SRH VS LSG | ఆదుకున్న పూరన్‌, బదోని.. సన్‌రైజర్స్‌ టార్గెట్‌ ఎంతంటే..!

SRH vs LSG | ఉప్పల్‌ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ ఇన్నింగ్స్‌ ముగిసింది. హైదరాబాద్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో లఖ్‌నవూ పరుగులు తీయడంలో వెనుకబడింది. టాపార్డర్‌ విఫలమైన వేళ పూరన్‌, బదోని దూకుడుగా ఆడి లఖ్‌నవూకు కీలక స్కోర్‌ను అందించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూను సన్‌రైజర్స్‌ ఆరంభం నుంచి కట్టడి చేస్తూనే వచ్చింది. దీంతో మూడో ఓవర్‌లోనే క్వింటన్‌ డికాక్‌ (2) వికెట్‌ను కోల్పోయింది. ఇక ఐదో ఓవర్‌లో రెండో బంతికి స్టాయినిస్‌ (3).. సన్వీర్‌ సింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో వికెట్లను కాపాడుకునే క్రమంలో లఖ్‌నవూ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌ (29), కృనాల్‌ పాండ్యా (24) నిలకడగా ఆడుతూ పరుగులు తీయడంలో వెనుకబడిపోయారు. పవర్‌ ప్లే ముగిసేసరికి 27 రన్స్‌ మాత్రమే చేయగలిగారు. అయినప్పటికీ పదో ఓవర్‌లో మూడో వికెట్‌ కోల్పోయారు. కమిన్స్‌ వేసిన ఈ ఓవర్‌లో చివరి బంతికి భారీ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన కేఎల్‌ రాహుల్‌.. నటరాజన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కృనాల్‌ పాండ్యా కూడా ఔటయ్యాడు. 12వ ఓవర్‌లో కృనాల్‌ పాండ్యా రనౌటయ్యి పెవిలియన్‌కు చేరాడు. టాపార్డర్‌ విఫలమైన వేళ క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్(48)‌, బదోని (55) లఖ్‌నవూను ఆదుకున్నారు. ఇద్దరూ చెమటోడ్చి జట్టుకు కీలక స్కోర్‌ అందించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు 166 పరుగుల టార్గెట్‌ను సెట్‌ చేసింది.

2024-05-08T16:00:26Z dg43tfdfdgfd