IPL 2024 SRH VS MI | ఐపీఎల్ ‘రికార్డు బ్రేక‌ర్’ స‌న్‌రైజ‌ర్స్.. ముంబైపై సూప‌ర్ విక్ట‌రీ

IPL 2024 SRH vs MI : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ 17వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(SRH) బోణీ కొట్టింది. రికార్డు స్కోర్‌తో చ‌రిత్ర సృష్టించిన క‌మిన్స్ సేన ముంబై ఇండియ‌న్స్‌(Mumbai Indians)ను చిత్తుగా ఓడించింది. భారీ స్కోర్లు న‌మోదైన మ్యాచ్‌లో 31 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. హెన్రిచ్ క్లాసెన్(80), అభిషేక్ శ‌ర్మ‌(63), ట్రావిస్ హెడ్(62) మెరుపు ఇన్నింగ్స్‌తో చెల‌రేగ‌గా.. బౌల‌ర్లు ముంబై బ్యాట‌ర్ల‌కు ముకుతాడు వేశారు. దాంతో, ఆరెంజ్ ఆర్మీ సొంత ఇలాకాలో భారీ విజ‌యం సాధించింది. ముంబై ఆట‌గాళ్ల‌తో తిల‌క్ వ‌ర్మ‌(64) ఒంట‌రి పోరాటం చేశాడు. హైద‌రాబాద్ బౌల‌ర్లలో క‌మిన్స్, ఉనాద్కాత్‌లు రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టారు.

ఉప్ప‌ల్ స్టేడియంలో బుధ‌వారం సిక్స‌ర్ల వ‌ర్షం కురిసింది. సొంత ప్రేక్ష‌కుల స‌మ‌క్షంలో ఆరెంజ్ ఆర్మీ ఆట‌గాళ్లు చిత‌క్కొట్టగా.. స్టేడియం వెళ్లిన అభిమానులంతా బౌండ‌రీల జ‌డివాన‌లో త‌డిసి ముద్ద‌య్యారు. అరంగేట్రంలోనే ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ (62) 18 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ కొట్టి హైద‌రాబాద్‌ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. హెడ్‌కు జ‌త క‌లిసిన‌ అభిషేక్ శ‌ర్మ‌(63) సైతం త‌న‌ విధ్వంసం కొన‌సాగించాడు.

16 బంతుల్లోనే..

ముంబై బౌల‌ర్ల‌ను ఉతికారేసిన ఈ యంగ్‌స్ట‌ర్ 16 బంతుల్లోనే అర్ధ శ‌త‌కం బాదాడు. హైదరాబాద్ త‌ర‌ఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన ఆట‌గాడిగా అభిషేక్ రికార్డు నెల‌కొల్పాడు. ఆ త‌ర్వాత క్లాసెన్(80), మ‌ర్క్‌ర‌మ్(42) లు సిక్స‌ర్ల‌తో చెల‌రేగి 4వ వికెట్‌కు 116 ర‌న్స్ జోడించారు. దాంతో, హైద‌రాబాద్ ఐపీఎల్ చ‌రిత్ర‌లో రికార్డు స్కోర్ కొట్టింది. 277 ప‌రుగుల‌తో 2013లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు పేరిట ఉన్న 263 ప‌రుగుల రికార్డును బ్రేక్ చేసింది.

ముంబై ధాటిగా..

భారీ ఛేద‌న‌ను ముంబై ధాటిగా ఆరంభించింది. ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్(34) సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. అదే ఊపులో ష‌హ్‌బాజ్ ఓవర్లో సిక్స‌ర్ బాదిన ఇషాన్.. మ‌రో భారీ షాట్ ఆడి బౌండ‌రీ వ‌ద్ద మ‌ర్క్‌ర‌మ్ చేతికి చిక్కాడు. దాంతో, 56 వద్ద ముంబై తొలి వికెట్ ప‌డింది. ఆ త‌ర్వాత రోహిత్(21) తిల‌క్ వ‌ర్మ‌(64), న‌మ‌న్ ధార్(30) ముంబైని పోటీలో నిలిపారు. అయితే.. క‌మిన్స్ తిల‌క్‌ను ఔట్ చేసి హైద‌రాబాద్‌కు బ్రేక్ ఇచ్చాడు. అక్క‌డితో ముంబై ఇన్నింగ్స్ నెమ్మ‌దించింది. కెప్టెన్ పాండ్యా(24), టిమ్ డెవిడ్‌(42 నాటౌట్)లు ధ‌నాధ‌న్ ఆడి ప‌రుగుల అంత‌రాన్ని త‌గ్గించ‌గా.. ముంబై 5 వికెట్ల న‌ష్టానికి 246 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

ఇవి కూడా చ‌ద‌వండి

2024-03-27T18:05:01Z dg43tfdfdgfd