RR VS DC LIVE: పరాగ్‌ విధ్వంసంతో రాజస్థాన్ అ'ద్వితీయ' విజయం.. ఢిల్లీకి తప్పని నిరాశ

TATA IPL 2024 Live: సొంత మైదానం జైపూర్‌ వేదికగా గురువారం జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 12 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై కీలక విజయం సాధించింది. నువ్వానేనా అని ఆఖరి ఓవర్‌ వరకు జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ పైచేయి సాధించింది. వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి రాజస్థాన్‌ పాయింట్లు మెరుగుపరుచుకోగా.. ఢిల్లీ రెండో ఓటమితో పాయింట్ల పట్టికలో కిందకు చేరింది. డేవిడ్‌ వార్నర్‌, రియన్‌ పరాగ్‌లు మాత్రం రెచ్చిపోయి ఆడడం ప్రేక్షకులకు చక్కటి వినోదం అందింది.

మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. పరుగులు రాబట్టడంలో టాపార్డర్‌ ఘోరంగా విఫలమైన వేళ.. 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో రియాన్‌ పరాగ్‌ రెచ్చిపోయి ఆడాడు. 45 బంతుల్లో 84 పరుగులు (7 ఫోర్లు, 6 సిక్స్‌లు) చేసి ఢిల్లీ ముందు మోస్తరు లక్ష్యాన్ని విధించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ 29 స్కోర్‌ చేసి జట్టు పరువు కాపాడాడు. ధ్రువ్‌ జురేల్‌ (20) పర్వాలేదనిపించగా ఓపెనర్లుగా దిగిన యశస్వి జైస్వాల్‌ 5, జోస్‌ బట్లర్‌ 11 పరుగులు మాత్రమే చేసి వెళ్లారు. గత మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న కెప్టెన్‌ సంజూ శామ్‌సన్‌ (15) ఈ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేశాడు. ఆఖర్లో హెట్‌మెయిర్‌ 14 పరుగులు సాధించి జట్టు స్కోర్‌ పెరిగేలా చేశాడు. సొంత మైదానం జైపూర్‌లో  రాజస్థాన్‌కు ఢిల్లీ బౌలర్లు చుక్కలు చూపించారు. సమష్టి కృషిగా బౌలర్లందరూ పరుగులు నియంత్రిస్తూనే వికెట్లు పడగొట్టారు. ఐదుగురు బౌలర్లు ఐదు వికెట్లు తీయడం విశేషం. అక్షర్‌ పటేల్‌ అత్యల్పంగా 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశారు.

మోస్తర్‌ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన ఢిల్లీ ఆఖరి వరకు పోరాడి పరాజయం అంచున నిలిచింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసి విజయానికి కొద్దిదూరంలో ఆగిపోయింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సీనియర్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ తనదైన బ్యాటింగ్‌తో చెలిరేగిపోయాడు. 34 బంతుల్లో 49 పరుగులు (5 ఫోర్లు, 6 సిక్సర్లు)తో శుభారంభం చేశాడు. మరో ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ 23 పరుగులకే మైదానం వీడాడు. రిక్కీ భుల్‌ మాత్రం డకౌట్‌ అందరికీ షాకిచ్చింది. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ గట్టిగానే పోరాటం చేసినా 28 పరుగులకే ఆగిపోయాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో త్రిస్టన్‌ స్టబ్స్‌ వచ్చి విజయవకాశాలను మెరుగుపర్చాడు. ఆఖరి ఓవర్‌ వరకు జట్టును గెలుపు అంచుల దాకా తీసుకెళ్లాడు. 23 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టు విజయానికి కృషి చేసినా అతడి శ్రమకు తగ్గ ప్రతిఫలం లభించలేదు. 

2024-03-28T18:45:27Z dg43tfdfdgfd