SHUBMAN GILL | గుజరాత్‌ కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌కు భారీగా జరిమానా..!

Shubman Gill | గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు భారీగా జరిమానా విధించారు. బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా రూ.12లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. మినిమమ్ ఓవర్ రేటుకు సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం గుజరాత్ టైటాన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న గిల్‌కు జరిమానా విధించినట్లు తెలిపింది. అయితే, సీజన్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా గిల్‌ నిలిచాడు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2024లో శుభ్‌మన్‌ గిల్ నేతృత్వంలోని గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు మంగళవారం చైన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైంది.

చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 63 పరుగుల తేడాతో గుజరాత్‌ను ఓడిచింది. తొలిసారి ఐపీఎల్ ఫ్రాంచైజీకి సారథ్యం వహించిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై ఆరు పరుగుల తేడాతో విజయం విధించింది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ గిల్‌ మాట్లాడుతూ సీఎస్‌కే జట్టు ప్రదర్శన అద్భుతంగా తెలిపాడు. తాము ఎప్పుడూ 190-200 స్కోర్‌ను ఛేజ్‌ చేయాలని భావించామని.. వికెట్‌ కూడా బాగుందని.. ఇది మా బౌలర్లకు మంచి గుణపాఠమని పేర్కొన్నాడు. బ్యాటింగ్‌ నిరాశపరిచిందన్నారు. కెప్టెన్సీపై స్పందిస్తూ తాను కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పాడు. గుజరాత్‌ టైటాన్స్‌కు సారథ్యం వహించడం ఎగ్జయిటింగ్‌గా ఉందని తెలిపాడు.

ఐపీఎల్‌ 2024 ఏడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 63 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై జట్టు నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఐపీఎల్‌లో గుజరాత్‌కు ఇది భారీ ఓటమి. ఇంతకు ముందు పది నెలల కిందట వాంఖడేలో ముంబయి ఇండియన్స్‌తో 27 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముంబయి రికార్డును చెన్నై బద్దలు కొట్టింది. సీఎస్‌కే తదుపరి మ్యాచ్ మార్చి 31న విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనున్నది. గుజరాత్ తదుపరి మ్యాచ్ మార్చి 31న అహ్మదాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడుతుంది.

2024-03-27T11:34:22Z dg43tfdfdgfd