KL RAHUL | బ‌ర్త్‌ డే బాయ్ ‘రాహుల్’.. ఏటా 101 కోట్లు కొల్ల‌గొడుతున్నాడిలా

KL Rahul : టీమిండియా స్టార్ ఆట‌గాడు కేఎల్ రాహుల్(KL Rahul) బ‌ర్త్ డే ఈ రోజు. త‌నదైన స్టయిలిష్ షాట్ల‌తో అల‌రించే రాహుల్ గురువారం 32వ వ‌సంతంలోకి అడుగ‌పెట్టాడు. ఈ సంద‌ర్బంగా రాహుల్‌ను అభినందిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంతా. క్రీజులో కుదురుకున్నాక సొగ‌సైన షాట్ల‌తో విరుచుకుప‌డే రాహుల్ ఐపీఎల్ 17వ సీజ‌న్‌(IPL 2024)లో కెప్టెన్‌గా అద‌ర‌గొడుతున్నాడు.  మైదానంలో అత‌డు ఎంత హిట్టో కోట్లు సంపాదించ‌డంలోనూ అంతే హిట్ అయ్యాడు.

అవును.. అత‌డి ఏడాది సంపాద‌న తెలిస్తే ఆవాక్క‌వుతారు. మిడిలార్డ‌ర్‌లో టీమిండియా వెన్నెముక‌గా పేరొందిన రాహుల్ ఏటా రూ.101 కోట్లు ఆర్జిస్తున్నాడు. బీసీసీఐ కాంట్రాక్టు, ఐపీఎల్ ఫీజు, ప్ర‌క‌ట‌న‌ల ద్వారా వ‌చ్చే ఆదాయం క‌లిపి అత‌డికి కోట్లు కొల్ల‌గొడుతున్నాడు.

సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ 

ఐదో స్థానంలో ఇర‌గ‌దీసే రాహుల్‌కు మ్యాచ్ ఫీజు రూపంలో భారీగానే ఆర్జిస్తుస్తాడు. బీసీసీఐ (BCCI) ఏటా అత‌డికి రూ. 20 నుంచి 22 కోట్లు ముట్ట‌జెప్పనుంది. గ‌త ఏడాది నిల‌క‌డగా రాణించిన రాహుల్ ఈ మ‌ధ్యే సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌లో ‘ఏ’ కేట‌గిరీకి ప్ర‌మోట్ అయ్యాడు. త‌ద్వారా అత‌డు మ్యాచ్ ఫీజతో పాటు అద‌నంగా రూ. 5 కోట్లు అందుకోనున్నాడు.

కోహ్లీతో స‌మానంగా..

ఐపీఎల్ ద్వారా రాహుల్ పెద్ద మొత్తమే వెన‌కేసుకుంటున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ మెగా టోర్నీలో రాహుల్ ఏకంగా రూ.82 కోట్లు ఆర్జించాడు. 2013లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bengaluru) జెర్సీతో బ‌రిలోకి దిగిన రాహుల్.. 17 సీజ‌న్లలో ప‌లు జ‌ట్ల‌కు ఆడాడు. 2014లో రాహుల్‌ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sun Risers Hyderabad) రూ. కోటికి కొన్న‌ది. అనంత‌రం 2018 మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ రాహుల్‌కు ఏకంగా రూ.11 కోట్లు ఆఫ‌ర్ చేసింది.

అయితే.. కెప్టెన్‌గా తీవ్రంగా నిరాశ‌ప‌రిచ‌న రాహుల్‌ను పంజాబ్ వ‌దిలేయ‌డంతో.. లక్నోసూప‌ర్ జెయింట్స్(Lucknow Super Giants) రూ.17 కోట్ల‌కు సొంతం చేసుకుంది. దాంతో, ఐపీఎల్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీతో స‌మాన‌మైన వేతనం అందుకుంటున్న భార‌త క్రికెట‌ర్‌గా రాహుల్ రికార్డు సృష్టించాడు.

అంబాసిడ‌ర్‌గా కోట్లు

టీమిండియా స్టార్ క్రికెట‌ర్‌గా ఎదిగిన రాహుల్ ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ఏటా భారీగానే సంపాదిస్తున్నాడు. అత‌డు యూపీఐ యాప్ భార‌త్ పే, స్పోర్ట్స్ దుస్తుల బ్రాండ్ పుమా(Puma), ఫోన్ల కంపెనీ రియ‌ల్‌మి వంటి ప‌లు బ్రాండ్ల‌కు అంబాసిడ‌ర్‌గా కోట్లు కొల్ల‌గొడుతున్నాడు. ప్ర‌తి యాడ్ షూటింగ్‌కు రాహుల్ క‌నీసం రూ.10 లక్ష‌ల పైనే తీసుకుంటాడ‌ని స‌మాచారం.

గోవాలో విల్లా.. ఖ‌రీదైన కార్లు

ఇక ఆస్తిపాస్తుల విష‌యానికొస్తే.. రాహుల్‌కు బెంగ‌ళూరులో రూ.65 ల‌క్ష‌ల విలువైన పెద్ద అపార్ట్‌మెంట్ ఉంది. ఇక గోవాలో 7 వేల చ‌ద‌ర‌పు అడుగు విల్లాకు మ‌నోడు య‌జమాని. రాహుల్‌కు ల‌గ్జ‌రీ కార్లంటే మోజు. అత‌డి గ్యారెజ్‌లో లాండ్ రోవ‌ర్ డిఫెండ‌ర్ 110, రేంజ్ రోవ‌ర్ వెలార్, లంబోర్గినీ హురాకేన్ స్పైడ‌ర్, ఆఈ ఆర్ 8, బీఎండ‌బ్ల్యూ ఎక్స్ 5 వంటి ప‌లు బ్రాండ్ల కార్లు ఉన్నాయి.

ఆట‌తో, యాడ్స్‌తో కోట్లు సంపాదించే రాహుల్ త‌న వంతుగా స‌మాజానికి సేవ చేస్తున్నాడు. యువ క్రికెట‌ర్ల వైద్య ఖ‌ర్చుల కోసం ఏటా రూ. 31 ల‌క్ష‌లు రాహుల్ విరాళంగా ఇస్తున్నాడు. రాహుల్ ప‌లువురు హీరోయిన్ల‌తో అఫైర్ న‌డిపాడ‌నే వార్త‌లు అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి. అయితే.. ఆ వార్త‌ల‌కు తెర‌దించుతూ రాహుల్ నిరుడు పెండ్లి చేసుకున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కూత‌రు అథియా శెట్టిని మ‌నువాడాడు.

రాహుల్,  అథియా శెట్టి

ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లోనూ కేఎల్ రాహుల్ సార‌థ్యంలోని ల‌క్నో సూపర్ జెయింట్స్ అద‌ర‌గొడుతోంది. ప్ర‌స్తుతం పాయింట్ ప‌ట్టిక‌లో ఐదో స్థానంలో నిలిచిన ల‌క్నో ప్లే ఆఫ్స్ రేసులోనే ఉంది. ఒక‌ద‌శ‌లో మ‌యాంక్ యాద‌వ్(Mayank Yadav) విజృంభ‌ణ‌తో హ్యాట్రిక్ విజ‌యాలు సాధించిన ల‌క్నో.. ఆ త‌ర్వాత వ‌రుస ఓట‌మల‌తో డీలా ప‌డింది. తదుప‌రి మ్యాచ్‌లో రాహుల్ సేన చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌నుది. ఏప్రిల్ 19వ తేదీన ల‌క్నో వేదిక‌గా ఇరు జ‌ట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

2024-04-18T12:31:48Z dg43tfdfdgfd