ROHIT SHARMA: ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున 200వ మ్యాచ్ ఆడ‌నున్న రోహిత్ శ‌ర్మ‌

హైద‌రాబాద్: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) కొత్త రికార్డును క్రియేట్ చేయ‌నున్నారు. ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు త‌ర‌పున అత‌ను ఇవాళ 200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడ‌నున్నారు. ఇవాళ ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా హైద‌రాబాద్ జ‌ట్టుతో ముంబై జ‌ట్టు త‌ల‌ప‌డ‌నున్న‌ది. 2011 నుంచి ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున రోహిత్ ఆడుతున్నాడు. బ్లూ అండ్ గోల్డ్ క‌ల‌ర్ డ్రెస్సులో ముంబై త‌ర‌పున రోహిత్ ఇప్ప‌టి వ‌ర‌కు 199 మ్యాచ్‌లు ఆడాడు. దాంట్లో 5084 ర‌న్స్ అత‌ను స్కోర్ చేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో 29.30 స‌గ‌టుగా ఉంది. స్ట్ర‌యిక్ రేట్ 129.56. ముంబై జ‌ట్టు త‌ర‌పున రోహిత్ ఇప్ప‌టి వ‌ర‌కు ఓ సెంచ‌రీ చేశాడు. 195 ఇన్నింగ్స్‌లో అత‌ను 34 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. 109 ర‌న్స్ అత‌ని బెస్ట్ స్కోరు.

2013లో రికీ పాంటింగ్ నుంచి కెప్టెన్సీ ప‌గ్గాల‌ను రోహిత్ అందుకున్నాడు. అత‌ను కెప్టెన్‌గా ఉన్న స‌మ‌యంలో.. ముంబై జ‌ట్టు ప‌దేళ్ల‌లో అయిదు సార్లు ట్రోఫీని చేజిక్కించుకున్న‌ది. 2013, 2015, 2017, 2019, 2020 సంవ‌త్స‌రాల్లో ఆ జ‌ట్టు ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న‌ది. ఈ ఏడాది మాత్రం రోహిత్ శ‌ర్మ‌ను సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి హార్దిక్ పాండ్యాకు అప్పగించారు.

ముంబైకి ముందు రోహిత్ .. హైద‌రాబాద్ ఫ్రాంచైజీ డెక్క‌న్ ఛార్జ‌ర్స్‌కు ఆడాడు. అత‌ను 2008 నుంచి 2010 వ‌ర‌కు ఆ జ‌ట్టుతో ఉన్నాడు. ఆ జ‌ట్టు కోసం అత‌ను 45 మ్యాచ్‌లు ఆడాడు. దాంట్లో 1170 ప‌రుగులు స్కోర్ చేశాడు. బ్యాటింగ్ స‌గ‌టు 30.79 కాగా, అత‌ని స్ట్ర‌యిక్ రేట్ 131గా ఉంది. 44 ఇన్నింగ్స్‌లో అత‌ను 8 హాఫ్ సెంచ‌రీలు చేశాడు. బెస్ట్ స్కోరు 76. 2009లో అత‌ను హైద‌రాబాద్ జ‌ట్టులో ఉండ‌గా, ఆ ఏడాది డెక్క‌న్ ఛార్జ‌ర్స్ జ‌ట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న‌ది.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన నాలుగ‌వ బ్యాట‌ర్‌గా రోహిత్ ఉన్నాడు. అత‌ను ఇప్ప‌టి వ‌ర‌కు 244 మ్యాచుల్లో 6254 ర‌న్స్ చేశాడు. బ్యాటింగ్ యావ‌రేజ్ 29.63 కాగా, స్ట్ర‌యిక్ రేట్ 130.15గా ఉంది.

2024-03-27T07:03:55Z dg43tfdfdgfd