IPL | పంజాబ్‌ పోరాడినా ముంబైదే పైచేయి

  • సూర్య హాఫ్‌ సెంచరీ.. రాణించిన బుమ్రా, కొయెట్జీ

ఐపీఎల్‌లో మరోపోరు అభిమానులను ఊపేసింది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన అద్భుత పోరులో పంజాబ్‌ పోరాడినా..ముంబైదే పైచేయి అయ్యింది. ముంబై నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యఛేదనలో బుమ్రా ధాటికి 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్‌..అశుతోష్‌శర్మ, శశాంక్‌సింగ్‌ పోరాటపటిమతో పుంజుకుంది. అసలు గెలుపు ఆశలు లేని స్థితి నుంచి ముంబైకి ముచ్చెమటలు పట్టిస్తూ ముల్లాన్‌పూర్‌లో అశుతోష్‌ సిక్సర్లతో చెడుగుడు ఆడుకున్నాడు. బుమ్రా విజృంభణకు కొయెట్జీ జత కలువడంతో ముంబై ఆఖరి ఓవర్లో విజయాన్నందుకుంది. సూర్యకుమార్‌కు తోడు రోహిత్‌శర్మ, తిలక్‌వర్మ ముంబై పోరాడే స్కోరు అందుకుంది.

IPL | ముల్లాన్‌పూర్‌ : ముల్లాన్‌పూర్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 9 పరుగుల తేడాతో నెగ్గింది. ఆల్‌రౌండ్‌ షో తో ఆకట్టుకున్న ఆ జట్టు బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (53 బంతుల్లో 78, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (36) మెరుపులు మెరిపించడంతో 7 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. భారీ ఛేదనలో పంజాబ్‌ 111 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినా అశుతోష్‌ శర్మ (28 బంతుల్లో 61, 2 ఫోర్లు, 7 సిక్సర్లు) అద్వితీయ పోరాటానికి శశాంక్‌ సింగ్‌ (41) మెరుపులతో ఆ జట్టు విజయానికి చేరువగా వచ్చినా 19.1 ఓవర్లలో 183 పరుగుల వద్దే ఆగిపోయింది. ముంబై బౌలర్లు బుమ్రా (3/21),కొయెట్జి (3/32) పంజాబ్‌ పతనాన్ని శాసించారు. బుమ్రాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

సూర్య-హిట్‌మ్యాన్‌ షో..

ముంబైకి రబాడా మూడో ఓవర్లోనే కిషన్‌ (8)ను ఔట్‌ చేసి తొలి షాకిచ్చినా సుదీర్ఘ ఐపీఎల్‌ కెరీర్‌లో 250వ మ్యాచ్‌ ఆడుతున్న రోహిత్‌తో కలిసి సూర్య మెరుపులు మెరిపించాడు. క్రీజులోకి రావడంతోనే బౌండరీల వేట మొదలుపెట్టిన సూర్య.. స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. హిట్‌మ్యాన్‌ కూడా వీలుచిక్కినప్పుడల్లా బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. అర్ష్‌దీప్‌ వేసిన నాలుగో ఓవర్లో డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్సర్‌ బాదాడు. కరన్‌ వేసిన 12వ ఓవర్లో బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ వద్ద హర్‌ప్రీత్‌తక్కువ ఎత్తులో వచ్చిన క్యాచ్‌ను అందుకోవడంతో రోహిత్‌ ఔటయ్యాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 81 పరుగులు జోడించింది. రోహిత్‌ స్థానంలో వచ్చిన తిలక్‌ వర్మ (34 నాటౌట్‌)తో కలిసి సూర్య బాదుడు కొనసాగించాడు. రబాడా ఓవర్లో ఓ ఫోర్‌, రెండు సిక్సర్లతో 18 రన్స్‌ పిండుకున్నారు. 28 బంతుల్లోనే 49 పరుగులు జతచేసిన ఈ జోడీని 17వ ఓవర్లో కరన్‌ విడదీశా డు. హార్దిక్‌ పాండ్యా (10) మరోసారి విఫలమయ్యాడు.

వణికించిన బుమ్రా

భారీ ఛేదనలో పంజాబ్‌.. తొలి ఓవర్‌ వేసిన గెరాల్డ్‌ కొయెట్జీ.. ప్రభ్‌సిమ్రన్‌ను ఔట్‌ చేసి వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. రెండో ఓవర్‌ వేసిన బుమ్రా.. రెండు కీలక వికెట్లు తీసి ఆ జట్టు కోలుకోనీయకుండా చేశాడు. నాలుగో బంతికి రూసో (1)ను యార్కర్‌తో క్లీన్‌బౌల్డ్‌ చేసిన అతడు.. ఆఖరి బంతికి కరన్‌ను పెవిలియన్‌కు పంపాడు. ప్రమాదకర లివింగ్‌స్టోన్‌ (1) కొయెట్జీ మూడో ఓవర్లో అతడికే క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో ఆ జట్టు 2.1 ఓవర్లలో 14 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. హర్‌ప్రీత్‌ (13)ను స్పిన్నర్‌ శ్రేయస్‌ ఏడో ఓవర్లో పెవిలియన్‌కు పంపాడు.

ఆఖర్లో ఉత్కంఠ..

ఆకాశ్‌ మధ్వాల్‌ 16వ ఓవర్లో అశుతోష్‌ మూడు సిక్సర్లతో రెచ్చిపోగా బ్రర్‌ సైతం ఓ సిక్సర్‌ బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 24 పరుగులొచ్చాయి. కానీ బుమ్రా వేసిన 17వ ఓవర్లో మూడు పరుగులే రాగా కొయెట్జీ 18వ ఓవర్లో తొలి బంతికే డీప్‌ మిడ్‌ వికెట్‌ వద్ద నబీకి అశుతోష్‌ క్యాచ్‌ ఇచ్చాడు. 12 బంతుల్లో ఆ జట్టు విజయానికి 23 పరుగులు అవసరం కాగా హార్దిక్‌ వేసిన 19వ ఓవర్లో బ్రర్‌ వికెట్‌ కోల్పోయినా పంజాబ్‌ 11 పరుగులు రాబట్టడంతో ఆఖరి ఓవర్లో ఉత్కంఠకు దారితీసింది. రెండో పరుగు తీయబోయి రబాడా రనౌట్‌ అవడంతో ఆ జట్టు ఓటమివైపు నిలిచింది.

అశుతోష్‌ అదుర్స్‌..

గత మూడు మ్యాచ్‌లలో పంజాబ్‌ బ్యాటింగ్‌కు వెన్నెముకగా మారిన అశుతోష్‌ శర్మ, శశాంక్‌ సింగ్‌ మరోసారి పంజాబ్‌ను ఆదుకున్నారు. శశాంక్‌.. శ్రేయస్‌ 9వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. అశుతోష్‌ ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్‌గా మలిచాడు. షెపర్డ్‌ 10వ ఓవర్లో 4,6 చెలరేగాడు. ఈ ఇద్దరి దూకుడుతో లక్ష్యం దిశగా సాగుతున్న పంజాబ్‌ను బుమ్రా మరోసారి దెబ్బకొట్టాడు. 13వ ఓవర్లో రెండోసారి బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా.. శశాంక్‌ను ఔట్‌ చేయడంతో 34 పరుగుల ఏడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. కానీ శశాంక్‌ ఔట్‌ అయినా అశుతోష్‌ మాత్రం పోరాటాన్ని ఆపలేదు. తనదైన షాట్లతో అభిమానులను హోరెత్తించాడు. ఈ క్రమంలో అతడు 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేశాడు. హర్‌ప్రీత్‌ బ్రర్‌ (21) అతడికి అండగా నిలిచాడు.

సంక్షిప్త స్కోర్లు

ముంబై : 20 ఓవర్లలో 192/7 (సూర్య 78, రోహిత్‌ 36, హర్షల్‌ 3/31, కరన్‌ 2/41). పంజాబ్‌ : 19.1 ఓవర్లలో 183 (అశుతోష్‌ 61, శశాంక్‌ 41, బుమ్రా 3/21, కొయెట్జీ 3/32)

2024-04-18T23:16:52Z dg43tfdfdgfd