MS DHONI | మహేంద్రసింగ్‌ ధోనీ.. 20వ ఓవర్‌ మొనగాడు

MS Dhoni | భారత క్రికెట్‌లో ‘ఫినిషర్‌’ అనే చర్చ వస్తే మరో ఆలోచన లేకుండా ఠక్కున గుర్తొచ్చే పేరు మహేంద్రసింగ్‌ ధోనీ. 2004 నుంచి 2019 దాకా అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ ఒంటిచేత్తో భారత్‌కు అసాధారణ విజయాలను అందించిన సందర్భాలు కోకొల్లలు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుని నాలుగేండ్లు గడుస్తున్నా, 42 ఏండ్ల వయసులోనూ ఐపీఎల్‌ ఆడుతున్నా అతడిలోని ఫినిషర్‌ మాత్రం బంతిని బాదడంలో ఇంకా 20 ఏండ్ల కుర్రాడి కంటే కసిమీదే కనిపిస్తున్నాడు. 2024 సీజన్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ.. బ్యాటింగ్‌కు వస్తూ ఆడేది తక్కువ బంతులే అయినా జట్టుకు విలువైన పరుగులు అందిస్తున్నాడు. శుక్రవారం లక్నోతో మ్యాచ్‌లో ధోనీ మెరుపులే ఇందుకు తాజా ఉదాహరణ. 18వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన మహీ.. 9 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 28 పరుగులు రాబట్టి చెన్నైకి భారీ స్కోరు అందించాడు.

20వ ఓవర్లో ఆడుతూ ధోనీకి ఐపీఎల్‌లో మరే ఆటగాడికి లేని రికార్డు ఉంది. ఈ లీగ్‌ ఆరంభ సీజన్‌ (2008) నుంచి లక్నో మ్యాచ్‌ వరకూ 20వ ఓవర్‌లో ధోనీ ఎదుర్కొన్న బంతులు 313 కాగా చేసిన పరుగులు 772. ఈ క్రమంలో అతడి ైస్టెక్‌ రేట్‌ 245గా ఉంది. ఈ విధ్వంసంలో 53 ఫోర్లు, 65 సిక్సర్లూ ఉన్నాయి. అంటే 772లో 602 పరుగులు బౌండరీలు, సిక్సర్ల రూపంలోనే వచ్చాయంటే అతడి బాదుడు ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్‌లో యాక్టివ్‌ ప్లేయర్స్‌తో పాటు రేపో మాపో రిటైర్‌ కాబోయే ఆటగాళ్లలో ఎవరూ ధోనీ రికార్డుకు దరిదాపుల్లో కూడా లేరు. ప్రస్తుత ముంబై బ్యాటింగ్‌ కోచ్‌ కీరన్‌ పొలార్డ్‌ (405 పరుగులు), చెన్నై ఆల్‌రౌండర్‌ జడేజా (368) తదుపరి స్థానాల్లో ఉన్నారు. 20వ ఓవర్‌లో ధోనీ చేసిన పరుగులలో 390 సిక్సర్ల (65) రూపంలోనే వచ్చాయి. లాస్ట్‌ ఓవర్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డూ ధోనీదే.

ఈ సీజన్‌లోనూ ధోనీ ఆఖరి ఓవర్లలో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 బంతుల్లోనే 37 (ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లోనే 20 రన్స్‌ చేశాడు. ధోనీ బాదుడు చూశాక.. ‘బ్యాటింగ్‌ ఆర్డర్‌లో అతడు ఇంకాస్త ముందుకొస్తే బాగుండు’ అన్న వాదనలూ వినిపించాయి. ముంబైతో మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లతో ధోనీ.. వాంఖడేలో 2011 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చాడు. తాజాగా లక్నోలోనూ అదే సీన్‌ రిపీట్‌ చేశాడు. మహేంద్రుడి ఆఖరి సీజన్‌ (?)గా భావిస్తున్న 2024లో ఆడేది తక్కువ బంతులే అయినా ధోనీ మాత్రం అభిమానులను నిరాశపరచడం లేదు. ఈ సీజన్‌లో ధోనీ ఐదు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌కు వచ్చి నాటౌట్‌గా నిలవడం మరో విశేషం. చెన్నై యాజమాన్యం కూడా మరో రెండు ఓవర్లు, పది బంతుల్లో ఇన్నింగ్స్‌ ముగుస్తుందంటే ధోనీని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపుతూ పరుగులు దండుకోవడంతో పాటు అతడి ఆటను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్‌ కోరికనూ తీరుస్తున్నది.

-నమస్తే తెలంగాణ క్రీడా విభాగం

2024-04-19T19:47:20Z dg43tfdfdgfd