CARLOS ALCARAZ | కింగ్‌ అల్కారజ్‌.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నయా సంచలనం!

  • తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ కైవసం
  • ఫైనల్లో జ్వెరెవ్‌పై అద్భుత విజయం

Carlos Alcaraz | పారిస్‌: ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో నయా సంచలనం! ఆరాధ్య ఆటగాడు రఫెల్‌ నాదల్‌ ఆదిలోనే నిష్క్రమించిన వేళ తాను ఉన్నానంటూ స్పెయిన్‌ స్టార్‌ కార్లోస్‌ అల్కారజ్‌ కొత్త చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో అల్కారజ్‌ 6-3, 2-6, 5-7, 6-1, 6-2తో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌(జర్మనీ)పై అద్భుత విజయం సాధించాడు. నాలుగు గంటల 19 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో ఈ ఇద్దరు ప్లేయర్లు కొదమసింహాల్లా కొట్లాడారు. తొలి సెట్‌ను 6-3తో కైవసం చేసుకున్న అల్కారజ్‌కు జ్వెరెవ్‌ దీటైన పోటీనిచ్చాడు. తన అనుభవాన్ని ఉపయోగించుకుంటూ వరుసగా సెట్లు కైవసం చేసుకుని పోరును రసవత్తరంగా మార్చాడు. అయితే ఇక్కడే అల్కారజ్‌ తనలో పోరాట యోధున్ని తట్టిలేపాడు. పోరాడితే పోయేది ఏమి లేదన్న తరహాలో నాలుగో సెట్‌ను 6-1తో కైవసం చేసుకున్న ఈ స్పెయిన్‌ బుల్‌ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. అదే దూకుడు కొనసాగిస్తూ జ్వెరెవ్‌కు ఎక్కడా అవకాశమివ్వకుండా నిర్ణయాత్మక ఐదో సెట్‌ను ఖాతాలో వేసుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. చివరి 15 గేముల్లో 12 గేమ్‌లను కాపాడుకున్న అల్కారజ్‌ విజయం వైపు నిలిచాడు. ఈ క్రమం లో 52 విన్నర్లు కొట్టిన అల్కారజ్‌ మ్యాచ్‌పై పట్టు నిలుపుకున్నాడు. మరోవైపు జ్వెరెవ్‌ 41 అనవసర తప్పిదాలతో గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

1 పిన్న వయసు(21 ఏండ్లు)లో మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన తొలి ప్లేయర్‌గా అల్కారజ్‌ నిలిచాడు.

3 కార్లోస్‌ అల్కారజ్‌ ఆడిన మూడు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచాడు.

ప్రైజ్‌మనీ

విజేత: అల్కారజ్‌ [21.65 కోట్లు]

రన్నరప్‌: జ్వెరెవ్‌ [10.82 కోట్లు]

2024-06-10T00:36:03Z dg43tfdfdgfd