SL VS BAN T20 WC: టీ20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. సూపర్-8 రేసు నుంచి శ్రీలంక ఔట్

టీ20 ప్రపంచకప్ 2024లో శ్రీలంక జట్టు వరుసగా రెండో మ్యాచులో ఓడిపోయింది. డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచులో బంగ్లాదేశ్ 2 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో విజయం కోసం ఇరు జట్లూ కూడా చివరి వరకు పోరాడాయి. కానీ శ్రీలంక కంటే మెరుగైన ప్రదర్శన చేసిన బంగ్లాదేశ్.. గెలుపు గీతను దాటింది.

ఈ మ్యాచులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్టు బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు అదిరే ఆరంభం దక్కింది. ఓపెనర్ పథుమ్ నిశాంక 28 బంతుల్లో 47 రన్స్ చేయడంతో 5 ఓవర్లు ముగిసే సరికి 48/1తో నిలిచింది. భారీ స్కోరుపై కన్నేసింది. కానీ స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోయిన శ్రీలంక కష్టాల్లో పడింది. 14 ఓవర్లలో 100 పరుగుల మార్కును చేరుకుంది. మగిలిన ఆరు ఓవర్లలో శ్రీలంక కనీసం 50-60 రన్స్ చేసి.. బంగ్లాదేశ్ ముందు పోరాడే లక్ష్యం నిలిపేలా కనించింది.

14 ఓవర్ల తర్వాత శ్రీలంక జట్టు అనూహ్యంగా కుప్పకూలింది. చివరి 36 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేసి 6 వికెట్లు కోల్పోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులకు పరిమితమైంది. పథున్ నిశాంక (47) టాప్ స్కోరర్. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3, రిషబ్ హొసెన్ 3, టస్కిన్ అహ్మద్ 2, టంజిమ్ హసన్ షకిబ్ 1 వికెట్ తీశారు.

125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. తొలి పది బంతుల్లోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే ముగిసే సరికి మూడో వికెట్ చేజార్చుకుంది. ఈ దశలో టిటన్ దాస్ (36), టౌహిడ్ హ్రిడోయ్ (20 బంతుల్లో 40 రన్స్) జట్టును ఆదుకున్నారు. దీంతో 11.3 ఓవర్ల వద్ద బంగ్లాదేశ్ 91/3తో నిలిచి.. ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ సంచలన బౌలింగ్‌తో నువాన్ తుషారా (4-0-25-4) శ్రీలంకను పోటీలోకి తెచ్చాడు. దీంతో స్వల్ప వ్యవధిలోనే బంగ్లాదేశ్.. 5 వికట్లు కోల్పోయింది. కానీ కావాల్సిన పరుగులు తక్కువే ఉండటంతో మహమ్మదుల్లా (13 బంతుల్లో 16 రన్స్) టెయిలెండర్లతో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు.

కాగా ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌కు ఇదే తొలి మ్యాచ్. అటు తొలి మ్యాచులో దక్షిణాఫ్రికాతో ఓడిపోయిన శ్రీలంక.. ఇప్పుడు బంగ్లాదేశ్‌ చేతిలోనూ పరాజయం పాలై సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గ్రూప్-డిలో ఆడిన ఒక్కో మ్యాచులోనూ గెలిచిన దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లు వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రూప్‌లో ఏ రెండు జట్లైనా 3 విజయాలు సాధిస్తే.. శ్రీలంక గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమిస్తుంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-08T05:49:50Z dg43tfdfdgfd