SRH VS DCF | హెడ్, షహ్‌బాజ్ వీర‌విహారం.. మూడోసారి 250 ప్ల‌స్ కొట్టిన స‌న్‌రైజ‌ర్స్

SRH vs DC : చిన్న‌స్వామిలో బెంగ‌ళూరు బౌల‌ర్ల‌ను ఉతికేసిన సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sunrisers Hyderabad) బ్యాట‌ర్లు ఈసారి ఢిల్లీ గ‌డ్డ‌పై సిక్స‌ర్ల మోత మోగించారు. ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్(89), షహ్‌బాజ్ అహ్మ‌ద్(59 నాటౌట్‌), అభిషేక్ శ‌ర్మ‌(46)లు సునామీలా విరుచుకుప‌డ్డారు. దాంతో, హైద‌రాబాద్ 7 వికెట్ల న‌ష్టానికి 266 ర‌న్స్ కొట్టింది.  హెడ్, అభిషేక్ ఊచ‌కోత‌తో  3 ఓవ‌ర్ల‌కే స్కోర్ 32.. ఆరు ఓవ‌ర్ల‌కు 125.. ఇలా రాకెట్ వేగంతో ప‌రుగులు తీసింది. దాంతో, క‌మిన్స్ సేన‌ అల‌వోక‌గా 300 కొడుతుంద‌నిపించింది. అయితే.. ప‌వ‌ర్ ప్లే త‌ర్వాత కుల్దీప్ యాద‌వ్ తిప్ప‌య‌డంతో స్కోర్ త‌గ్గినా.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(37), షెహ్‌బాజ్‌లు ధ‌నాధ‌న్ ఆడి రెండొంద‌లు దాటించారు. చివ‌ర్లో అబ్దుల్ స‌మ‌ద్(13) మెరుపుల‌తో హైద‌రాబాద్ భారీ టార్గెట్ నిర్దేశించింది.

ఐపీఎల్ అత్య‌ధిక స్కోర్‌ను రెండుసార్లు బ‌ద్ధ‌లు కొట్టిన హైద‌రాబాద్ బ్యాట‌ర్లు ఈసారి కూడా చిత‌క్కొట్టారు. ప్ర‌త్య‌ర్థి మారినా త‌మ ఆట ఇదేనంటూ ఢిల్లీ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశారు. దాంతో, టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఢిల్లీ కెప్టెన్ రిష‌భ్ పంత్‌కు తాము ఎంతపెద్ద త‌ప్పు చేసిందో తెలిసొచ్చింది.

ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్(89), అభిషేక్ శ‌ర్మ‌(46) లు వీర‌కొట్టుడుకు బంతి బౌండీరీల వెంట ప‌రుగు తీసింది. ఈ క్ర‌మంలో హెడ్ కేవ‌లం 16 బంతుల్లోనే అర్థ శ‌త‌కం న‌మోదు చేశాడు. అభిషేక్ సైతం సిక్స‌ర్ల‌తో హాఫ్ సెంచ‌రీకి చేరువ‌య్యాడు. అయితే.. కుల్దీప్ యాద‌వ్ ఓవ‌ర్లో అక్ష‌ర్ ప‌టేల్ స్ట‌న్నింగ్ క్యాచ్ ప‌ట్ట‌డంతో ఔట‌య్యాడు. దాంతో, 131 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ లబించ‌డంతో ఢిల్లీ జ‌ట్టు ఊపిరి పీల్చుకుంది.

నితీశ్, ష‌హ్‌బాజ్ దంచ‌గా..

అభిషేక్ త‌ర్వాత వచ్చిన ఎడెన్ మ‌ర్క్‌ర‌మ్(1), క్లాసెన్‌(15)లు స్వ‌ల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. దాంతో, ఒక్క‌సారిగా ఆరెంజ్ ఆర్మీ స్కోర్ త‌గ్గిపోయింది. అయితే.. నితీశ్ రెడ్డి(37), ష‌హ్‌బాజ్ అహ్మ‌ద్‌(11)లు ధనాధ‌న్ ఆడి ఐదో వికెట్‌కు 67 ర‌న్స్ జోడించారు. నితీశ్ ఔటైనా ష‌హ్‌బాజ్ బౌండ‌రీల‌తో చెల‌రేగి ఐపీఎల్‌లో తొలి హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఆఖ‌రి ఓవ‌ర్లో అత‌డు బౌండ‌రీ, సిక్స్ బాద‌డంతో హైద‌ర‌బాద్ 7 వికెట్ల న‌ష్టానికి 267 ర‌న్స్ చేయ‌గ‌లిగింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో కుల్దీప్ (4/55)నాలుగు వికెట్లతో రాణించాడు.

2024-04-20T15:58:41Z dg43tfdfdgfd