక స్కోరు 263/5 బ్రేక్‌ అయింది. 2013లో పూణె వారియర్స్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఈ స్కోరు నమోదు చేసింది. తాజాగా 11 ఏళ్ల తర్వాత ఆ రికార్డును ఎస్‌ఆర్‌హెచ్‌ బద్దలు కొట్టింది. హైదరాబాద్ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.

ముంబై బౌలర్లలో బుమ్రా మినహా మిగతా బౌలర్లంతా ఓవర్‌కు 11 పరుగులకు పైగా సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన క్వెనా మఫాక 4 ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-27T16:19:34Z dg43tfdfdgfd