RSA vs NED : పొట్టి వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో శ్రీలంక నడ్డి విరిచిన దక్షిణాఫ్రికా(South Africa) పేసర్లు రెండో పోరులోనూ చెలరేగారు. న్యూయార్క్‌లోని నస్సౌ కౌంటీ స్టేడియంలో నెదర్లాండ్స్ బ్యాటర్లను వణికించారు. మార్కో జాన్సెన్(2/20), అన్రిచ్ నోర్జి(2/19)ల విజృంభణతో 48 రన్స్‌కే డచ్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో సైబ్రాండ్ ఎంగ్లెబ్రెట్చ్(40), లొగన్ వాన్ బీక్(23)లు పట్టుదలగా ఆడారు. ఆఖరి ఓవర్లలో బౌండరీలతో హోరెత్తించిన ఈ జంట హాఫ్ సెంచరీతో ఆదుకుంది. అయితే.. బార్ట్‌మన్(4/11) సూపర్ బౌలింగ్‌తో మర్క్‌రమ్ సేకు నెదర్లాండ్స్ 104 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
తొలి ఐసీసీ ట్రోఫీ వేటలో ఉన్న దక్షిణాఫ్రికాకు బౌలర్లు కొండంత బలం అవుతున్నారు. ప్రత్యర్థి మారినా తమ బౌలింగ్‌లో వాడి తగ్గలేదని సఫారీ పేస్ త్రయం నిరూపించింది. టాస్ గెలిచి నెదర్లాండ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన మర్క్‌రమ్ తొలి ఓవర్లోనే సక్సెస్ అయ్యాడు. జాన్సెన్ వేసిన మొదటి ఓవర్ మూడో బంతికే మైఖేల్ లెవిట్ట్(0) డకౌట్ అయ్యాడు. ఆ కాసేపటికే మరో ఓపెనర్ మ్యాక్స్ ఒడౌడ్డ్(2)ను బార్ట్‌మన్ పెవిలియన్ పంపాడు. అంతే.. ఆ తర్వాత నోర్జి చెలరేగడంతో వచ్చిన వాళ్లు వచ్చినట్టు డగౌట్‌కు క్యూ కట్టారు.
అన్రిచ్ నోర్జి వేసిన 12 వ ఓవర్లో సారథి ఎడ్వర్డ్స్ (10) స్వీప్ షాట్‌తో సిక్సర్ బాదాడు. ఆ తర్వాత బంతికే లేని పరుగుకు ప్రయత్నించగా.. ఎడెన్ మర్క్‌రమ్ మెరుపు ఫీల్డింగ్‌కు రనౌట్ అయ్యాడు. ఆ కాసేపటకే తేజ నిడమనూరు(0) వికెట్ పారేసుకున్నాడు. దాంతో 48 పరుగులకే నెదర్లాండ్స్ ఆరు వికెట్లు కోల్పోయింది.
కనీసం 70 రన్స్ అయినా కొడుతుందా? అనుకున్న డచ్ జట్టు ఏకంగా 100 పైనే బాదగలిగిందంటే అదంతా లోయర్ ఆర్డర్ చలవే. సైబ్రాండ్ ఎంగ్లెబ్రెట్చ్(40), లొగన్ వాన్ బీక్(23)లు సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ఉరికించారు. 8వ వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.అయితే.. 20వ ఓవర్లో బార్ట్‌మన్ రెండు వికెట్లు తీసి నెదర్లాండ్స్‌ను 103రన్స్‌కే కట్టడి చేశాడు.
2024-06-08T16:15:44Z