HEINRICH KLASSEN | క్రికెట్ కోస‌మే స్కూల్‌కు.. హోమ్‌వ‌ర్క్ చేయ‌క తిట్లు తిన్న‌

Heinrich Klassen : ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sun risers Hyderabad) ఆట‌కు రికార్డులు బ‌ద్ధ‌లైపోతున్న‌య్. ఈ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల వీర‌కొట్టుడుకు ఐపీఎల్ అత్య‌ధిక స్కోర్ రికార్డు రెండు సార్లు షేక్ అయింది. టీ20ల్లో రెండో అత్య‌ధిక ప‌రుగులు బాదిన జ‌ట్టుగా హైద‌రాబాద్ చ‌రిత్ర పుట‌ల్లో నిలిచింది. స‌న్‌రైజ‌ర్స్ భారీ స్కోర్ల వెనుక ప్ర‌శాంతంగా క‌నిపించే చిచ్చ‌ర‌పిడుగు హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klassen) ఉన్నాడు. స్పిన్, పేస్.. బౌల‌ర్ ఎవ‌రైనా బంతిని రెప్ప‌పాటులో బౌండ‌రీ దాటించే క్లాసెన్ క్రికెటింగ్ జ‌ర్నీ ఆద్యంతం ఆస‌క్తిక‌రం. అవును.. స్కూల్లో సాధార‌ణ విద్యార్థిగా ముద్ర ప‌డినా త‌న సంచ‌ల‌న బ్యాటింగ్‌తో కోట్లాది మంది మ‌న‌సులు గెలిచిన క్లాసెన్ క‌థ ఇది.

క్రికెటర్‌గా ఎన్ని రికార్డులు బ్రేక్ చేసినా.. భార‌త గ‌డ్డ‌పై ఆడితే ఆ కిక్కే వేరు. క్రికెటర్ల‌ను ఎంతగానో ఆరాధించే ఇండియాలో సెంచ‌రీ కొడితే చాలు హీరో అయిన‌ట్టే. టీ20ల ద‌శ‌ను మార్చేసిన ఐపీఎల్(IPL) టోర్నీలో మెరుపులు మెరిపిస్తే.. సిక్స‌ర్ల వ‌ర్షం కురిపిస్తే ఇక ఫ్యాన్స్ గుండెల్లో కొలువైన‌ట్టే. ఇప్పుడు ద‌క్షిణాఫ్రికా స్టార్ క్లాసెన్ సైతం అదే జోష్‌లో ఉన్నాడు. త‌న సంచ‌ల‌న బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానుల ప్రేమ‌ను గెలిచిన క్లాసెన్.. చిన్న‌ప్పుడు చ‌దువుకంటే ఆట‌కే ఎక్కువ ప్రాధాన్య‌మిచ్చాడ‌ట‌. త‌న బాల్యంలో ఒక‌రోజు జ‌రిగిన సంఘ‌ట‌న‌ను స‌న్‌రైజ‌ర్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో అత‌డు పంచుకున్నాడు.

క్రికెట్ ఎక్క‌డికి తీసుకెళ్ల‌దు

‘చిన్న‌ప్ప‌టి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. నిజం చెప్పాలంటే క్రికెట్ కోస‌మే స్కూల్‌కు వెళ్లేటోన్ని. అయితే.. మా మేడ‌మ్ ఒక రోజు ‘క్రికెట్ నిన్ను ఎక్క‌డికి తీసుకెళ్ల‌దు. చదువుపై శ్ర‌ద్ద పెట్టు’ అని గ‌ట్టిగానే చెప్పింది. కానీ నేను వింటేగా. ఆట‌పై ఇష్టంతో హోమ్‌వ‌ర్క్ కూడా స‌రిగ్గా చేసేటోన్ని కాదు. అయితే.. క్రికెట‌ర్ అవ్వాల‌నే నా క‌ల‌ను ఎలాగోలా నిజం చేసుకున్నాను. అయినా స‌రే ఆ రోజు మా మేడం చెప్పిన మాట‌లు నా బుర్ర‌లో అలాగే ఉండిపోయాయి. ఒక్కోసారి ఆ మాట‌లు త‌ల‌చుకొని న‌వ్వుకుంటాను కూడా’ అని క్లాసెన్ వెల్ల‌డించాడు. మ్యాచ్‌విన్న‌ర్‌గా పేరొందిన క్లాసెన్ 2019లో అరంగేట్రం చేశాడు. దక్షిణాఫ్రికా త‌ర‌ఫున మూడు ఫార్మాట్ల‌లో హిట్ కొట్టాడు. అయితే.. కెరీర్ గొప్ప‌గా సాగుతున్న స‌మ‌యంలోనే ఈ విధ్వంస‌క ఆట‌గాడు టెస్టుల‌కు వీడ్కోలు ప‌లికాడు. ప్ర‌స్తుతం టీ20లు, వ‌న్డేల్లో మాత్ర‌మే క్లాసెన్ కొనసాగుతున్నాడు.

నాలుగేండ్ల ప్రేమ‌

క్రికెట‌ర్‌గా ఇర‌గ‌దీస్తున్న క్లాసెన్‌లో ఓ ప్రేమికుడు దాగి ఉన్నాడు. అవును మైదానంలో బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించే అత‌డు ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాలుగేండ్లు ల‌వ్ చేసిన సొనె మార్టిన్స్‌(Sone Martins)తో జీవితాన్ని పంచుకుంటున్నాడు. మార్టిన్స్ ఒక రేడియోగ్రాఫ‌ర్. ఈ జంట‌కు 14 నెల‌ల వ‌య‌సున్న ‘ల‌యా’ అనే పాప ఉంది. ఉప్ప‌ల్ స్టేడియంలో క్లాసెన్ వీర‌బాదుడు బాదుతుంటే చిన్నారి ల‌య మ‌స్త్ మురిసిపోయింద‌నుకో.

 

ఆరెంజ్ ఆర్మీలోకి ఇలా..

సొంత దేశం త‌ర‌ఫున వికెట్ కీప‌ర్‌గా, ఫినిష‌ర్‌గా రాణిస్తున్న క్లాసెన్ ఐపీఎల్‌లోనూ సునామీ సృష్టిస్తున్నాడు. మొద‌ట్లో బెంగ‌ళూరు, రాజ‌స్థాన్ జ‌ట్లకు ఆడిన క్లాసెన్‌.. ఐపీఎల్ 16వ సీజ‌న్ మినీ వేలంలో హైద‌రాబాద్ గూటికి చేరాడు. పొట్టి క్రికెట్‌కు ప‌క్కాగా స‌రిపోయే క్లాసెన్‌ను కావ్యా మార‌న్(Kavya Maran) బృందం ఏకంగా రూ.5.25 కోట్ల‌కు కొన్న‌ది. ఫ్రాంచైజీ త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్న ఈ స‌ఫారీ స్టార్ 16వ సీజ‌న్‌లో కుమ్మేశాడు. ఒక సెంచరీ, రెండు అర్ధ శ‌త‌కాల‌తో 514 ర‌న్స్ సాధించాడు. 2024 ఎడిష‌న్‌లోనూ క్లాసెన్ త‌న బ్యాట్ ప‌వ‌ర్ చూపిస్తూ చెల‌రేగిపోతున్నాడు.

ఆగ్నికి వాయువులా…

ప‌దిహేడో సీజ‌న్‌లో హైద‌రాబాద్ టాపార్డ‌ర్ బ్యాట‌ర్ల విధ్వంసానికి క్లాసెన్ బ్యాటింగ్ కొండంత‌ ప్ల‌స్ అవుతోంది… అగ్నికి వాయువు తోడైన‌ట్టు క్లాసెన్ ధ‌నాధ‌న్ ఆట‌తో స్కోర్‌బోర్డును ప‌రుగులు పెట్టిస్తున్నాడు. తొలుత ముంబైపై 80, బెంగ‌ళూరుపై 67 ర‌న్స్ బాదిన ఈ హిట్ట‌ర్.. ఆరెంజ్ ఆర్మీ రికార్డు స్కోర్‌లో భాగ‌మ‌య్యాడు. ట్రావిస్ హెడ్, క్లాసెన్, మ‌ర్క్‌ర‌మ్, అభిషేక్‌ల విజృంభ‌ణ‌తో హైద‌రాబాద్ .. ముంబై ఇండియ‌న్స్‌పై 277 ర‌న్స్ బాదింది. అనంత‌రం రాయ‌ల్ చాలెంజ‌ర్స్‌పై హెడ్ సెంచ‌రీకి క్లాసెన్ మెరుపులు తోడ‌వ్వ‌డంతో బెంగ‌ళూరు బౌల‌ర్లు 287 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నారు. అంతే.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయం ఆవిష్కృత‌మైంది.

2024-04-19T13:02:20Z dg43tfdfdgfd