IPL 2024లో కొత్త సంప్రదాయం.. హోంగ్రౌండ్‌లో ఆడితే విజయం ఖాయం.. ఎస్ఆర్‌హెచ్ అదే చేస్తుందా?

ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ వేదికగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల తలపడనున్నాయి. రెండు జట్లూ కూడా కొత్త కెప్టెన్లతోనే ఈ సీజన్‌లో బరిలోకి దిగాయి. కానీ తొలి మ్యాచులో ఓడి సీజన్‌ను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచులో ఓ జట్టు తొలి విజయం నమోదు చేయనుంది. ఈ రోజు జరిగే మ్యాచులో బోణీ కొట్టేది ఎవరు? పాయింట్ల ఖాతా తెరిచేది ఎవరు?

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ దాదాపు గెలిచినంత పని చేసింది. హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్ సంచలన బ్యాటింగ్‌తో విజయానికి చేరువ చేసినా.. హర్షిత్ రాణా సూపర్ బౌలింగ్‌తో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. ముంబై ఇండియన్స్ జట్టుది కూడా అదే పరిస్థితి. గుజరాత్‌తో మ్యాచులో చివరి బంతి వరకు విజయం కోసం పోరాడినా.. నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది.

కాగా సొంతగడ్డపై ఆడుతుండటం సన్ రైజర్స్‌కు కలిసొచ్చే అంశం. ఈ సీజన్‌లో హైదరాబాద్ వేదికగా ఇదే తొలి మ్యాచ్. దీంతో సొంతగడ్డపై తొలి విజయాన్ని అందుకోవాలని సన్ రైజర్స్ భావిస్తోంది. కెప్టెన్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మార్యో జాన్సన్, నటరాజన్‌లతో కూడిన బౌలింగ్ దళం.. రోహిత్ శర్మ, డివాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్, హార్దిక్ పాండ్యాలతో కూడి ముంబై బ్యాటర్లను ఏమేరకు కట్టడి చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

ఐపీఎల్‌లో ఇప్పటివరకు 21 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో ముంబైదే పైచేయి ఉంది. ఆ జట్టు 12 సార్లు.. సన్ రైజర్స్ 9 సార్లు విజయం సాధించాయి. ఇరు జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచుల్లో ముంబై నాలుగు సార్లు గెలుపొందింది. సన్ రైజర్స్ ఒక మ్యాచులోనే గెలిచింది.

ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇప్పటివరకు ఐపీఎల్ 2024లో ఏడు మ్యాచులు జరిగాయి. అయితే అన్నింట్లోనూ సొంతగడ్డపై ఆడిన జట్లే విజయం సాధించడం గమనార్హం. మరి సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది.

కాగా రెండు జట్ల ప్రాక్టీస్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. గత మ్యాచులో మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన తర్వాత కేకేఆర్ బౌలర్ హర్షిత్ రాణా ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అగర్వాల్‌ను ఆటపట్టిస్తూ రోహిత్ కూడా ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు.

తుది జట్లు అంచనా:

సన్ రైజర్స్: మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సన్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి. నటరాజన్

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, షామ్స్ ములానీ, పియూష్ చావ్లా, గెరాల్డ్ కొయెట్జీ, జస్‌ప్రీత్ బుమ్రా, ల్యూక్ వుడ్

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-27T04:48:28Z dg43tfdfdgfd