MUMBAI INDIANS | ముంబై ఇండియన్స్‌లో సమ్‌థింగ్‌ ఈజ్‌ ఫిషి.. కెప్టెన్సీ మార్పుతో రెండు గ్రూపులుగా జట్టు?

ఐపీఎల్‌లో అత్యంత విజయ వంతమైన జట్లలో ఒకటి. పేరు ప్రఖ్యాతలు, ఫ్యాన్‌ బేస్‌, జట్టు విలువ పరంగా ఢోకా లేదు. మిగిలిన ఫ్రాంచైజీల కంటే ముందే ఐదు ట్రోఫీలు నెగ్గిన టీమ్‌. కానీ ఇదంతా నిన్నటి దాకా.. కెప్టెన్సీ మార్పు ఆ జట్టును మునిగిపోయే నావలా మార్చేసింది! అభిమానుల మద్దతు లేదు. ఆటగాళ్ల మధ్య సఖ్యత లేదు. జట్టులో సమన్వయం లేదు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో రెండు వర్గాలుగా విడిపోయిన ఆటగాళ్లు.. వెరసి..ముంబై ఇండియన్స్‌లో సమ్‌థింగ్‌ ఈజ్‌ ఫిషి!

Mumbai Indians | ముంబై: ముంబై ఇండియన్స్‌లో కెప్టెన్సీ మార్పు జట్టును రెండు గ్రూపులుగా విభజించిందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తమ జట్టుకు ఐదు ట్రోఫీలు అందించిన మేటి సారథి రోహిత్‌శర్మను ఈ సీజన్‌కు ముందు తప్పించి గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి అరువు తెచ్చుకున్న హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించడంపై అభిమానులు రెండు నెలల నుంచే అసహనంగా ఉండగా తాజాగా అది ముంబై డ్రెస్సింగ్‌ రూమ్‌కూ పాకిందని సమాచారం. హార్దిక్‌ను ముంబై కెప్టెన్‌గా ఊహించుకోవడానికి ఇష్టపడని ఆ జట్టు అభిమానులు.. ఎంఐ ఆడుతున్న మ్యాచ్‌లలో బహిరంగంగానే అతడిని హేళన చేస్తూ ఆగ్రహజ్వాలలు వెళ్లగక్కుతున్నారు. దీనికి కొనసాగింపుగా ముంబై డ్రెస్సింగ్‌ రూమ్‌లో ‘టీమ్‌ రోహిత్‌’ వర్సెస్‌ ‘టీమ్‌ హార్దిక్‌’గా ఆటగాళ్లు విడిపోయినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

హార్దిక్‌ నిర్ణయాలపై గుర్రు..

మైదానంలో హార్దిక్‌ తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. స్టార్‌ పేసర్‌ బుమ్రాను పక్కనబెట్టి 3 లేదా 4వ ఓవర్లో (గత రెండు మ్యాచ్‌లలో ఇలాగే) బౌలింగ్‌కు దించడం.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అస్సలు అనుభవమే లేని సౌతాఫ్రికా పేసర్‌ క్వెనా మపాకాకు ఓపెనింగ్‌ ఓవర్‌ ఇవ్వడం, హైదరాబాద్‌ బ్యాటర్లు ఎడాపెడా పరుగులు రాబడుతున్నా కొయెట్జితో వరుస ఓవర్లు వేయించడం వంటి నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు ఎంఐ సారథి మైదానంలో వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశమవుతోంది. రోహిత్‌ను బౌండరీ లైన్‌ వద్దకు ఫీల్డింగ్‌కు పంపడాన్ని ముంబై అభిమానులైతే అస్సలు జీర్ణించుకోవడం లేదు.

రెండు వర్గాలు..

హార్దిక్‌ సారథ్యంపై ఇది వరకే బుమ్రా, సూర్యకుమార్‌యాదవ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ ద్వారా తమ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. డ్రెస్సింగ్‌ రూమ్‌లోనూ బుమ్రా, తిలక్‌ వర్మ, ఆకాశ్‌ మధ్వాల్‌ వంటి పాత ముంబై ప్లేయర్లు ఒక వర్గంగా ఉండగా రోహిత్‌కు విధేయుడిగా ఉన్న ఇషాన్‌ కిషన్‌ ఇప్పుడు పాండ్యా గ్రూప్‌లో చేరినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంబానీల అండ సంపూర్ణంగా ఉన్న హార్దిక్‌.. తన సొంత జట్టును నిర్మించుకునేందుకు గత సీజన్‌లో ఆడిన కీలక ప్లేయర్లను వదిలేసినట్టూ వార్తలు వస్తున్నాయి.

రోహిత్‌ నారాజ్‌..

కెప్టెన్సీ మార్పుపై ముంబై మాజీ సారథి రోహిత్‌ శర్మ ఇంతవరకూ బహిరంగంగా స్పందించకపోయినా అతడు అసంతృప్తిగానే ఉన్నట్టు కొంతకాలంగా వినిపిస్తోంది. హిట్‌మ్యాన్‌ ముంబై క్యాంప్‌లో చేరగానే హార్దిక్‌ వెళ్లి.. హగ్‌ చేసుకున్న ఫొటోలను ముంబై షేర్‌ చేసి ‘అంతా బాగానే ఉంది’ అన్నట్టు కవర్‌ చేయాలని చూసినా ఇదంతా ‘ఉత్త కథే’ అని ఇద్దరి మధ్య టీవీలలో సంభాషణలను చూస్తున్న వారికి అర్థమవక మానదు.

ఇది ఇలాగే కొనసాగితే ముంబైకి మరో సీజన్‌లోనూ నిరాశ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి నానాటికీ ముదురుతున్న రోహిత్‌-హార్దిక్‌ వివాదాన్ని అంబానీలు ఎంత త్వరగా పరిష్కరిస్తానేది ఆసక్తికరంగా మారింది.

2024-03-28T20:52:35Z dg43tfdfdgfd