IPL | బంతిని మార్చండి మహాప్రభో.. అప్పుడే రసవత్తరంగా బాల్‌-బ్యాట్‌ సమరం!

IPL | నమస్తే తెలంగాణ క్రీడావిభాగం: బంతికి బ్యాట్‌కు సమానమైన పోరు జరిగితేనే క్రికెట్‌కు అందం! ఆటను చూసేవారికి ఆనందం!! కానీ ఆధునిక క్రికెట్‌లో మాత్రం నిబంధనలు బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నాయన్నది బహిరంగ వాస్తవం. ఇక ఐపీఎల్‌ వంటి మెగా లీగ్‌లో పవర్‌ ప్లేలు, ఇంపాక్ట్‌ ప్లేయర్‌ వంటి నిబంధనలు బౌలర్లకు కాలరాత్రులనే మిగులుస్తున్నాయి. బ్యాటర్ల పరుగుల జాతరకు చరిత్రలో పాత రికార్డులన్నీ కనుమరుగవుతూ బౌలర్లు నిద్రలేని రాత్రులు గడుపుతూ అసలు బౌలింగ్‌ ఎలా చేయాల్రా దేవుడా..? అంటూ తలలు పట్టుకుంటున్నారు.

ఐపీఎల్‌లో 13 ఏండ్ల పాటు పదిలంగా ఉన్న ఆర్సీబీ అత్యధిక స్కోరు (263) రికార్డు తాజా సీజన్‌లో ఏకంగా మూడు సార్లు బ్రేక్‌ అయిందంటే బ్యాటర్ల బాదుడు ఏ రేంజ్‌లో ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఒకప్పుడు 160, 170 పరుగులు కొడితే గెలవొచ్చు అన్న ధీమాలో జట్లు ఉండగా ఇప్పుడు ప్రత్యర్థి జట్టు ముందు 280 పరుగులు చేసినా గెలుస్తామన్న నమ్మకం లేదంటే బౌలర్లపై బ్యాటర్లు ఏ స్థాయిలో చెలరేగిపోతున్నారనే దానితో పాటు బాల్‌-బ్యాట్‌ మధ్య సమమైన పోరు జరుగడం లేదనేది ప్రస్పుటమవుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో బౌలర్లకు ఇచ్చే ‘బంతిని మార్చాలి’ అనే ప్రతిపాదన ముందుకు వస్తోంది.

మంగళవారం కోల్‌కతా – రాజస్థాన్‌ మధ్య ముగిసిన మ్యాచ్‌లో శాంసన్‌ సేన 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత కేకేఆర్‌ మెంటార్‌ గౌతం గంభీర్‌ మాట్లాడుతూ.. “ఒక బంతి 50 ఓవర్ల పాటు మనుగడ సాగించకుంటే దాని తయారీదారుడిని మార్చడంలో తప్పేముంది. ‘కూకబురా’ను అంత బలవంతంగా వాడటంలో ఆంతర్యమేంటి..?” అని వ్యాఖ్యానించి కొత్త చర్చకు దారి తీశాడు. అంతేగాక ఇంగ్లండ్‌ టెస్టులలో వాడే ‘డ్యూక్‌’ బాల్‌తో ఐపీఎల్‌ ఆడాలని ప్రతిపాదించాడు. ఇదే విషయమై ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత హర్షా భోగ్లే సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఐపీఎల్‌ కూకబురాతో కాకుండా డ్యూక్‌ బాల్‌తో ఆడాలని, తద్వారా బ్యాట్‌-బాల్‌ మధ్య సమానమైన పోటీ ఉంటుందని హర్షా నొక్కి చెప్పాడు.

సాధారణంగా ఐపీఎల్‌లో బౌలర్లు ఉపయోగించేది కూకబురానే. ఇది ఆస్ట్రేలియాలో తయారవుతుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే భారత పిచ్‌లపై బౌలర్లకు దీన్నుంచి స్వింగ్‌, సీమ్‌ను రాబట్టడం అంత తేలిక కాదు. కుకబురాతో పోలిస్తే డ్యూక్‌ బాల్‌ స్వింగ్‌కు బాగా అనుకూలిస్తుంది. దీంతో బాల్‌-బ్యాట్‌ సమరం రసవత్తరంగా సాగుతుందనేది విశ్లేషకుల వాదన. మరి ఈ ప్రతిపాదనను బీసీసీఐ ఏ మేరకు స్వీకరిస్తుంది..? బంతిని మారుస్తుందా..? బౌలర్లకు మంచిరోజులు వస్తాయా..? అన్నది కాలమే నిర్ణయించాలి.

ఈ సీజన్‌లో బుధవారం నాటికి 32 మ్యాచ్‌లు జరిగితే అందులో పలు జట్లు 200 ప్లస్‌ స్కోరును ఏకంగా 14 సార్లు నమోదుచేయగా 13 సార్లు 180-199 మధ్య నమోదైందంటే బౌలర్లపై బ్యాటర్ల ఆధిపత్యం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

2024-04-17T21:16:13Z dg43tfdfdgfd