IPL 2024 | ఐపీఎల్‌కు సీఎస్కే ఓపెన‌ర్ దూరం.. ఇంగ్లండ్ పేస‌ర్‌కు చాన్స్

IPL 2024 : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో ఓపెనింగ్ క‌ష్టాలు ఎదుర్కొంటున్న చెన్నై సూప‌ర్ కింగ్స్‌(Chennai Super Kings)కు భారీ షాక్. ఆ జ‌ట్టు స్టార్ ఓపెన‌ర్ డెవాన్ కాన్వే(Devan Conway) మెగా టోర్నీ మొత్తానికి దూర‌మ‌య్యాడు. దాంతో అత‌డి రాక‌కోసం నిరీక్షించిన సీఎస్కే మేనేజ్‌మెంట్, అభిమానుల‌కు నిరాశే మిగిలింది. కాన్వే ప‌దిహేడో సీజ‌న్ నుంచి వైదొల‌గ‌డంతో గురువారం సూప‌ర్ కింగ్స్ కీల‌క నిర్ణయం తీసుకుంది. ఈ కివీ ఓపెన‌ర్ స్థానంలో ఇంగ్లండ్ బౌల‌ర్‌ రిచ‌ర్డ్ గ్లీస‌న్‌(Richard Gleeson)తో ఒప్పందం చేసుకుంది.

గ్లీస‌న్‌ను ఎల్లో జెర్సీ క్ల‌బ్‌లోకి ఆహ్వానిస్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఈ సీజ‌న్‌లో గ్లీస‌న్‌కు చెన్నై ఫ్రాంచైజీ రూ.50 లక్ష‌లు చెల్లించ‌నుంది. ఇంగ్లండ్ టీ20 జ‌ట్టు రిజ‌ర్వ్ ఆట‌గాడైన గ్లీస‌న్ ఇప్ప‌ట‌వ‌ర‌కూ ఆరు మ్యాచ్‌లు ఆడాడంతే. 20.77 ఎకామ‌న‌మీతో 9 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

బొట‌న వేలికి స‌ర్జ‌రీ

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన‌టెస్టు సిరీస్‌లో కాన్వే గాయ‌ప‌డ్డాడు. స్కానింగ్‌ల అనంత‌రం అత‌డి ఎడ‌మ చేతి బొట‌న వేలికి స‌ర్జ‌రీ అనివార్య‌మ‌ని వైద్యులు చెప్పారు. దాంతో, ఈ లెఫ్ట్ హ్యాండ‌ర్ స‌ర్జ‌రీ చేయించుకోవాల్సి వ‌చ్చింది. కాన్వే కోలుకునేందుకు 8 వారాల పైనే అంటే దాదాపు రెండు నెల‌లు ప‌ట్ట‌నుంద‌ని భావించారు.

 

17వ సీజ‌న్ తొలి అర్థ భాగం ముగిసేలోపు కాన్వే జ‌ట్టుతో క‌లుస్తాడ‌ని సీఎస్కే యాజ‌మాన్యం అనుకుంది. అయితే.. కాన్వే ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించ‌లేదు. ఐపీఎల్‌లో విజ‌య‌వంత‌మైన ఓపెనర్ల‌లో ఒక‌డైన కాన్వే 16వ సీజ‌న్‌లో దంచాడు. 51.69 స‌గ‌టుతో 672 ప‌రుగులు సాధించాడు. 139.71 స్ట్ర‌యిక్ రేటుతో ఆడిన అత‌డు ఆరు హాఫ్ సెంచ‌రీలు బాదాడు.

2024-04-18T11:31:39Z dg43tfdfdgfd