IPL 2024 | బంతిపై అంత క‌సి ఎందుకో.. ఫినిష‌ర్‌గా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడేదెవ‌రో?

IPL 2024 : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో అన్నీ శుభ‌శ‌కున‌ములే కనిపిస్తున్నాయి. ప్ర‌తి సీజ‌న్‌లో ఒక కొత్త స్టార్ పుట్టుకొచ్చిన‌ట్టే.. ఈ సీజ‌న్‌లోనూ కొత్త స్టార్ ఆవిర్భ‌వించాడు. అత‌డే అశుతోష్ శ‌ర్మ‌(Ashutosh Sharma). మెగా టోర్నీలో రెప్ప‌పాటులో విధ్వంసం సృష్టిస్తున్న ఈ యంగ్‌స్ట‌ర్ పంజాబ్ కింగ్స్(Punjab Kings) విజ‌యాల్లో త‌న ముద్ర వేస్తున్నాడు. ఈ కుర్ర హిట్ట‌ర్ ఆట‌కు స్టేడియాలు ద‌ద్ద‌రిల్లిపోతున్నాయ్‌.. బౌల‌ర్లు ఎక్క‌డ బంతులు వేయాలి? అని త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. దాంతో, టీమిండియా న‌యా ఫినిష‌ర్‌గా చాన్స్ కోసం క‌ర్చీఫ్ వేసిన రింకూ సింగ్(Rinku Singh), రియాన్ ప‌రాగ్‌(Riyan Parag), శివం దూబే(Shivam Dube)ల‌కు అశుతోష్ గ‌ట్టి పోటీనిస్తున్నాడు. ప‌దిహేడో సీజ‌న్‌లో బంతిపై క‌సితో కొడుతున్న ఈ యంగ్‌స్ట‌ర్ వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో ఉండాల‌ని మాజీలంతా ముక్త‌కంఠంతో కోరుతున్నారు.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ బృందం ఎంపిక‌పై భారీగా క‌స‌ర‌త్తు చేస్తున్న‌ టీమిండియా సెలెక్ట‌ర్లకు కుర్రాళ్లు స‌వాల్ విసురుతున్నారు. ఒక‌రిని మించి ఒక‌రు త‌మ ప‌వ‌ర్ హిట్టింగ్‌తో బిత్త‌ర‌పోయేలా చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఫినిష‌ర్‌గా రింకూ సింగ్, రియాన్ ప‌రాగ్, శివం దూబేల‌లో ఒక‌రు ఖాయం అనుకుంటుండ‌గా.. నేనూ రేసులో ఉన్నానంటూ దూసుకొచ్చాడు కొత్త కెర‌టం అశుతోష్ శ‌ర్మ‌. ఎనిమిదో స్థానంలో సంచ‌ల‌న ఇన్నింగ్స్‌లు ఆడుతున్న ఈ హిట్ట‌ర్.. పంజాబ్‌కు కొండంత భ‌రోసానిస్తున్నాడు.

రియాన్ ప‌రాగ్‌, రింకూ సింగ్ 

 

అశుతోష్ లెక్క త‌ప్ప‌ని టైమింగ్, ఫుల్ షాట్ల‌తో సిక్స‌ర్లు బాద‌డం, బుమ్రా బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడ‌డం.. ఇవ‌న్నీ అద్బుతం అంటున్నారు క్రికెట్ విశ్లేష‌కులు. అయితే.. ఈ సీజ‌న్‌లో మెరుపులు మెరిపిస్తున్న దూబే, సిక్స‌ర్ల రింకూ, నిల‌క‌డ‌గా రాణిస్తున్న ప‌రాగ్‌ల‌ను దాటుకొని వ‌ర‌ల్డ్ కప్ బృందంలో చోటు ద‌క్కించుకుంటాడా? అనేది తెలియాల్సి ఉంది.

 

సంచ‌ల‌న ఇన్నింగ్స్‌ల‌కు కేరాఫ్

ప‌దిహేడో సీజ‌న్‌లో రింకూ మెరుపులు అంత‌గా క‌నిపించ‌ట్లే. దూబే, ప‌రాగ్‌లు మాత్రం ఓ రేంజ్లో ఆడుతూ బౌల‌ర్ల వెన్నులో వ‌ణుకుపుట్టిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రు ఫినిష‌ర్ స్థానం కోసం పోటీప‌డుతున్న వేళ‌.. అశుతోష్ సంచ‌ల‌న ఇన్నింగ్స్‌ల‌కు కేరాఫ్ అయ్యాడు. మ్యాచ్ మ్యాచ్‌కు రాటుదేలుతున్న ఈ రైట్ హ్యాండ‌ర్ భారీ సిక్స‌ర్లు కొడుతూ మ్యాచ్‌ను మ‌లుపు తిప్పుతున్నాడు. గుజ‌రాత్ టైటాన్స్‌పై ఇంప్యాక్ట్ స‌బ్‌గా ఆడిన అశుతోష్ 17 బంతుల్లోనే 31 ర‌న్స్‌తో జ‌ట్టుకు ఒంటిచేత్తే విజ‌యాన్ని అందించాడు. ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌పై 15 బంతుల్లో 33 నాటౌట్, రాజ‌స్థాన్‌పై 16 బంతుల్లో 31 ప‌రుగులు చేసి పంజాబ్‌ను గెలిపించినంత ప‌నిచేశాడు.

 

28 బంతుల్లోనే 61

ఇక గురువారం ముంబై ఇండియ‌న్స్‌పై అశుతోష్ విధ్వంస‌మే సృష్టించాడు. 77 ప‌రుగుల‌కే 6 వికెట్లు ప‌డిన వేళ క్రీజులోకి వ‌చ్చిన అత‌డు సిక్స‌ర్ల మోత‌తో అల‌రించాడు. బుమ్రా, గెరాల్డ్ కొయెట్జీల‌ను ఉతికారేస్తూ.. 28 బంతుల్లోనే 61 ప‌రుగులు బాది పంజాబ్‌ను గెలుపు వాకిట నిలిపాడు. అశుతోష్ మెరుపు బ్యాటింగ్ చూసిన మిస్ట‌ర్ 360 సూర్య‌కుమార్ సైతం ‘భ‌లే ఆడావ్’ అంటూ కితాబిచ్చాడు. ఇంకేముందు ఈ పంజాబ్ స్టార్ త్వ‌ర‌లోనే టీమిండియా జెర్సీ వేసుకోవ‌డం ప‌క్కా అని మాజీ క్రికెట‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. జూన్ 1న మొద‌ల‌య్యే పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ పోటీల‌కు సెలెక్ట‌ర్లు ఐపీఎల్ మ‌ధ్య‌లోనే భార‌త‌ బృందాన్ని ప్ర‌క‌టించే చాన్స్ ఉంది.

2024-04-19T12:02:13Z dg43tfdfdgfd