RCB | అభిమానులను కట్టిపడేసిన ఆర్సీబీ VS పంజాబ్‌ మ్యాచ్‌..

  • ఆఖర్లో కార్తీక్‌ మెరుపులు పంజాబ్‌పై ఉత్కంఠ విజయం
  • విరాట్‌ కోహ్లీ విజృంభణ

ఐపీఎల్‌లో మరో ఆసక్తికరమైన పోరు అభిమానులను కట్టిపడేసింది. ‘ఈ సాలా కప్‌ నమదే’ అంటూ బరిలోకి దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) సొంతగడ్డపై అదరగొట్టింది. చెన్నై చేతిలో తొలి ఓటమి ఎదుర్కొన్న ఆర్‌సీబీ మలి మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. పంజాబ్‌ నిర్దేశించిన లక్ష్యఛేదనలో విరాట్‌ కోహ్లీ ఖతర్నాక్‌ ఇన్నింగ్స్‌తో కదంతొక్కడంతో ఆర్‌సీబీ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆఖర్లో గెలుపు దోబూచులాడినా..దినేశ్‌ కార్తీక్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్‌సీబీని ఒడ్డుకు చేర్చాడు. తొలుత ధవన్‌, జితేశ్‌ బ్యాటింగ్‌తో పంజాబ్‌ పోరాడే స్కోరు అందుకుంది.

RCB | బెంగళూరు: ఐపీఎల్‌లో ఆర్‌సీబీ పాయింట్ల ఖాతా తెరిచింది. సోమవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు 19.2 ఓవర్లలో 178/6 స్కోరు చేసింది. కోహ్లీ(49 బంతుల్లో 77, 11ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీకి తోడు ఆఖర్లో కార్తీక్‌(10 బంతుల్లో 28 నాటౌట్‌, 3ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో కదంతొక్కారు. రబాడ, బ్రార్‌ రెండేసి వికెట్లు తీశారు. తొలుత కెప్టెన్‌ ధవన్‌(45), జితేశ్‌శర్మ(27) 20 ఓవర్లలో 176/6 స్కోరు చేసింది. సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌ రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

కోహ్లీ, కార్తీక్‌ కేక!

ఛేదనను ఆర్‌సీబీ ధాటిగా ఆరంభించింది. కరన్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో బంతికే కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను బెయిర్‌స్టో జారవిడిచాడు. ఇందుకు పంజాబ్‌ భారీ మూల్యం చెల్లించుకుంది. ఆరంభంలోనే ఔట్‌ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ ఛేజ్‌ మాస్టర్‌ చిన్నస్వామిని బౌండరీలతో ఊపేశాడు. తొలి ఓవర్‌లోనే నాలుగు ఫోర్లు బాదిన విరాట్‌.. అర్ష్‌దీప్‌ వేసిన 4వ ఓవర్లో మూడు బౌండరీలు రాబట్టాడు. డుప్లెసిస్‌ (3), కామెరూన్‌ గ్రీన్‌ (3)లు నిరాశపరిచినా రన్‌ మెషీన్‌ మాత్రం పరుగుల వేటను ఆపలేదు. రజత్‌ పాటిదార్‌ (18)తో కలిసి మూడో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. కోహ్లీ 35 పరుగుల వద్ద ఉండగా మరోసారి లైఫ్‌ లభించింది. కరన్‌ వేసిన 6వ ఓవర్లో రాహుల్‌ చాహర్‌ మిడ్‌ వికెట్‌ వద్ద క్యాచ్‌ మిస్‌ చేశాడు. రబాడ పదో ఓవర్లో మూడో బంతికి సింగిల్‌ తీయడంతో 31 బంతుల్లోనే కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తయింది. లక్ష్యం దిశగా సాగుతున్న ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌ను హర్‌ప్రిత్‌ బ్రర్‌ ఓ కుదుపు కుదిపాడు. వరుస ఓవర్లలో అతడు పాటిదార్‌, మ్యాక్స్‌వెల్‌ (3)లను బౌల్డ్‌ చేశాడు. ఆఖరి ఐదు ఓవర్లలో ఆర్‌సీబీ విజయానికి 59 పరుగులు అవసరమయ్యాయి. హర్షల్‌ పటేల్‌ వేసిన 16వ ఓవర్లో కోహ్లీ రెండు ఫోర్లు కొట్టినా ఆఖరి బంతికి భారీ షాట్‌ ఆడబోయి బ్రార్‌ అద్భుతమైన లో క్యాచ్‌ అందుకోవడంతో ఔట్‌ అయ్యాడు. ఆఖర్లో పంజాబ్‌ బౌలర్లను కార్తీక్‌ ఉతికి ఆరేస్తూ కండ్లు చెదిరే బౌండరీలతో ఆర్‌సీబీకి అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు.

సంక్షిప్త స్కోర్లు

పంజాబ్‌ : 20 ఓవర్లలో 176/ 6

(ధవన్‌ 45, జితేశ్‌ శర్మ 27, మ్యాక్స్‌వెల్‌ 2/29, సిరాజ్‌ 2/26) బెంగళూరు :19.2 ఓవర్లలో 178/6(కోహ్లీ 77, కార్తీక్‌ 28 నాటౌ ట్‌ , బ్రార్‌ 2/13, రబాడ 2/23)

25

2024-03-26T00:01:12Z dg43tfdfdgfd