CHAMPIONS TROPHY 2025 | లాహోర్‌లో భార‌త్, పాక్ మ్యాచ్.. షెడ్యూల్ తెలుసా..?

Champions Trophy 2025 : ప్ర‌పంచంలోనే గొప్ప క్రికెట్ స‌మ‌రం ఈసారి పాకిస్థాన్ గ‌డ్డ‌పై జ‌రుగ‌నుంది. న్యూయార్క్‌లో భారత్ (India), పాకిస్థాన్(Pakistan) జ‌ట్ల ఉత్కంఠ పోరాటాన్ని త‌నివితీరా ఆస్వాదించిన ఫ్యాన్స్.. మ‌రో ఎనిమిది నెలల్లో మ‌ళ్లీ హై ఓల్టేజ్ మ్యాచ్ చూడ‌నున్నారు. అవును.. భార‌త్, పాకిస్థాన్‌ జ‌ట్లు చాంపియ‌న్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో మ‌రోసారి ఫ్యాన్స్‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్ట‌నున్నాయి.

వ‌న్డే ఫార్మాట్‌లో జ‌రిగే ఈ మెగా టోర్నీ2025 ఫిబ్ర‌వ‌రి 19 షురూ కానుంది. ఆరంభ పోరు, ఒక సెమీస్ మ్యాచ్ క‌రాచీలో.. రెండో సెమీఫైన‌ల్‌కు రావ‌ల్పిండిలో జ‌రుగ‌నున్నాయి. చిర‌కాల ప్ర‌త్య‌ర్థులైన టీమిండియా, పాక్‌లు లాహోర్ వేదిక‌గా త‌ల‌ప‌డ‌నున్నాయి. అయితే.. అందుకు భార‌త క్రికెట్ బోర్డు అంగీక‌రించాల్సి ఉంటుంది. మార్చి 9న జ‌రిగే ఫైన‌ల్ ఫైట్‌కు క‌రాచీ వేదిక కానుంది.

బీసీసీఐ ‘ఓకే’ అంటేనే..

స‌రిహ‌ద్దు వివాదం కార‌ణంగా భార‌త్, పాక్ జ‌ట్ల మ‌ధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు మూల‌న‌ప‌డ్డాయి. కానీ, అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) నిర్వ‌హించే త‌ట‌స్థ వేదిక‌లపై ఇరుజ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా భార‌త జ‌ట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ(BCCI) స‌సేమిరా అంటోంది. నిరుడు ఆసియా క‌ప్ కోసం కూడా దాయ‌ది గ‌డ్డ‌పై టీమిండియా కాలు మోప‌లేదు.

 

అయితే.. భార‌త్ ఆతిథ్య‌మిచ్చిన వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాకిస్థాన్ ఆడింది కాబ‌ట్టి ఈసారి మ‌న జ‌ట్టు అక్క‌డికి వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఒక‌వేళ చాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త జ‌ట్టు సెమీస్‌కు అర్హ‌త సాధిస్తే… ఆ మ్యాచ్‌ను కూడా లాహోర్‌లో నిర్వహించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) సిద్ధంగా ఉంది. ఈసారి ఈ ట్రోఫీలో మొత్తం 8 జ‌ట్లు పాల్గొంటున్నాయి.15 మ్యాచ్‌ల త‌ర్వాత ఫైన‌ల్ బెర్తులు ఖ‌రార‌వుతాయి.

ఇవి కూడా చ‌ద‌వండి

2024-06-10T14:08:02Z dg43tfdfdgfd