AFG VS NZ T20 WC: కివీస్‌కు అఫ్ఘానిస్థాన్ షాక్.. మరొక్క మ్యాచ్ గెలిస్తే సూపర్-8 చేరినట్లే..!

టీ20 ప్రపంచకప్ 2024లో వరుస సంచలనాలు నమోదు అవుతున్నాయి. పటిష్ట పాకిస్థాన్‌ను ఓడించి యూఎస్ఏ ఔరా అనిపించగా.. న్యూజిలాండ్ జట్టును అప్ఘానిస్థాన్ చిత్తు చిత్తుగా ఓడించింది. గ్రూప్-సిలో భాగంగా గయానా వేదికగా జరిగిన మ్యాచులో 84 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్.. 159/6 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్‌ను 75 పరుగులకే కుప్పకూల్చింది.

టీ20 ప్రపంచకప్ 2024లో తాను ఆడుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ట్రెంట్ బౌల్ట్, మ్యాట్ హెన్రీ, లుకీ ఫెర్గుసన్‌లతో కూడిన కివీస్.. అఫ్ఘాన్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేస్తుందని భావించింది. అయితే కివీస్ అంచనాలను తారుమారు చేస్తూ.. అప్ఘాన్ ఓపెనర్లు రెచ్చిపోయారు. తొలి వికెట్‌కు ఏకంగా వంద పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఓపెనర్ గుర్బాజ్ 56 బంతుల్లో 80 రన్స్ స్కోరు చేశాడు. మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 41 బంతుల్లో 44 పరుగులు చేశాడు.

అయితే తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించిన అనంతరం ఇబ్రహీం జద్రాన్ ఔట్ అయ్యాడు. ఈ సమయంలోనే స్వల్ప వ్యవధిలోనే వికెట్లు తీసిన కివీస్ బౌలర్లు.. అఫ్ఘానిస్థాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. నబీ (0), రషీద్ ఖాన్ (6), గుల్బాదిన్ (0) త్వరగా ఔట్ అయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు స్కోరు చేసింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, మ్యాట్ హెన్రీ 2, లుకీ ఫెర్గుసన్ 1 వికెట్ తీశారు.

మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు తొలి బంతికే షాక్ తగిలింది. ఫజల్ హక్ ఫరూఖీ బౌలింగ్‌లో ఫిన్ ఆలెన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కూడా వచ్చిన బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. డెవాన్ కాన్వే (8), కేన్ విలియమ్సన్ (9), డేరిల్ మిచెల్ (5), మార్క్ చాప్‌మన్ (4), మైకెల్ బ్రేస్‌వెల్ (0), మిచెల్ శాంట్నర్ (4) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. దీంతో అనూహ్యంగా కివీస్ తడబడింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (18), మ్యాట్ హెన్రీ (12) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

అప్ఘానిస్థాన్ బౌలర్లలో ఫజల్‌హక్ ఫరూఖీ 4, రషీద్ ఖాన్ 4 వికెట్లతో న్యూజిలాండ్ బౌలర్ల పతనాన్ని శాసించారు. మహమ్మద్ నబీ సైతం 2 వికెట్లు తీశాడు. ఇక టోర్నీలో వరుసగా రెండు విజయాలు సాధించిన అప్ఘానిస్థాన్.. గ్రూప్-సిలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అఫ్ఘాన్ తన తర్వాతి మ్యాచులో పపువా న్యూగినియా, వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇందులో రెండు గెలిస్తే నేరుగా సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఒక్కదాంట్లో గెలిచినా తదుపరి రౌండ్‌కు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచులోనే చిత్తుగా ఓడిన న్యూజిలాండ్ -4.200 రన్‌రేట్‌తో చివరి స్థానంలో ఉంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-08T04:49:40Z dg43tfdfdgfd